ఇన్వెస్ట్ ఇట్ లైక్ బెక్హాం..
కుప్పతెప్పలుగా గోల్స్.. గోల్డెన్ బాల్స్ నిక్‌నేమ్‌తో పేరొందాడు ఫుట్‌బాల్ ప్లేయర్ డేవిడ్ బెక్హాం. ఫుట్‌బాల్ మైదానంలోనే కాదు వ్యాపారం, పెట్టుబడుల బరిలోనూ అదే మెళకువలు పాటిస్తూ, రాణిస్తున్నాడు. బెక్హాం సంపద విలువ సుమారు 300 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. 38 ఏళ్ల వయస్సులో ఇటీవలే రిటైరయిన బెక్హాం ఒకవైపు ఫుట్‌బాలర్‌గా సంపాదిస్తూనే మరోవైపు తెలివిగా ఇన్వెస్ట్ చేస్తూ సంపద విలువను మరింత పెంచుకుంటున్నాడు.
ఉదాహరణకు.. ఎప్పుడో 1999లో 3.2 మిలియన్ డాలర్లు పెట్టి బెక్హాం కొనుక్కున్న ఇల్లు ఇప్పుడు ఏకంగా 29.3 మిలియన్ డాలర్లు పలుకుతోంది. రిటైర్ అయినప్పటికీ.. ఫ్యాషన్, కాస్మెటిక్స్ కంపెనీలు బెక్హాంను విడిచిపెట్టేయలేదు. అతనికి ఇప్పటికీ సింహభాగం ఆదాయం వీటి నుంచే వస్తోంది. తన పేరు మీద బెక్హాం ఇన్స్టింక్ట్ పేరిట ఈ మధ్యే అమెరికాలో ఒక ఆఫ్టర్షేవ్ను ప్రవేశపెట్టేందుకు 13.7 మిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ఈ మధ్య ఇన్వెస్ట్మెంట్ల జోరు మరికాస్త పెంచాడు. ఒక సాకర్ ఫ్రాంచైజీని కొంటున్నాడు. మరోవైపు, కరీబియన్ దీవుల్లో రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌పై దృష్టి పెట్టాడు. హైతీలో పెద్ద ఎత్తున స్థలం కొనబోతున్నాడు. బెక్హాంతో స్ఫూర్తి పొందిన మన దేశీ డెరైక్టర్ ఒకరు బెండ్ ఇట్ లైక్ బెక్హాం అనే సినిమా కూడా తీశారు.
బెక్హాం తరహాలోనే మరో ఫుట్‌బాలర్ లీ జాన్సన్ కూడా పెట్టుబడుల విషయంలో ముందు చూపుతో వ్యవహరిస్తాడు. అయిదేళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నెలకొన్న పరిస్థితుల్లో ధైర్యం చేసి 1.5 మిలియన్ డాలర్లకు ఓ ఇంటిని కొన్నాడు. దానికి మరికొన్ని హంగులు అద్ది.. పరిస్థితులు కాస్త మెరుగుపడగానే 2 మిలియన్ డాలర్లకు అమ్మేశాడు. మాంద్యం సమయంలో కూడా అర మిలియన్ డాలర్ల లాభం జేబులో వేసుకున్నాడు. ఇదే ఊపుమీద మరో ఇరవై ప్రాపర్టీలు కొనేసేందుకు సిద్ధమవుతున్నాడు.