వారి పెళ్లి కేకుకే కోటిన్నర
ఇంగ్లండ్: ఎవరైనా అట్టహాసంగా, ఆర్భాటంగా వివాహం చేసుకుంటే ఆకాశమంతా పందిరివేసి, భూగోళమంతా పీట వేసి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారని చెప్పడం గతం. ఇప్పుడు పెళ్లికి ఎంత ఖర్చు పెట్టారని చెప్పడమే ఆ పెళ్లి ఆర్భాటానికి కొలమానం. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన నల్లజాతి మహిళగా గుర్తింపు పొందిన ఫోలోరన్షో అలకిజా (66) తన కుమారుడు ఫోలారిన్ అలకిజా వివాహాన్ని ఆదివారం అత్యంత ఆర్భాటంగా చేశారు. ఒక్క పెళ్లి రోజునాటి ఖర్చే 50 కోట్ల రూపాయలకు పైమాటట.
ఆక్స్ఫర్డ్షైర్లోని బ్లెన్హైమ్ ప్యాలెస్‌లో ఇరాన్‌కు చెందిన మోడలింగ్ బ్యూటీ నజానిన్ జఫారియాన్తో పెళ్లి జరిగింది. మాన్చెస్టర్ యూనివర్శిటీలో బయో ఇంజనీరింగ్, బయో మెడికల్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రురాలైన జఫారియాన్ మార్కెటింగ్ ఎక్స్‌పర్ట్‌గా, మోడల్‌గా ఇప్పుడు రానిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్, వ్యాపారవేత్తగా బాగా సంపాదిస్తున్న పెళ్లి కూమారుడు ఫోలారిన్కు 30 ఏళ్లు. ఆయనకు ఇది రెండో వివాహం. మొదటి భార్య క్యాన్సర్‌తో చనిపోవడంతో ఆయన ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్నారు.
వీరి పెళ్లి జరిగిన ప్యాలెస్‌కు రూములు కలుపుకొని రోజుకు మూడు కోట్ల రూపాయల అద్దె. పెళ్లి మంటపం అలంకరనకు కోటి తెల్ల గులాబీ పూలను ఉపయోగించారు. పెళ్లి కేకును అలంకరించేందుకే పది లక్షల తెల్ల గులాబీ పూలను ఉపయోగించారట. అలంకరణతో కలిపి ఒక్క కేకుకే కోటిన్నర రూపాయలట. ఇరువర్గాల బంధు, మిత్రులు హాజరైన ఈ వివాహానంలో రాబిన్ థికే లాంటి గాయకులు తమ కచేరీలతో ఆకట్టుకున్నారు. రాబిన్ థికే ఒక కచేరీకి కోటిన్నర రూపాయలు చార్జి చేస్తారు. రెండు బిలియన్ డాలర్ల ఆస్తితో ఆఫ్రికాలో 14వ ధనవంతురాలిగా, బ్రిటన్‌లో నెంబర్ వన్ ధనవంతురాలిగా గుర్తింపుపొందిన ఫోలోరన్షో అలకిజా తన కుమారుడి పెళ్లికి ఎంత ఖర్చు పెట్టినా తక్కువేనని సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు. చమురు వ్యాపారం ద్వారా ఆమె ఈ ఆస్తిని సంపాదించారు.