Gurukula hostel
-
కాలకృత్యం.. నిత్య నరకం!
పొద్దున లేచాక పళ్లుతోముకోవాలి, కాలకృత్యాలు తీర్చుకోవాలి, స్నానం చేయాలి, బడికివెళ్లాలి, చదువుల్లో పోటీపడాలి.. పిల్లలెవరికైనా ఇది మామూలే. కానీ రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో మాత్రం.. పొద్దున లేస్తే క్యూలైన్లలో నిల్చోవాలి. కాలకృత్యాల కోసం, స్నానం కోసం.. పోటీపడి లైన్ కట్టాలి. ఆ తర్వాతే.. బడి, చదువు. విద్యార్థుల సంఖ్యకు తగినట్లు బాత్రూమ్లు, టాయిలెట్లు లేకపోవడంతో, ఉన్నవీ పాడైపోవడంతో తీవ్ర ఇబ్బంది ఎదురవుతోంది. ముఖ్యంగా బాలికల గురుకులాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది.చాలినన్ని బాత్రూములు లేక.. చాలా మంది విద్యారి్థనులు రెండు, మూడు రోజులకోసారి స్నానం చేసే పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి తమ బాధను తీర్చాలని వేడుకుంటున్నారు.సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో కనీస వసతులు లేక విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టాయిలెట్లు, బాత్రూమ్లు లేక.. ఉన్న కాసిన్ని కూడా సరిగా లేక నానా తంటాలు పడుతున్నారు. కాలకృత్యాలు కూడా సరిగా తీర్చుకోకుండా, రెండు మూడు రోజులకోసారి స్నానం చేస్తూ అనారోగ్యాల పాలవుతున్నారు. రాష్ట్రంలో ఐదు గురుకుల సొసైటీలు ఉన్నాయి.తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీజీటీడబ్ల్యూఆర్ఈఐఎస్), మహాత్మ జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (ఎంజేపీటిబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎంఆర్ఈఐఎస్)లు ఆయా సంక్షేమ శాఖల పరిధిలో కొనసాగుతుండగా.. తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీజీఆర్‌ఈఐఎస్) నేరుగా పాఠశాల విద్యా శాఖ పరిధిలో కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గురుకుల సొసైటీల పరిధిలో 967 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఐదో తరగతి నుంచి ఇంటరీ్మడియట్ వరకు 6,18,880 మంది విద్యార్థులు చదువుతున్నారు.డిమాండ్‌కు తగిన మేరకు లేక..ఒక్కో గురుకుల విద్యా సంస్థలో 640 మంది విద్యార్థులుంటారు. ఐదో తరగతి నుంచి పదోతరగతి వరకు 480 మంది విద్యార్థులు కాగా.. ఇంటర్మీడియట్లో 160 మంది ఉంటారు. గురుకుల పాఠశాల వసతుల్లో భాగంగా కనీసం పది మంది విద్యార్థులకు ఒక బాత్రూం, కనీసం ఏడుగురికి ఒక టాయిలెట్ ఉండాలనేది నిబంధన. ఈ లెక్కన ఒక్కో గురుకుల పాఠశాలలో 64 బాత్రూమ్లు, 90 టాయిలెట్లు ఉండాలి. కనీసం పది మందికి ఒకటి చొప్పున ఉన్నా సర్దుకుపోయే పరిస్థితి ఉంటుంది.కానీ చాలాచోట్ల 1ః20 నిష్పత్తిలో కూడా లేవు. గురుకుల విద్యా సంస్థల్లో బాత్రూమ్లు, టాయిలెట్ల పరిస్థితి తెలుసుకునేందుకు ఓ సంస్థ సమాచార హక్కు చట్టం కింద 29 గురుకులాల్లో వివరాలను సేకరించింది. ఆ 26 గురుకులాలు, 3 కేజీబీవీలలో ప్రస్తుతం 15136 మంది విద్యార్థులున్నారు. వారికి 1,513 బాత్రూంలు అవసరమవగా.. 870 మాత్రమే ఉన్నాయి. 1ః10 నిష్పత్తిలో లెక్కించినా.. 644 బాత్రూమ్లు తక్కువగా ఉన్నాయి. ఇక 2,162 టాయిలెట్లు అవసరంకాగా.. 1,104 మాత్రమే ఉన్నాయి. ఇందులోనూ తలుపులు సరిగా లేనివి, నిర్వహణ సరిగా లేక పాడైపోయినవీ గణనీయంగానే ఉన్నాయి.దీంతో వీలు చిక్కినప్పుడే స్నానాలు చేస్తున్నామని.. కాలకృత్యాలు తీర్చుకోవడాన్నికూడా వాయిదా వేసుకోవాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే వారి ఆరోగ్యంపైన తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్న ఆందోళన కూడా కనిపిస్తోంది. శాశ్వత ప్రాతిపదిన ఉన్న గురుకులాల్లో కంటే.. అద్దె భవనాల్లో కొనసాగుతున్న వాటిలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది.అనారోగ్యాల పాలవుతున్న విద్యార్థులు రోజూ ఉదయం లేవగానే కాలకృత్యాలు తీర్చుకోవాలి, పళ్లుతోముకుని, స్నానం చేయాలని ప్రాథమిక విద్య నుంచే బోధిస్తారు. కానీ గురుకులాల్లో ఈ పరిస్థితి ఉండటం లేదని విద్యార్థులు వాపోతున్నారు. స్నానం సరిగా చేయకపోవడం, కాలకృత్యాలు తీర్చుకోవడంలో తేడాలతో.. వివిధ రకాల అనారోగ్యాల బారినపడుతున్నామని అంటున్నారు. ఈ తీరు మంచిది కాదని వైద్య నిపుణులు కూడా స్పష్టం చేస్తున్నారు.రాష్ట్ర రాజధానిలోనూ అలాగే.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఉన్న సంక్షేమ గురుకులాల పరిస్థితి కూడా అధ్వానంగా ఉంది. చాలా చోట్ల బాత్రూమ్లు, టాయిలెట్లు నిర్వహణ సరిగా లేక పాడైపోయాయి. కాస్త బాగున్న వాటికీ తలుపులు విరిగిపోయి వాడుకోలేని పరిస్థితి ఉంది. ఉదాహరణకు కొత్తపేటలోని సరూర్‌నగర్ సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో మొత్తం 640 మంది చదువుతున్నారు. మూడు అంతస్తుల ఈ భవనంలో ఫ్లోర్లో 15 టాయిలెట్స్ ఉన్నా.. అందులో సగం పనిచేయట్లేదని, నీళ్లు రావడం లేదని విద్యారి్థనులు వాపోతున్నారు.ఒక్క బాత్రూమ్కు కూడా తలుపు లేదు మా స్కూల్లో 620 మంది విద్యార్థులున్నారు. బాత్రూమ్లు ఉన్నా ఒక్కదానికి కూడా డోర్ లేదు. మేమంతా బయట సంపు దగ్గరే స్నానాలు చేస్తాం. ఇక 36 టాయిలెట్లు ఉన్నా.. పొద్దున్నే పెద్ద లైన్ ఉంటుంది. దీంతో సమీపంలోని చెట్ల పొదల్లోకి వెళ్లాల్సి వస్తోంది. – విష్ణు, ఐదోతరగతి, గిరిజన గురుకుల పాఠశాల, కిన్నెరసానిమూడే పని చేస్తున్నాయి మా స్కూల్ ఆవరణలో17 మరుగుదొడ్లు ఉన్నా.. మూడింటిలోనే నీళ్లు వస్తున్నాయి. మరుగు దొడ్లు కంపు కొడుతూనే ఉంటాయి.మేమంతా బయటికే వెళ్లాల్సి వస్తుంది. విద్యార్థులకు సరిపడా స్నానపు గదులు లేక.. చాలా మంది బోరు బావి నల్లా వద్దే స్నానాలు చేస్తారు. కొందరైతే నాలుగైదు రోజులకు ఒకసారి స్నానాలు చేస్తారు. – ఆర్.ప్రసాద్, 9వ తరగతి, గిరిజన గురుకుల పాఠశాల, ఆదిలాబాద్ -
అనుమానాస్పద స్థితిలో ఇంటర్ విద్యార్థిని మృతి
సూర్యాపేట రూరల్ : సూర్యాపేట మండలంలోని ఇమాంపేటలోని సాంఘిక సంక్షేమ ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో శనివారం రాత్రి ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. సూర్యాపేట పట్టణానికి చెందిన వెంకన్న, భాగ్యమ్మల కుమార్తె దగ్గుపాటి వైష్ణవి (17) గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. గురుకుల పాఠశాలలో శనివారం ఫేర్వెల్ డే ఉండగా విద్యార్థిని తండ్రి ఉదయం 9గంటలకు వచ్చి పూలు , గాజులు ఇచ్చి వెళ్లాడు. సాయంత్రం పాఠశాల ఆవరణలో జరిగిన ఫేర్‌వెల్‌డేలో వైష్ణవి పాల్గొన్నది. అయితే ఈ కార్యక్రమం జరుగుతుండగానే వైష్ణవి హాస్టల్ గదికి వెళ్లిపోయింది. గంట తర్వాత తోటి విద్యార్థులు వెళ్లి చూడగా వైష్ణవి అపస్మారకస్థితిలో ఉంది. ఈ విషయాన్ని వారు వెంటనే ప్రిన్సిపల్‌తో పాటు సిబ్బందికి చెప్పడంతో వైష్ణవిని సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. హాస్టల్ సిబ్బంది ఈ విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రులకు కూడా తెలియజేయడంతో వారు ఏరియా ఆస్పత్రికి వచ్చారు. తమ కూతురును విగతజీవిగా చూసి బోరున విలపించారు. శనివారం సాయంత్రం పాఠశాలలో జరిగిన ఫేర్వెల్ డేకు వెళ్లేందుకు తయారైన తర్వాత వీడియో కాల్ చేసి తమతో నవ్వుతూ మాట్లాడిందని విద్యార్థిని తల్లిదండ్రులు వెంకన్న, భాగ్యమ్మ రోదిస్తూ తెలిపారు. తమ కూతురు కొన్ని రోజుల క్రితం ఇంటికి వచ్చిన సమయంలో మున్సిపల్ చైర్పర్సన్ కలిసి ఎలా చదువుతున్నావని పలకరించిందని చెప్పారు. అప్పుడు తమ కూతురు.. హాస్టల్లో అన్నం బాగుండడం లేదని, రాళ్లు వస్తున్నాయని చెప్పగా అక్కడి నుంచే మున్సిపల్ చైర్పర్సన్ ఫోన్లో ప్రిన్సిపల్‌తో మాట్లాడారని చెప్పారు. ఈ విషయం మనసులో పెట్టుకుని తమ కూతురును వేధించారని, దీంతోనే మనస్తాపంతో మృతిచెందిందని, తమ కూతురును హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని వారు ఆరోపించారు. వైష్ణవి మృతదేహంపై గాయాలు ఉండడంతో తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై కళాశాల ప్రిన్సిపల్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఫోన్ స్విచ్చాఫ్‌లో ఉంది. సూర్యాపేట రూరల్ పోలీసులు ఆస్పత్రికి వచ్చి వివరాలు సేకరించారు. సూర్యాపేట డీఎస్పీ నాగభూషణం హాస్టల్‌కు వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా, వారం రోజుల క్రితం భువనగిరిలోని ఎస్సీ హాస్టల్లో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్న ఘటన మరుకముందే సూర్యాపేటలో మరో బాలిక అనుమానాస్పదస్థితిలో మృతిచెందడం కలకలం రేపింది. -
అర్ధరాత్రి గురుకులంలో యువకుడి హల్చల్.. దాచిన వైనం..
మహబూబ్‌నగర్: అర్ధరాత్రి గురుకుల పాఠశాలలో యువకుడు హల్చల్ చేసి విద్యార్థుల కాళ్లు పట్టిలాగడంతో భయాబ్రాంతులకు గురయ్యారు. రెండు రోజుల క్రితం ఈ ఘటన జరిగినా ఉపాధ్యాయులు బయటకు పొక్కనివ్వలేదు. శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండలంలోని సల్కర్‌పేట్ ప్రభుత్వ గిరిజన బాలికల మినీ గురుకుల పాఠశాలలోకి బుధవారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని యువకుడు ప్రవేశించాడు. విద్యార్థినులు మొదటి అంతస్తు రెండు డార్మెంట్లలో పడుకుంటారు. యువకుడు మెట్ల ద్వారా విద్యార్థినీలు నిద్రిస్తున్న గదుల్లోకి వెళ్లి కాళ్లు పట్టి లాగాడు. దీంతో విద్యార్థినీలు భయాబ్రాంతులకు గురై లేవడంతో వారిని బెదిరించాడు. రెండో డార్మెంట్లోకి వెళ్లి అక్కడ విద్యార్థినీలు కాళ్లు లాగి వారిని బెదిరించడంతో అరవకుండా ఉండిపోయారు. 150 మంది విద్యార్థినీలున్న గురుకులంలో యువకుడు పదినిమిషాలు తిరుగాడినట్లు సీసీపుటెజిలో నిక్షిప్తమైంది. గురువారం ఉదయం ఈ విషయాన్ని పిల్లలు ఉపాధ్యాయులకు చెప్పారు. రెండు రోజులైన ఈ విషయాన్ని బయటికి రాకుండా ఆరోజు విధుల్లో ఉన్న ప్రిన్సిపాల్ పద్మ జాగ్రత్త పడ్డారు. ఈ విషయం తెలియడంతో శుక్రవారం బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెంట్యానాయక్ గురుకులానికి వెళ్లి ఉపాధ్యాయులను నిలదీశాడు. ఘటన జరిగి రెండు రోజులైన పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపాడు. గతంలో పాపా కూడా గురుకులం నుంచి పారిపోయింది. అప్పుడు కూడా ప్రిన్సిపాల్ పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఈ విషయంపై ఇన్చార్జి ప్రిన్సిపాల్‌ను వివరణ కోరగా రెండో రోజు కూడా యువకుడు వస్తాడేమోనని కారంపొడి, రాళ్లు దాడి చేయడానికి పెట్టుకున్నామన్నారు. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ఆమె తెలిపారు. -
గురుకుల సంక్షేమ హాస్టళ్లలో మరణాలు అరికట్టాలి
కాచిగూడ (హైదరాబాద్): గురుకుల హాస్టళ్లు, పాఠశాలల్లో పిల్లల మరణాలను అరికట్టాలని, మెస్ చార్జీలు పెంచాలని, సౌకర్యాలను మెరుగుపర్చాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ వెంటనే స్పందించి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరపాలని ఈ మేరకు ఆయన శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు అనారోగ్యానికి గురై చనిపోతున్నారని, విషజ్వరాలు, అనారోగ్యం ఒకవైపు, నాసిరకం ఆహారంతో మరోవైపు విద్యార్థులు చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం జోక్యం చేసుకుని ఉన్నతస్థాయి కమిటీ వేసి హాస్టళ్లు, గురుకుల పాఠశాలల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హాస్టల్ విద్యార్థులు, గురుకుల పాఠశాల విద్యార్థుల కాస్మెటిక్ చార్జీలను బాలురకు నెలకు రూ.62 నుంచి రూ.300 లకు, బాలికలకు రూ.75 నుంచి రూ.400 వరకు పెంచాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. -
అర్ధరాత్రి కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
పాణ్యం : మండల కేంద్రమైన పాణ్యంలోని గిరిజన సంక్షేమ గురుకుల (బాలుర)పాఠశాలను సోమవారం అర్ధరాత్రి కలెక్టర్ వీరపాండియన్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. కలెక్టర్ పాఠశాలకు వచ్చేసరికి ప్రధాన గేట్లు తాళం వేసి ఉన్నారు. ఎంత పిలిచినా సిబ్బంది ఎవరూ బయటకు రాలేదు. దీంతో అరగంట పైగానే కలెక్టర్ గేటు బయటే నిల్చున్నారు. చేసేదేమీ లేక కలెక్టర్ గన్‌మెన్, అటెండర్ గోడలు దూకి తాళాలను పగులగొట్టారు. రెండో ప్రధాన గేటు తాళాన్ని కూడా పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. కలెక్టర్ లోపలికి వెళ్లగా కేవలం అందులో విద్యార్థులు మాత్రమే ఉండంతో వారిని నిద్రలేపారు. పాఠశాలలో పని చేస్తున్న వార్డెన్, వాచ్మెన్, అటెండర్, ప్రిన్సిపాల్ ఇతర సిబ్బంది ఎక్కడ ఉన్నారని ఆరా తీసి వారికి ఫోన్ చేశారు. హుటాహుటిన ప్రిన్సిపాల్ మేరిసలోమితోపాటు ఇతర సిబ్బంది కలెక్టర్ ముందుకు వచ్చారు. ఎందుకు తాళం తీయలేదని, పాఠశాలలో నైట్ వాచ్మెన్, ఇతర సిబ్బంది ఎక్కడున్నారని ప్రశ్నించారు. సరైన సమాధానం చెప్పకపోవడంతో తక్షణమే వారిని విధులనుంచి తొలగించాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రిన్సిపాల్ సలోమిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. -
కలుషిత కాటు
విజయనగర్ కాలనీలోని మైనార్టీ గురుకుల విద్యాలయంలో సోమవారం ఉదయం కలుషిత ఆహారం తిని 33 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం అల్పాహారం తీసుకున్న కొద్దిసేపటికే వారికి వాంతులు, విరేచనాలయ్యాయి. కొందరు సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే నిలోఫర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. విద్యార్థులంతా కోలుకుంటున్నారని వైద్యులు పేర్కొన్నారు. తీసుకున్న ఆహారం లేదా మంచినీళ్లు కలుషితమై ఉండొచ్చని భావిస్తున్నారు. నాంపల్లి: మైనార్టీ గురుకుల విద్యాలయంలో కలుíషిత ఆహారం తిని 33 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. సోమవారం ఉదయం విజయనగర్ కాలనీలోని మైనార్టీ గురుకుల విద్యాలయంలో ఈ సంఘటన జరిగింది. విద్యార్థులు ఉదయాన్నే అల్పాహారాన్ని తీసుకున్నారు. తిన్న కాసేపటికే వాంతులు, విరేచనాలు అయ్యాయి. మరికొందరు సొమ్మసిల్లి కిందపడిపోయారు. విషయాన్ని తెలుసుకున్న వసతిగృహం సిబ్బంది హుటాహుటిన సమీపంలోని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న విద్యార్థులందరూ కోలుకుంటున్నారని నిలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు. మరో 36 గంటల పాటు ఆసుపత్రిలోనే వైద్య చికిత్సలు అందజేస్తామన్నారు. విద్యార్థుల వయస్సు 10–12 సంవత్సరాల లోపు ఉంటుందని చెప్పారు. విషయం తెలుసుకున్న నాంపల్లి నియోజకవ్గం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మెరాజ్ నిలోఫర్‌కు వచ్చివిద్యార్థులను పరామర్శించారు. తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరూ కోలుకుంటున్నట్లు తెలిపారు.ఈ సంఘటనపై విచారణ జరిపిస్తామని, విద్యార్థులు స్వీకరించిన ఆహారంలో లోపమా లేక మంచినీళ్లలోనా అనే అంశంపై చర్చిస్తామని తెలిపారు. -
గురుకుల విద్యార్థిని దీప్తి మృతి
