ఫోన్ ఎత్తగానే.. ప్రాణాలు పోయాయి
మార్టూరు : రింగైన ల్యాండ్ లైన్ ఫోన్ ఎత్తగానే విద్యుదాఘాతానికి గురై ఓ ఇంటి యజమాని మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని బొబ్బేపల్లిలో శుక్రవారం వేకువ జామున జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన దండా మారుతీరావు(54) ఇంట్లో బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్ ఫోన్ ఉంది. అందరూ నిద్రపోతుండగా వేకువ జామున ఫోన్ మోగింది. మారుతీరావు ఫోన్ ఎత్తటంతో విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతునికి భార్య పార్వతి, కుమారుడు కృష్ణచైతన్య, కుమార్తె అనిత ఉన్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వచ్చి మృతుని కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై అజయ్‌కుమార్ తెలిపారు.
ఇదీ.. కారణం
టెలిఫోన్ తీగల మీదగా విద్యుత్ తీగలు కూడా మారుతీరావు ఇంటికి వ్యాపించి ఉన్నాయి. మెయిన్ లైన్ విద్యుత్ తీగల సేఫ్టీ కోసం ఇంటి ముందు వరకు ప్లాస్టిక్ గొట్టాలు తొడిగారు. అయినా విద్యుత్ తీగలకు టెలిఫోన్ వైరులోని రాగి వైరు తగలటంతో టెలిఫోన్ తీగలకు విద్యుత్ ప్రసారమైంది. ఫలితంగా ఫోన్ లిఫ్ట్ చేసిన మారుతీరావు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయాడు.