కొనసాగుతున్న ఎస్జీటీ బదిలీలు
- 1601 నుంచి మిగతా వారికి నేడు కౌన్సెలింగ్
- వావిలాలకుంట తండా పీఎస్ ఆప్షన్ ఇచ్చిన ఎస్జీటీ బదిలీ నిలిపివేత
విద్యారణ్యపురి : జిల్లాలోని లోకల్ బాడీ యాజమాన్యాల పరిధి ఎస్జీటీల బదిలీ కౌన్సెలింగ్ ప్రక్రియ ఆదివారం హన్మకొండ ప్రభుత్వ బీఈడీ కాలేజీలో చేపట్టారు. సీనియారిటీ జాబితాలోని క్రమసంఖ్య 601నుంచి 1600 వరకు కౌన్సెలింగ్ ప్రారంభించారు. 366క్రమ సంఖ్య ఎస్జీటీ ఒకరు తనకు వావిలాలకుంట తండా ప్రాథమిక పాఠశాల కావాలని ఈనెల 17న అడిగితే ఖాళీలేదని చెప్పిన అధికారులు.. క్రమసంఖ్య 560గల ఎస్జీటీకి అదే పాఠశాల ఆప్షన్ ఎలా కేటారుుస్తారని పలువురు ఉపాధ్యాయ ప్రతినిధులు డీఈవోను ప్రశ్నించారు. అరుుతే, ఈ బదిలీని తాము నిలిపివేశామని డీఈవో చంద్రమోహన్ తెలిపారు. సదరు ఎస్జీటీని వేరే పాఠశాలకు బదిలీ చేస్తామని చెప్పారు. కాగా, ఆదివారం ఉదయం 8నుంచి 601 క్రమసంఖ్య నుంచి ఎస్జీటీల బదిలీ కౌన్సెలింగ్ ప్రారంభమైంది.
సాయంత్రం 5.30గంటల వరకు 1080క్రమసంఖ్య వరకు కొనసాగుతోంది. కొందరు బదిలీ అవుతుండగా, మరికొందరు నాట్విల్లింగ్ ఇస్తున్నారు. అయితే ఒక్కరోజే 1000మంది వరకు ఎస్జీటీలను కౌన్సెలింగ్కు పిలవడంతో బీఈడీ కాలేజీ ఆవరణ రద్దీగా మారింది. బదిలీ కౌన్సెలింగ్ ప్రక్రియ అర్ధరాత్రి వరకూ కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. ఈనెల 20న క్రమసంఖ్య 1601నుంచి మిగతా ఎస్జీటీల బదిలీ కౌన్సెలింగ్ చేపడతామని, వీరందరూ హాజరు కావాలని డీఈవో కోరారు. సోమవారం చేపట్టే ఈ ప్రక్రియ ద్వారా ఎస్జీటీ ఉపాధ్యాయ బదిలీ కౌన్సెలింగ్ ముగుస్తుంది.