మ్యాన్‌హోల్‌లో పడి వృద్ధుడి మృతి
హైదరాబాద్ : మూతలేని మ్యాన్‌హోల్ ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. అధికారుల నిర్లక్ష్యానికి తార్కాణంగా నిలిచిన ఈ సంఘటన శనివారం రాత్రి హిమాయత్ నగర్లో చోటు చేసుకోగా ఆదివారం ఉదయం వెలుగు చూసింది. హిమాయత్‌నగర్ 6వ వీధిలోని సద్గుణ అపార్ట్మెంట్ 403వ నంబర్ ఫ్లాట్‌లో హేమంత్‌కుమార్ సహాయి (60) కుటుంబం నివాసముంటోంది. విజయదశమి వేడుకల్లో పాల్గొనేందుకు హేమంత్‌కుమార్ సహాయి శనివారం సాయంత్రం భార్యతో కలిసి గచ్చిబౌలిలోని బంధువుల ఇంటికి వెళ్లారు. వేడుకలు పూర్తయిన తర్వాత భార్యను అక్కడే ఉంచి తమ్ముడు పియూష్ కుమార్ సహాయి వాహనంపై ఇంటికి బయలుదేరారు. రాత్రి 10.30 సమయంలో హివూయత్ నగర్ 6వ వీధి ప్రధాన రహదారిపై దిగిపోయూరు.
30 అడుగుల దూరం నడిచిన తర్వాత 8 అడుగుల లోతున్న మూతలేని మ్యాన్‌హోల్‌లో పడి హేమంత్ ప్రాణాలొదిలారు. ఆదివారం ఉదయం మ్యాన్‌హోల్‌లో హేమంత్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. నారాయణగూడ డీఐ లక్ష్మీనారాయణ, ఎస్సై జగన్నాథ్ అనుమానాస్పద మృతిగా పేర్కొంటూ 174 పీఆర్సీ సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీధి దీపాలు వెలగకపోవడం, మ్యాన్‌హోల్‌పై మూతలేకపోవడం వల్లే నిండు ప్రాణం బలైపోయిందని, జీహెచ్ఎంసీ అధికారులు, నిర్మాణ కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే దీనికి కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, హేమంత్‌కుమార్ (60) మృతికి బాధ్యులుగా పేర్కొంటూ జీహెచ్ఎంసీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్లను సస్పెండ్ చేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.