ప్రాణాలు తీసిన ఈత సరదా
పోపూరు (చందర్లపాడు), న్యూస్‌లైన్ : ఇద్దరు చిన్నారుల ఈత సరదా వారి ప్రాణాలనే తీసింది. మండలంలోని పోపూరులో బుధవారం జరిగిన ఈ ఘటన వారి కన్నవారికి తీరని శోకం మిగిల్చింది. గ్రామశివారులోని ఆంజనేయ స్వామి ఆలయానికి సమీపంలో కొంతకాలంగా గ్రావెల్ క్వారీ కొనసాగుతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు క్వారీలో భారీగా నీరు చేరింది. సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో నందిగామలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న గడ్డం సాంబశివరావు (11), స్థానిక ఎంపీపీ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న గడ్డం మణికంఠ (9) ఇంటి వద్దే ఉంటున్నారు.
బుధవారం ఆటలాడుకుంటూ గ్రామ శివారులోని క్వారీ వద్దకు వెళ్లి ఈత కొట్టేందుకు యత్నించారు. ఒక్కసారిగా లోతైన ప్రదేశంలోకి వెళ్లడంతో మునిగిపోయారు. పరిసరాల్లో ఎవరూ లేకపోవడంతో కాపాడేవారు లేక నీటిలో ఊపిరాడక మృతి చెందారు. ఎంతసేపటికీ పిల్లలు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వాకబు చేయడంతో క్వారీలోకి దిగిన విషయం తెలిసింది. గ్రామస్తుల నీటిలో గాలించగా మృతదేహాలు బయటపడ్డాయి.
సాంబశివరావు తండ్రి పెదపుల్లయ్య మూడేళ్ల క్రితమే అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో తల్లి తిరుపతమ్మే వ్యవసాయ పనులకు వెళ్లి ముగ్గురు మగ పిల్లలనూ పోషిస్తోంది. పెద్ద కుమారుడైన సాంబశివరావు ఇప్పుడు మృతిచెందడంతో అతని తల్లి తిరుపతమ్మ గుండెలవిసేలా రోదిస్తోంది. భర్త చనిపోవడంతో పెద్ద కుమారుడు త్వరగా అందివస్తాడనుకున్నానని, చిన్న వయసులోనే ఇలా దూరమవుతాడనుకోలేదని భోరున విలపిస్తోంది.
మరో బాలుడు మణికంఠ తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, మల్లీశ్వరిలకు ఇద్దరు పిల్లలు. మణికంఠతో పాటు మరో కుమార్తె ఉంది. ఉన్న ఒక్క మగ సంతానం దూరమవడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతిచెందిన బాలుర కుటుంబసభ్యులు వ్యవసాయ కూలీలుగా చేస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులను గ్రామ సర్పంచ్ సంగం శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకుడు మామిళ్ల నాగిరెడ్డి తదితరులు పరామర్శించారు. ఘటనాస్థలాన్ని ఎస్ఐ చంద్రశేఖర్ సిబ్బందితో కలసి పరిశీలించారు.
కృష్ణానదిలో బాలుడి గల్లంతు
విజయవాడ : కృష్ణానదిలో స్నానానికి వెళ్లి రణదివె నగర్‌కు చెందిన కంభంపాటి రవికుమార్ గల్లంతయ్యాడు. బుధవారం ఇంటి సమీపంలో జరిగిన దినకర్మ భోజనాల అనంతరం సమీపంలోని నది వద్ద స్నానానికి వెళ్లాడు. ప్రవాహం అధికంగా ఉండటంతో పట్టు తప్పి నీటిలో కొట్టుకుపోవడాన్ని స్థానికులు, కుటుంబ సభ్యులు గమనించి నదిలో దిగి గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.