గ్రేట్వే స్కూల్లో పోలీసుల విచారణ
హాలియా మండలంలోని తిరుమలగిరిలో ఉన్న గ్రేట్వే స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీలో సోమవారం హాలియా సీఐ శివశంకర్గౌడ్, ఎస్ఐ సురేష్కుమార్ విచారణ నిర్వహించారు. ఈ నెల 8న పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న ఎల్లాపురం తండాకు చెందిన రమావత్ చందుకు తలకు దెబ్బతగలడంతో మృతి చెందాడు. ఈ విషయమై వారు విచారణ నిర్వహించారు. ఒకటో తరగతి బోధించే ఉపాధ్యాయులను పిలిచి విచారించారు. విద్యార్థిని ఎవరైనా కొట్టారా అనే విషయాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థులను అడిగారు. ఎవ్వరూ కొట్టలేదని వారు సమాధానం చెప్పడంతో వారి వాగ్మూలాన్ని వీడియోలో రికార్డు చేశారు.
పాఠశాల గుర్తింపు రద్దు
కలెక్టర్ టి. చిరంజీవులు ఆదేశాల మేరకు గ్రేట్వే స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్సీ పాఠశాల గుర్తింపును రద్దు చేస్తూ డీఈఓ విశ్వనాథరావు ఉత్తర్వులు జారీ చేశారని ఎంఈఓ వై. ఝాన్సీలక్ష్మి సోమవారం విలేకరులకు తెలిపారు. నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వ సెలవుదినంనాడు పాఠశాల నిర్వహించడంతో పాటు విద్యార్థి మృతికి కారణమయ్యారని పేర్కొంటూ పాఠశాల గుర్తింపును రద్దు చేసినట్లు ఆమె తెలిపారు. పాఠశాల నిర్వాహకులపై క్రిమినల్ కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు.