
బుధవారం నుంచి ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతోపాటు ఉత్తర తెలంగాణల్లోని మూడు నాలుగు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశముందని హెచ్చరించింది.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. మంగళవారం ఒకట్రెండు చోట్ల 46 డిగ్రీలకు సమీపంలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌లో ఏకంగా 45.7 డిగ్రీల సెల్సియస్ పగటి ఉష్ణోగ్రత నమోదైంది. కొమురంభీం జిల్లా జంబుగలో 45.4 డిగ్రీలు నమోదైంది. రాగల ఐదు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
బుధవారం నుంచి ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతోపాటు ఉత్తర తెలంగాణల్లోని మూడు నాలుగు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశముందని హెచ్చరించింది. ఆ కాలంలో పగటి ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు స్థిరంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ దాని చుట్టు పక్కల జిల్లాల్లో 39 డిగ్రీల నుంచి 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డు కానున్నాయి.
సోమవారం నాటి ఆవర్తనం మంగళవారం దక్షిణ చత్తీస్‌ఘడ్ దాని పరిసర ప్రాంతాలలో కొనసాగుతూ.. సగటు సముద్ర మట్టం నుండి 1.5 కిలోమీటర్ల ఎత్తు వద్ద స్థిరంగా ఉంది. ద్రోణి విదర్భ నుండి తెలంగాణ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కిలోమీటర్ల వద్ద కొనసాగుతూ ఉంది. మరోవైపు రాగల మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరికొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
చదవండి: త్వరలో ఢిల్లీకి టీపీసీసీ నేతలు.. రాహుల్ అమెరికా నుంచి రాగానే!