ఏం కష్టం వచ్చిందో...
♦ ఇద్దరు పిల్లలతో రైలుకింద పడి ఆత్మహత్య
♦ అనుకోని సంఘటనతో అవాక్కయిన ప్రయాణికులు
♦ గరివిడి రైల్వేస్టేషన్లో ఘటన
విజయనగరం జిల్లా : సాయంత్రం నాలుగు గంటలవుతోంది. గరివిడి రైల్వే స్టేషన్లో అక్కడక్కడా ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులు విశ్రమించే బెంచీపై అప్పటివరకూ ఓ మహిళ నిర్వేదంతో కూర్చుని ఉంది. కింద ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ ఆమెను కదిలిస్తున్నారు. కానీ ఆమె ఏమీ పట్టించుకోవడం లేదు. ఇంతలో గాంధీగామ్నుంచి పూరివైపు వెళ్లే స్పెషల్ రైలు వస్తున్నట్టు అనౌన్సర్ ప్రకటన వెలువడింది. అంతలోనే రైలు కూడా స్టేషన్లోకి ప్రవేశించింది. రైలు 20 మీటర్ల దూరంలో ఉందనగా ఒక్కసారిగా ఆ తల్లి తన ఇద్దరు పిల్లల చేతులు పట్టుకుని పట్టాల మీదకు వెళ్లి కూర్చుండిపోయింది. రెప్పపాటు కాలంలోనే జరగరానిది జరిగిపోయింది. అందరూ చూస్తుండగానే వారి శరీర భాగాలు చెల్లాచెదురయ్యాయి. కొద్ది దూరం పాటు రైలుతోపాటు వారి శరీరాలు ఈడ్చుకు పోయాయి. చూస్తున్న వాళ్లంతా కళ్లప్పగించి ఒక్కక్షణం ఊపిరి బిగబట్టి చూస్తుండగానే ఆ ఇద్దరు చిన్నారులు, తల్లి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
గరివిడి మండలం కొండలక్ష్మీపురానికి చెందిన అనూరాధకు శ్రీకాకుళం జిల్లా జి.సిగడాంనకు చెందిన కిలారు శ్రీనివాసరావుతో వివాహమైంది. చిన్నపాటి మిల్లు నడుపుకుంటున్న వారికి అఖిల(3), నందన(5) అనేఇద్దరు పిల్లలు కలిగారు. ముక్కుపచ్చలారని ఆ ఇద్దరు చిన్నారులకు అభం... శుభం... తెలీదు. ఆ తల్లికి ఏం కష్టం వచ్చిందో, కుటుంబ కలహాలో తెలీదు గానీ ఇంతటి అఘాయిత్యానికి పాల్పడింది. మధ్యాహ్నం నుంచే ఆమె అక్కడే స్టేషన ప్లాట్ఫాం వద్ద ఉంది. పిల్లలు అక్కడే ఆడుకుంటున్నారు. కళ్లముందు అప్పటివరకూ సరదాగా గడిపిన ఆ పిల్లలు క్షణకాలంలో విగతజీవులై కనిపించడంతో చూసినవారందరి కల్లల్లో కన్నీటి సుడులు తిరిగాయి. గరివిడి స్టేషన్ మాస్టర్ ఉమారామలింగేశ్వర్రావు శ్రీకాకుళానికి చెందిన సీఆర్పీఎఫ్, విజయనగరం ఆర్పీయఫ్కు సమాచారం ఇచ్చామని, కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తారని తెలిపారు.