పోలీస్ స్టేషన్లో అత్మాహత్యాయత్నం
రాజమండ్రి: తనపై అన్యాయంగా కేసు పెట్టారంటూ ఓ యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పటించుకున్న ఘటన పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం పోలీస్ స్టేషన్లో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. వీరవాసరం మండలం వడ్డిగూడెం గ్రామానికి చెందిన గంటసాల నాగరాజు పంచాయతీ పైప్‌లైన్‌ను పాడు చేస్తున్నాడంటూ సర్పంచ్ గురదాసి లక్ష్మణరావు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గురువారం ఉదయం నాగరాజును అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం వరకు అతడిని స్టేషన్లోనే కూర్చోబెట్టారు. ఈ నేపథ్యంలో తనపై అన్యాయంగా కేసు పెట్టారన్న ఆవేదనతో నాగరాజు స్టేషన్లో ఉన్న మోటార్ సైకిల్ నుంచి పెట్రోల్ తీసి ఒంటిపై పోసుకుని నిప్పటించుకున్నాడు.
అనంతరం బాధను తట్టుకోలేక స్టేషన్ ప్రాంగణంలో గల బావిలో దూకేశాడు. బావిలో నీరు లేకపోవడంతో మంటలు చెలరేగి అతడి శరీరం బాగా కాలిపోయింది. స్టేషన్ సిబ్బంది, ఆ ప్రాంతానికి చెందిన ప్రజలు నాగరాజును బావిలోంచి బయటకు తీసి భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రై వేటు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వడ్డిగూడెం గ్రామస్తులు వీరవాసరం తరలివచ్చి పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. అనంతరం జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు.