యూపీలో రైలు ప్రమాదం: 20మంది మృతి
ఉత్తరప్రదేశ్లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. గూడ్స్ రైలును గోరఖ్నాథ్ ఎక్స్ప్రెస్ ఢీకొనడంతో 20 మంది మరణించారు. మరో 50 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో ఆగి ఉన్న గూడ్స్ రైలును గోరఖ్నాథ్ ఎక్స్ప్రెస్ ఢీకొన్నట్లు ప్రాథమిక సమాచారం. ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. 50 మంది క్షతగాత్రులు వేర్వేరు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.
రైళ్లు ఢీకొనగానే ఒక ఏసీ, ఒక స్లీపర్, నాలుగు జనరల్ బోగీలు పట్టాలు తప్పాయి. సమాచారం అందగానే సీనియర్ అధికారులు ప్రమాదస్థలానికి తరలి వెళ్లారు. చాలా రైలుబోగీలు గాల్లో పలు అడుగుల ఎత్తున లేచాయని, దీంతో ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగానే ఉందని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. ఈ రైలు గోరఖ్పూర్ నుంచి న్యూఢిల్లీకి బయల్దేరింది. ఎక్స్ప్రెస్ రైలు బోగీలు గూడ్స్ రైలు బోగీలమీదకు ఎక్కేయడంతో వాటిలోంచి క్షతగాత్రులను, మృతదేహాలను బయటకు తీయడం కూడా చాలా కష్టంగా మారింది. వాతావరణం కూడా బాగోకపోవడంతో సహాయ కార్యకలాపాలకు ఆటంకం కలుగుతోంది.