Hail storm
-
మండిపోయిన మంగళవారం.. వచ్చే 5 రోజులు వడగాడ్పుల హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. మంగళవారం ఒకట్రెండు చోట్ల 46 డిగ్రీలకు సమీపంలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌లో ఏకంగా 45.7 డిగ్రీల సెల్సియస్ పగటి ఉష్ణోగ్రత నమోదైంది. కొమురంభీం జిల్లా జంబుగలో 45.4 డిగ్రీలు నమోదైంది. రాగల ఐదు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బుధవారం నుంచి ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతోపాటు ఉత్తర తెలంగాణల్లోని మూడు నాలుగు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశముందని హెచ్చరించింది. ఆ కాలంలో పగటి ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు స్థిరంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ దాని చుట్టు పక్కల జిల్లాల్లో 39 డిగ్రీల నుంచి 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డు కానున్నాయి. సోమవారం నాటి ఆవర్తనం మంగళవారం దక్షిణ చత్తీస్ఘడ్ దాని పరిసర ప్రాంతాలలో కొనసాగుతూ.. సగటు సముద్ర మట్టం నుండి 1.5 కిలోమీటర్ల ఎత్తు వద్ద స్థిరంగా ఉంది. ద్రోణి విదర్భ నుండి తెలంగాణ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కిలోమీటర్ల వద్ద కొనసాగుతూ ఉంది. మరోవైపు రాగల మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరికొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. చదవండి: త్వరలో ఢిల్లీకి టీపీసీసీ నేతలు.. రాహుల్ అమెరికా నుంచి రాగానే! -
ఢిల్లీలో భారీ వర్షం
-
దేశ రాజధానిలో భారీ వడగళ్ల వాన
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో భారీ వడగళ్ల వాన కురిసింది. శనివారం మధ్యాహ్నం దాటిన తర్వాత ఢిల్లీలోని పలుచోట్ల భారీ వర్షం, దాంతోపాటు వడగళ్లు పడ్డాయి. భీకరంగా గాలి వీచింది. దీంతో బిజీగా ఉండే రోడ్లపై భారీ ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. వడగళ్లతో రోడ్లపై ఉన్న జనం బెంబేలెత్తిపోయారు. అయితే, ఎండవేడిమి, ఉక్కపోతతో సతమతమైన ఢిల్లీ ప్రజలకు ఈ వర్షంతో చల్లని వాతావరణం లభించినట్టయింది. ఇక పొరుగునే ఉన్న ఉత్తరప్రదేశ్‌లో నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. భారీ వర్షాల కారణంగా గడచిన 24 గంటల్లో అకక్కడ 28 మంది మృతి చెందారు.పిలిబిత్, సీతాపూర్, చాందౌలీ, ముజాఫర్‌నగర్, భాగ్‌పట్, బిజ్నోర్, ఔన్‌పూర్ జిల్లాలపై వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. మరణించిన వారి కుటుంబాలకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రూ. 4 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించింది. -
సిమ్లాను ముంచెత్తిన మంచు
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లాను మంచు ముంచెత్తింది. మరోవైపు, రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షం, వడగండ్ల వానతో శనివారం తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కుఫ్రి, మషోబ్రా, ధల్లి ప్రాంతాల్లో వడగండ్లు పడగా, సిమ్లా, ధర్మశాల, డల్హౌసీ, ఫగు, సంగ్లా, రాజ్‌గఢ్, సంధోల్లలో తేలికపాటి వాన కురిసింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల మేర తగ్గాయని పేర్కొంది. ఉనాలో అత్యధికంగా 41.5 డిగ్రీలు నమోదు కాగా, లాహౌల్, స్పిటి గిరిజన జిల్లాల్లో అత్యంత కనిష్టంగా 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వివరించింది. పేరుకుపోయిన మంచు, వర్షం కురుస్తున్న దృశ్యం -
గాల్లో విమానం..పగిలిన కాక్ పిట్ అద్దాలు
చెంగ్డు: చైనా సౌతర్న్ ఎయిర్స్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం భారీ ప్రమాదం నుంచి బయటపడింది. హాంకాంగ్‌లోని గ్వాంజోహు నుంచి బయలు దేరిన సీజెడ్ 3483 విమానం గాల్లో ఉండగానే ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన కురవడంతో విమానం కుదుపుకు గురైంది. వడగాళ్లదాటికి విమానం ముందు భాగంతో సహా కాక్ పిట్ అద్దాలకు బీటలు వారాయి. పైలెట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో విమానం చైనాలోని చెంగ్డు విమానశ్రయంలో సేఫ్‌గా ల్యాండ్ అయింది. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్టు చైనా సౌతర్న్ ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. -
ఈదురుగాలుల బీభత్సం
గరిడేపల్లి (నల్లగొండ) : గరిడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామంలో శనివారం భారీ ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. భయంకరమైన ఈదురుగాలులు వీస్తుండటంతో గ్రామంలోని వందలాది చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. -
విశాఖలో వడగళ్ల వాన
