'రాజ్ భవనేమి ఆరెస్సెస్, బీజేపీ హెడ్ క్వార్టర్స్ కాదు'
ఈటానగర్: అరుణాచల్ ప్రదేశ్ రాజ్ భవన్ ఆరెస్సెస్, బీజేపీ హెడ్ క్వార్టర్స్ కాదని ఆ రాష్ట్ర గవర్నర్ జ్యోతి ప్రసాద్ రజ్కోవా అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలపై సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అరుణాచల్ ప్రదేశ్ రాజ్ భవన్ ను గవర్నర్ రజ్కోవా బీజేపీ, ఆరెస్సెస్ ఉన్నత కార్యాలయంగా మార్చారని, వాటి ఏజెంట్ గా పనిచేస్తున్నాడని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో గవర్నర్ స్పందిస్తూ
'నేను ఎవరికీ ఏజెంట్ ను కాదు. ఎప్పటికీ అలా ఉండను. నేనెప్పుడూ రాజ్ భవన్ ను రాజకీయ పార్టీల కార్యాలయంగా మార్చలేదు. భారత రాజ్యాంగానికి కట్టుబడిపనిచేస్తున్నాను. నేను రాజకీయనాయకుడిని కాదు.. ఏ పార్టీలో సభ్యుడిని కాదు. ఎప్పుడూ ఏపార్టీ ఆఫీసుకు కూడా వెళ్లలేదు. నేను నా పరిధిలోనే పనిచేస్తున్నాను' అని రజ్కోవా అన్నారు.
రాష్ట్రపతి పాలన అనేది తాత్కాలికంగా మాత్రమే ఉంటుందని, తర్వాత ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిగి మరో ప్రభుత్వం వస్తుందని చెప్పారు. అప్పటి వరకు శాంతిభద్రతలు, నేరాలు, అవినీతిని అదుపుచేయాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పారు.