పంత్ పరుగులు పనికిరావా!
ఈ సీజన్లో విశేషంగా రాణించిన ఢిల్లీ క్రికెటర్
రంజీ ట్రోఫీలో పలు రికార్డులతో టాప్ స్కోరర్ అవకాశం ఉన్నా కరుణించని సెలక్టర్లు
►మొదటి ఆటగాడు 9 ఇన్నింగ్స్ లో 874 పరుగులు చేశాడు. సగటు 97.11. స్ట్రరుుక్ రేట్ 114. 4 సెంచరీలు, 2 అర్ధసెంచరీలు.
►ఇందులో ఓ ట్రిపుల్ సెంచరీ. అలాగే భారత ఫస్ట్‌క్లాస్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన రికార్డు.
►రెండో ఆటగాడు 8 ఇన్నింగ్స్ లో 415 పరుగులు చేశాడు. సగటు 59.28. స్ట్రరుుక్ రేట్ 67.58. ఒక సెంచరీ, మూడు అర్ధసెంచరీలు. అత్యధిక స్కోరు 139.
► ఈ ఇద్దరిలో ఒకరిని జట్టులోకి ఎంపిక చేయాలి. ఎవరైనా సరే మొదటి ఆటగాడినే ఎంచుకుంటారు. కానీ భారత సెలక్టర్లు మాత్రం రెండో ఆటగాడిని జట్టులోకి తీసుకున్నారు. ఇక్కడ మొదటి ఆటగాడు ఢిల్లీకి చెందిన 19 ఏళ్ల రిషబ్ పంత్. రెండో ఆటగాడు పార్థీవ్ పటేల్. సాహా గాయపడటంతో ఇంగ్లండ్‌తో మూడో టెస్టుకు వికెట్ కీపర్ అవసరమయ్యాడు. మన సెలక్టర్లు పంత్‌ను కాదని పార్థీవ్ను ఎందుకు ఎంపిక చేశారో వాళ్లకే తెలియాలి.
సాక్షి క్రీడావిభాగం
గత ఏడాది కాలంలో భారత క్రికెట్లో పెను సంచలనం ఢిల్లీకి చెందిన యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్. బ్యాటింగ్‌లో సెహ్వాగ్‌ను మించిన దూకుడుతో ప్రత్యర్థులను వణికిస్తున్నాడు. అండర్-19 ప్రపంచకప్, ఐపీఎల్, ఈ సీజన్ రంజీట్రోఫీలో నిలకడగా ఆడాడు. నిజానికి తను ఎంత బాగా ఆడుతున్నాడంటే... ఈ యువ క్రికెటర్‌ను నియంత్రించడానికి ప్రత్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. తన ప్రదర్శనతో ఇప్పటికే జాతీయ జట్టుకు ఆడే అర్హత తనకు ఉందని నిరూపించుకున్నాడు. కానీ టెస్టుల్లో సాహా, వన్డేల్లో ధోని తుది జట్టులో ఉండటం వల్ల ఇప్పట్లో తనకు అవకాశం కష్టంగా కనిపించింది. అరుుతే ఇంగ్లండ్‌తో మూడో టెస్టుకు సాహా అందుబాటులో లేకపోవడంతో మరో కీపర్‌ను ఎంచుకునే అవకాశం లభించింది. అనూహ్యంగా పంత్‌ను పట్టించుకోకుండా పార్థీవ్ను తెచ్చారు.
సచిన్ 16 ఏళ్లకు రాలేదా?
రిషబ్ పంత్ వయసు 19 ఏళ్లు. ఇప్పుడే టెస్టు ఆడించడం కష్టం అని బీసీసీఐకి చెందిన అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. కానీ 16 ఏళ్ల వయసులో అరంగేట్రం చేసి ఆటను శాసించిన సచిన్ గురించి గుర్తుంచుకుని ఉంటే ఈ మాట అనేవారు కాదేమో. వయసు ఎప్పుడూ అర్హత కాదు. ‘పార్థీవ్ ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మన్ కాబట్టి... దినేశ్ కార్తీక్ బదులు తనను ఎంచుకున్నాం’ అనే మాట కూడా ఆ అధికారి చెప్పారు. అలా అరుుతే రిషబ్ పంత్ కూడా ఎడమచేతి వాటం ఆటగాడే. కాబట్టి ఈ రెండూ సరైన కారణాలు కావని స్పష్టంగా అర్థమవుతోంది. ఒక్క సీజన్ కూడా పూర్తిగా ఆడకుండా ఎలా తీసుకుంటారనే ప్రశ్న కూడా వినిపించింది. రిషబ్ గత ఏడాది రంజీ సీజన్లో అరంగేట్రం చేసి... తొలి మ్యాచ్‌లోనే అర్ధసెంచరీ చేశాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్‌లో జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లోనూ విశేషంగా రాణించి భారత్‌ను ఫైనల్‌కు చేర్చాడు. కేవలం ఆ ప్రదర్శన వల్లే ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు తన బేస్ ప్రైస్‌కు 20 రెట్లు అధికంగా చెల్లించి పంత్‌ను ఐపీఎల్ కోసం తీసుకుంది. ఐపీఎల్‌లోనూ తను విశేషంగా ఆకట్టుకున్నాడు. ఈ సీజన్ రంజీల్లో తన ప్రదర్శన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
ఎలాంటి సందేశం ఇస్తున్నారంటే...
గత రంజీ సీజన్లో ముంబై క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ విశేషంగా రాణించాడు. కానీ తనకు ఏ స్థారుులోనూ అవకాశం రాలేదు. ఈ సీజన్లో తన ప్రదర్శన దిగజారిపోరుుంది. ఒక రకంగా తన ఆత్మవిశ్వాసం దెబ్బతింది. అలాంటి స్థితి యువ క్రికెటర్లకు రాకూడదు. వచ్చే ప్రపంచకప్ వరకూ ప్రణాళిక సిద్ధంగా ఉందని, బెంచ్ బలాన్ని పెంచుతామని పదే పదే చెబుతున్న సెలక్టర్లు... పంత్ లాంటి యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వకపోవడం వల్ల చెడు సందేశం పంపుతున్నట్లరుుంది. ఇది భారత క్రికెట్‌కు ఏ మాత్రం మేలు చేయదు.
అనుభవం వచ్చేదెలా..?
రంజీట్రోఫీ అనేది భారత జట్టులోకి రాచమార్గం. ఎవరైనా ఆటగాడు గాయపడినా రంజీల్లో ఆడి ఫిట్నెస్ను నిరూపించుకున్నాకే తిరిగి జట్టులోకి తీసుకుంటామని ఇప్పటికే కుంబ్లే స్పష్టం చేశాడు. మరి అంత ప్రాధాన్యత ఉన్న రంజీల్లో చేసిన పరుగులకు విలువ ఇవ్వకపోతే ఎలా? ఏమైనా ఒక్క మ్యాచ్‌కే కదా అని కూడా అనొచ్చు. నిజానికి పంత్‌కు అవకాశం ఇస్తే... ఒకవేళ ఆ మ్యాచ్‌లో అతను భారీ ఇన్నింగ్స ఆడితే తర్వాత కూడా కొనసాగించవచ్చు కదా. సాహా నిజానికి గొప్ప బ్యాట్స్‌మన్ కాదు. పంత్ అతనికంటే బాగా ఆడతాడో లేదో తెలియాలంటే అవకాశం ఇవ్వాల్సింది. అలా కాకుండా అనుభవం కావాలంటే ఎలా వస్తుంది. నిజానికి ప్రస్తుత సెలక్షన్ కమిటీ నిర్ణయాల్లో కుంబ్లే ముద్ర బాగా కనిపిస్తోంది. పార్థీవ్ ఎంపికలోనూ కుంబ్లే పాత్ర ఉందనడంలో సందేహం లేదు. ‘పంత్ బాగా ఆడుతున్నాడు. ఒక యువ బ్యాట్స్‌మన్‌లో ఉండాల్సిన ఎనర్జీ తనలో ఉంది. అరుుతే పార్థీవ్కు అనుభవం ఉన్నందున అతనివైపు మొగ్గుచూపాం’ అని కుంబ్లే చెప్పాడు.