Great Online Shopping Festival
-
గూగుల్ ఆన్లైన్ షాపింగ్ ఫెస్టివల్
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ గ్రేట్ ఆన్లైన్ షాపింగ్ ఫెస్టివల్‌ను ప్రారంభించింది. బుధవారం నుంచి శుక్రవారం వరకు ఆన్లైన్ ఫెస్టివల్ జరగనుంది. ఈ సందర్భంగా గూగుల్ నెక్సస్ 6 స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించారు. గ్రేట్ ఆన్లైన్ షాపింగ్ ఫెస్టివల్లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తున్నామని గూగుల్ ఇండియా ఎండీ రాజన్ ఆనందన్ చెప్పారు. నెక్సస్ 6 స్మార్ట్ఫోన్లు (32 జీబీ ధర రూ.43,999, 64 జీబీ ధర రూ.48,999) ఫ్లిప్‌కార్ట్ ద్వారా పొందవచ్చని ఆనందన్ తెలిపారు. ఈ జీఓఎస్ఎఫ్లో నెక్సస్ 6 స్మార్ట్‌ఫోన్‌తో పాటు డిజిటల్ మీడియా ప్లేయర్, క్రోమ్‌కాస్ట్‌ను (ధర రూ. 2,999) కూడా అందిస్తున్నామని, అంతేకాకుండా లెనొవొ, ఏషియన్ పెయింట్స్, టాటా హౌసింగ్, వాన్హ్యూసెన్ ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతున్నామని వివరించారు. క్రోమ్‌కాస్ట్‌ను భారతీ ఎయిర్టెల్ భాగస్వామ్యంతో స్నాప్‌డీల్ ద్వారా అందిస్తున్నామని ఆనందన్ పేర్కొన్నారు. జీఓఎస్ఎఫ్ను 2012లో తొలిసారిగా ప్రారంభించామని, అప్పుడు 90 వ్యాపార సంస్థలు పాల్గొన్నాయని, ఇప్పుడు ఈ వ్యాపార సంస్థల సంఖ్య 450కు పెరిగిందని తెలిపారు. భారత్‌లో ఆన్లైన్ షాపింగ్ జోరుగా సాగుతోందని ఆయన చెప్పారు. 2016కల్లా ఆన్లైన్ షాపింగ్ చేసేవారి సంఖ్య 10 కోట్లకు పెరుగుతుందని ఆనందన్ పేర్కొన్నారు. -
మళ్లీ గూగుల్ ఆన్లైన్ షాపింగ్ ధమాకా
హైదరాబాద్: ఇంటర్నెట్ సెర్చి దిగ్గజం గూగుల్ తాజాగా మరోసారి భారీ ఆన్లైన్ షాపింగ్ వేడుకలకు తెర తీస్తోంది. ఈ నెల 11 నుంచి 13 దాకా మూడు రోజుల(72 గంటలు) పాటు గ్రేట్ ఆన్లైన్ షాపింగ్ ఫెస్టివల్(జీఎస్వోఎఫ్) నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. దీనిలో భాగంగా వివిధ ఉత్పత్తులపై 20-80 శాతం దాకా డిస్కౌంట్లు అందించనుంది. ఈసారి జీఎస్వోఎఫ్లో 200 పైగా ఈ-కామర్స్ కంపెనీలు పాల్గొంటున్నాయని, భారీ ఆఫర్లు అందించనున్నాయని గూగుల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రాజన్ ఆనందన్ తెలిపారు. ఆటోమొబైల్ సంస్థలు, ఆన్లైన్ ట్రావెల్ సైట్లు, టెలికం తదితర రంగాల కంపెనీలు ఇందులో ఉంటాయన్నారు. గతేడాది జీఎస్వోఎఫ్కి మంచి స్పందన లభించడంతో ఈ ఏడాది కూడా నిర్వహిస్తున్నట్లు ఆనందన్ వివరించారు. టీవీలపై 50 శాతం దాకా, మొబైల్ ఫోన్లపై 40 శాతం మేర, కంప్యూటర్లు..ట్యాబ్లెట్లపై 45 శాతం దాకా, లగ్జరీ వాచీలపై 60 శాతం దాకా, దేశీ రూట్లలో విమాన టికెట్లపై 20 శాతం దాకా, స్పీకర్లు..హెడ్ఫోన్లు వంటి ఉత్పత్తులపై 50 శాతం దాకా డిస్కౌంట్లు లభించగలవని ఆనందన్ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశీయంగా 2 కోట్ల మంది ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారని, వచ్చే కొన్నేళ్లలో ఇది 5 కోట్లకు చేరగలదని పరిశ్రమ వర్గాల అంచనా. ఆన్లైన్ షాపింగ్ లావాదేవీలు 2017 నాటికి 16 బిలియన్ డాలర్లకు చేరగలవని అంచనా వేస్తున్నట్లు ఆనందన్ వివరించారు.