ఎర్రుపాలెం ఖమ్మం : స్థానిక గురుకుల పాఠశాలలో గురువారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించిన విద్యార్థిని దీప్తి(14), హైదరాబాద్ ఆస్పత్రిలో గురువారం అర్ధరాత్రి ప్రాణాలొదిలింది. దీప్తి తల్లిదండ్రులు గతించారు. ఆమె గతంలో కూడా మూడుసార్లు ఆత్మహత్యకు యత్నించిందని, ఈ విషయం తెలిసినప్పటికీ కౌన్సిలింగ్ ఇవ్వడంలో ఉపాధ్యాయులు పూర్తిగా విఫలమయ్యారని, వారి పర్యవేక్షణ లోపం కూడా ఉందని ఆరోపణలు వినవస్తున్నాయి. చదువులో, ఆటల్లో దీప్తి చురుగ్గా ఉండేదని తోటి విద్యార్థినులు చెబుతున్నారు. ఆమెకు డైరీ రాసే అలవాటుందని కూడా వారు చెప్పారు. ప్రస్తుతం ఆ డైరీ కనిపించడం లేదు. దీప్తి ఆత్మహత్య వార్తతో అక్కడ చదువున్న పిల్లల తల్లిదండ్రులు కొందరు పాఠశాలకు వచ్చారు. తమ బిడ్డలతో మాట్లాడారు. విద్యార్థి సంఘాల ఆందోళన దీప్తి ఆత్మహత్య ఘటనపై విచారణ జరిపించాలన్న డిమాండుతో పాఠశాల ఎదుట విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు మందా సురేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి మడుపల్లి లక్ష్మణ్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మధు తదితరులు పాల్గొన్నారు. మృతదేహం అప్పగింత దీప్తి మృతదేహానికి శుక్రవారం హైదరాబాద్‌లోని ఉస్మానియా హాస్పిటల్లో వైద్యులు పోస్టుమార్టం చేశారు. మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
గురుకులంలో గ్యాస్ మంటలు
అన్నపురెడ్డిపల్లి భద్రాద్రి జిల్లా : స్థానిక గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో గురువారం వంట గ్యాస్ లీకవడంతో మంటలు చెలరేగాయి. అక్కడి ఉపాధ్యాయులు, సిబ్బంది తెలిపిన వివరాలు... ఈ పాఠశాలలోని వంట గదిలో ఉదయం విద్యార్థినులకు టిఫిన్(పూరి)ను సిబ్బంది తయారు చేస్తున్నారు. ఆ సమయంలో గ్యాస్ పైపు నుంచి ఒక్కసారిగా గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి. దీనితో సిబ్బంది వెంటనే అప్రమత్తులయ్యారు. స్థానికుల సాయంతో ఆ గ్యాస్ సిలెండర్‌ను బయటకు తీసుచ్చి మంటలను అదుపు చేశారు. వంట గదిలో మంటలు వ్యాపించినప్పుడు అక్కడ నలుగురు సిబ్బంది ఉన్నారు. వంట గదిలో మంటలు చెలరేగడంతో విద్యార్థినులు భయాందోళనతో పాఠశాల నుంచి బయటకు పరుగు తీశారు. ఈ పాఠశాలలో మొత్తం 230 మంది విద్యార్థినులు ఉన్నారు. ఆర్సీఓ సందర్శన గ్యాస్ లీకై మంటలు చెలరేగిన విషయం తెలుసుకున్న వెంటనే ఈ పాఠశాలను ఉమ్మడి జిల్లాల గిరిజన గురుకులాల రీజనల్ కో–ఆర్టినేటర్ బురాన్ సందర్శించారు. ఉపాధ్యాయులు, వంట సిబ్బంది నుంచి వివరాలు తెలుసుకున్నారు. గ్యాస్ లీకవడం, మంటలు చెలరేగడంపై పూర్తి స్థాయి నివేదికను ఐటీడీఏ పీఓకు, గురుకుల విద్యాసంస్థల కార్యదర్శికి పంపనున్నట్టు విలేకరులతో చెప్పారు. -
గురుకుల హాస్టల్లో ఎంపీ పొంగులేటి తనిఖీలు
ఖమ్మం: ఖమ్మం జిల్లా కల్లూరులోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల హాస్టల్‌ను ఖమ్మం ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. గురుకులంలోబాత్రూమ్లు, మంచినీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నాయని విద్యార్థులు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేశారు. అలాగే తమకు వడ్డించే ఆహారం పదార్ధాలు కూడా నాసిరకంగా ఉన్నాయని విద్యార్థులు ఆరోపించారు. దాంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురుకుల నిర్వహకులపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని నిర్వహకులను హెచ్చరించారు. గురుకులంలో మౌలిక సదుపాయాల వసతులకు ఎంపీ ల్యాడ్స్ నుంచి నిధులు కేటాయిస్తానని విద్యార్థులకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు.