
ఇండోర్: మధ్యప్రదేశ్ ఓపెనర్ అజయ్ రొహెరా బరిలోకి దిగిన తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (267 నాటౌట్) సాధించి రికార్డు పుటల్లోకెక్కాడు. ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా హైదరాబాద్‌తో జరిగిన రంజీ మ్యాచ్‌లో 21 ఏళ్ల అజయ్ (345 బంతుల్లో 267 నాటౌట్; 21 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఫస్ట్‌క్లాస్ క్రికెట్ చరిత్రలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. గతంలో ఈ రికార్డు ముంబై ఆటగాడు అమోల్ మజుందార్ (260; హరియాణాపై 1994లో) పేరిట ఉండేది.
అజయ్, యశ్ దూబే (139 నాటౌట్; 18 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటికి మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌ను 562/4 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాట్స్‌మెన్ మరోసారి సమష్టిగా చేతులెత్తేయడంతో హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్‌లో 185 పరుగులకే కుప్పకూలింది. దీంతో మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్ 253 పరుగులతో విజయం సాధించింది. హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 124 పరుగులకే ఆలౌటైంది.