విశాఖపట్టణం: విశాఖ ఏజెన్సీలో సోమవారం పలుచోట్ల వడగాళ్ల వాన కురిసింది. పాడేరు మండలం గుత్తులపుట్టు పరిసర ప్రాంతాల్లో సుమారు 3 గంటల పాటు వర్షం కురిసింది. ఎక్కడచూసినా కుప్పలు తెప్పలుగా వడగళ్లు కురవడంతో స్థానికులు వర్షాన్ని ఆస్వాదించారు. ధారకొండ ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి అంతర్రాష్ట్ర రహదారిపై చెట్టు కూలడంతో కాసేపు రాకపోకలు నిలిచిపోయాయి. వెంటనే చెట్టును గిరిజనులు తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. సీలేరు ప్రాంతంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మామిడితో పాటు పలు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. -
తిరుమలలో వడగండ్ల వాన
తిరుమల : తిరుమలలో శనివారం మధ్యాహ్నం వడగండ్ల వాన కురిసింది. దీంతో శ్రీవారి భక్తులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆలయ ఆవరణలో నీరు నిలిచిపోయింది. ప్రస్తుతం టీటీడీ సిబ్బంది మోటార్ల సహాయంతో నీటిని బయటకు పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఏడాది అకాల వర్షాలు పడుతుండటంతో రైతులు భయాందోళనలో ఉన్నారు. మామిడి, అరటి, బొప్పాయి వంటి పంటలు చేతికి వచ్చే దశలో అకాల వర్షాలు పడడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. -
అకాల వర్షం.. అపార నష్టం
* వడగళ్ల వానతో నేలకొరిగిన పంటలు * పిడుగుపాటుతో ఆరుగురు మృతి సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం గాలివాన, వడగళ్లతో కూడిన అకాలవర్షాలు భారీనష్టాన్ని కలిగించాయి. వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లగా.. మరోవైపు పిడుగు లు పడి ఆరుగురు మృత్యువాత పడ్డారు. రంగారెడ్డి జిల్లాలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మహబూబ్‌నగర్ జిల్లాలో ఇద్దరు, కర్నూలు జిల్లాలో ఒకరు చనిపోయారు. పలువురు గాయపడ్డారు. పొలం పనులకు వెళ్లిన రంగారెడ్డి జిల్లా గండేడ్ మండలం మహమ్మదాబాద్‌కు చెందిన నీరేటి మహేందర్(13), నీరేటి వెంకటయ్య(22), బేడిసందమ్మ(50)లు వర్షం వస్తుండడం తో ఓ మర్రిచెట్టు కిందకు చేరారు. అదే సమయంలో పిడుగు పడడంతో వీరంతా మృత్యువాతపడ్డారు. తీవ్రంగా గాయపడిన మహేందర్ తండ్రి నీరేటి పెద్ద యాదయ్యను ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు మహబూబ్‌నగర్ జిల్లా లింగాల మం డలంలోని అంబట్పల్లిలో లక్ష్మమ్మ (40), తెలకపల్లి మండలం గట్టు నెల్లికుదురులో భాస్కర్‌గౌడ్(18) అనే ఇంటర్ విద్యార్థి పిడుగుపాటుకు గురై మృతి చెందారు. వీరిద్దరూ పొలాల్లో వ్యవసాయ పనులు చేసుకుంటూ పిడుగుపాటుకు గురయ్యారు. షాద్‌నగర్ మండలంలోని మదనాపూర్లో పిడుగుపాటుతో మరో మహిళ తీవ్రంగా గాయపడింది. అలాగే కర్నూలు జిల్లా నందవరంలో పిడుగుపాటుకు ఉప్పర రాముడు(55) అనే రైతు ప్రాణాలు కోల్పోయాడు. ఇదిలా ఉండగా మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రెండురోజులుగా కురుస్తున్న అకాలవర్షాలకు వేలాది ఎకరాల్లో పంట నాశనమైంది. పెద్దసంఖ్యలో పశువులు మృత్యువాత పడ్డాయి. మరోవైపు రంగారెడ్డి జిల్లాలో యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, శంషాబాద్ మండలాల్లో పంటలు నేల కొరగడం తో తీవ్రంగా నష్టం వాటిల్లింది. వచ్చే 36గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు: వాతావరణ శాఖ విదర్భ నుంచి తెలంగాణ మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఆవరించి ఉన్నట్టు విశాఖ వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల్లో సాయంత్రంపూట ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నట్టు తెలిపింది. వచ్చే 36 గంటల్లో తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ శాఖ సోమవారం తెలి పింది. ఇవి అకాల వర్షాలు కావని, సాధారణంగా ఏప్రిల్ నుంచి ఇలా వేసవి వర్షాలు కురవడం మామూలేనని ఆ శాఖ అధికారులు తెలిపారు. ‘‘పగలు అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతోపాటు వడగాల్పులు ఉంటాయి. సాయంత్రం వాతావరణం చల్లగా మారగానే ఆకాశం మేఘావృతమై ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఏటా ఇలాంటి వేసవి వర్షాలు ఏప్రిల్‌లో ఆరంభమవుతాయి. అయితే రాష్ట్రంలో ఈ సంవత్సరం మార్చిలోనే ఇలా వడగండ్ల వర్షం కురిసింది’’ అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి ‘సాక్షి’కి వివరించారు. కాగా గడచిన 24 గంటల్లో కోస్తాంధ్రలోని వీరఘట్టంలో గరిష్టంగా 4 సెం.మీ. వర్షపాతం నమోదైనట్టు భారత వాతావరణశాఖ వెల్లడించింది. పాడేరులో 1 సెం.మీ, రాయలసీమలోని ఆలూరులో 2, కర్నూలులో 1, తెలంగాణలోని భువనగిరిలో గరిష్టంగా 3 సెం.మీ., కామారెడ్డిలో ఒక సెం.మీ. వర్షపాతం కురిసినట్టు పేర్కొంది. హైదరాబాద్‌లోనూ పలుచోట్ల ఓ మోస్తరు వర్షం పడింది. సోమవారం రాత్రి 8.30 గంటల వరకు 0.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది.