huge fraud
-
హైదరాబాద్‌లో భారీ స్కాం.. రూ.300 కోట్లు కొట్టేసిన కేటుగాడు!
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో బై బ్యాక్ పాలసీ స్కీమ్, డబుల్ గోల్డ్ స్కీమ్ పేరుతో భారీ మోసం జరిగింది. 3,600 మందిని మోసగించి రూ.300 కోట్లను కేటుగాడు కొట్టేశాడు. నిందితుడు పవన్ కుమార్‌ను సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు అరెస్ట్ చేశారు. పవన్ కుమార్‌కు సహకరించిన మరో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.అమాయకుల నుంచి భారీ మొత్తంలో డిపాజిట్లు వసూలు చేసిన కేటుగాడు.. వెల్త్ క్యాపిటల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో పెట్టుబడిదారులను మోసం చేశాడు. 25 నెలలకు గాను బై బ్యాక్ ఓపెన్ ప్లాట్స్ స్కీమ్‌ని ప్రారంభించిన పవన్.. కస్టమర్ల చేత ఎనిమిది లక్షలకు రెండు గంటల భూమి కొనుగోలు చేయించాడు.ప్రతినెలా నాలుగు శాతం లాభం ఇస్తామంటూ ఒప్పందం కుదుర్చుకుని.. కొన్ని నెలలు లాభాలు ఇచ్చి ఆపై మొహం చాటేశాడు. మరో వైపు, డబల్ గోల్డ్ స్కీం, గోల్డ్ చిట్స్ స్కీం కింద లక్షలు వసూలు చేశాడు. పెట్టుబడులు తిరిగి ఇవ్వకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు ఈవోడబ్ల్యూ పోలీసులకు బాధితుల ఫిర్యాదు చేశారు.ఇదీ చదవండి: తాజా సర్వే.. కల్తీ దెబ్బకు హైదరాబాద్ బిర్యానీ బ్రాండ్‌కి డ్యామేజ్ -
హైదరాబాద్ లో ఇన్వెస్ట్ మెంట్ పేరుతో భారీ మోసం
-
హైదరాబాద్‌లో ఇన్వెస్ట్మెంట్ పేరుతో భారీ మోసం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ఇన్వెస్ట్మెంట్ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. డీకేజెడ్ టెక్నాలజీస్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేసి.. పెట్టుబడులు పెడితే అధిక వడ్డీలు ఇస్తామంటూ ప్రచారం చేశారు. రూ. 500 కోట్ల వరకు నిర్వాహకులు వసూలు చేశారు. మొదట పెట్టుబడి పెట్టిన వాళ్లకి తిరిగి వడ్డీ రూపంలో చెల్లించిన నిర్వాహకులు.. ప్రతి నెల వడ్డీలు తిరిగి చెల్లిస్తుండడంతో వేల మందిని బాధితులు పెట్టుబడులు పెట్టించారు.గత రెండు నెలల నుంచి తిరిగి డబ్బులు చెల్లించకపోవడంతో కంపెనీ నిర్వాహకులను బాధితులు నిలదీశారు. మాదాపూర్‌లోని ఆఫీస్‌కి తాళం వేసి నిందితులు పరారయ్యారు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.మహమ్మద్ ఇక్బాల్, రాహిల్, డీకేజెడ్ సంస్థను నిర్వహిస్తున్నారు. నిత్యవసర వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, స్టోర్స్ ద్వారా ఈ కామర్స్ రూపంలో విక్రయిస్తున్నామంటూ నిందితులు ప్రచారం చేశారు. -
అమరావతిలో భారీ మోసం
అమరావతి: కుటుంబ సభ్యులందరినీ కిడ్నాప్ చేసి హింసించి 6 ఎకరాల 33 సెంట్ల పొలాన్ని దౌర్జన్యంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఘటన అమరావతి మండల పరిధిలోని ధరణికోటలో శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు... ధరణికోటకు చెందిన పెనుమచ్చు హనుమంతరావుకు గ్రామంలో సుమారు 22 ఎకరాల పొలం ఉంది. ఆయన ఏకైక కుమార్తె సరితను అదే గ్రామానికి చెందిన వడ్లమూడి రమేష్‌బాబుకు ఇచ్చి వివాహం చేశారు. వివాహానంతరం రెండు కుటుంబాలూ కలిసే ఉంటున్నారు. వీరంతా క్రిస్టియన్ మతం తీసుకోవటంతో ఎక్కువ సమయం దైవ ప్రార్థనలో ఉంటూ పొలం పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన చేకూరి వెంకటేశ్వరరావు వారి పొలంపై కన్నేసి.. కాజేసేందుకు పథకం పన్నాడు. రెండు నెలల నుంచి వడ్లమూడి రమేష్‌బాబుకు రెండు మూడు రోజులకోసారి కొత్త నంబర్ల నుంచి ఫోన్ చేస్తూ.. మీ పొలం ప్రకృతి వ్యవసాయం చేయడానికి కౌలుకు కావాలని అడుగుతున్నాడు. ఈ నేపథ్యంలో కౌలు మాట్లాడుకుందామంటూ గ్రామంలోని జైల్‌సింగ్ కాలనీ రోడ్డులోని గ్రామానికి దూరంగా నిర్జన ప్రదేశంలో ఉన్న ఇంటికి రావాలని అక్టోబర్ 19న రమేష్‌బాబుకు ఫోన్లో సూచించాడు. దీంతో ఆయన తన ద్విచక్ర వాహనంపై అక్కడికి వెళ్లగా, అప్పటికే ముఖానికి ముసుగులు వేసుకున్న ముగ్గురు వ్యక్తులు రమేష్‌బాబును తాళ్లతో బంధించి నోటికి ప్లాస్టర్ అంటించారు. వీరుగాక నాలుగో వ్యక్తి కూడా ముఖానికి ముసుగు వేసుకొని వచ్చి రమేష్‌బాబును ఆస్తి వివరాలు చెప్పాలని బెదిరించి హింసించాడు. అక్టోబర్ 20న రమేష్‌బాబు మామ హనుమంతరావు వద్దకు వెళ్లి మీ అల్లుడికి యాక్సిడెంట్ జరిగిందంటూ ఆయన్ని హడావుడిగా తీసుకొచ్చి మరో గదిలో బంధించారు. వారిద్దరితో కుటుంబసభ్యులకు ఫోన్ చేయించి పొలాలకు సంబంధించిన కాగితాలు, పాస్ పుస్తకాలతో పాటు కారును కూడా తాము పంపించిన వ్యక్తికి ఇచ్చి పంపించాలని బలవంతంగా చెప్పించారు. సినీ ఫక్కీలో రిజిస్ట్రేషన్... పొలం పత్రాలు చేతికి రాగానే అక్టోబర్ 21న రిజిస్ట్రేషన్‌కు ఏర్పాట్లు చేసి గదుల్లో బంధించిన వారిని విడతలవారీగా రిజిస్ట్రార్ ఆఫీసుకు సినీ ఫక్కీలో తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇంట్లోని పెద్దవారంతా రిజిస్ట్రార్ ఆఫీసు వద్ద ఉన్నప్పుడు గొడవ చేయకుండా ఉండేందుకు తొమ్మిదో తరగతి చదువుతున్న రమేష్‌బాబు కుమారుడు శైలేష్‌ను గదిలో ఉంచి వారిని బెదిరించారు. హనుమంతరావు, రమేష్‌బాబు కుటుంబసభ్యులతో 240 సర్వే నంబరులోని 2.31 ఎకరాలు ముప్పాళ్ల మండలం కుందూరువారిపాలేనికి చెందిన వలిపాటి వెంకటేశ్వర్లుకు, 204/1బీ సర్వే నంబరులో ఉన్న 2.27 ఎకరాలు మునగోడు గ్రామానికి బత్తున నారయ్యకు, 341/2సీ సర్వే నంబరులో ఉన్న 1.75 ఎకరాలను నిందితుడు భార్య నాగస్వరూప పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. అనంతరం మామా అల్లుళ్లు హనుమంతరావు, రమేష్‌బాబును కారులో దూరంగా తీసుకెళ్లి ఈ విషయం పోలీసులకు గానీ, గ్రామంలో వారికి గానీ చెబితే చెన్నైలో బీటెక్ చదువుతున్న రమేష్‌బాబు కుమార్తె జ్యోతిర్మయిని చంపేస్తామని బెదిరించి వదిలేశారు. ఈ నేపథ్యంలో బీటెక్ పరీక్షలు రాసి మూడు రోజుల క్రితం జ్యోతిర్మయి ఇంటికి రావటంతో కుటుంబ సభ్యులంతా ధైర్యాన్ని కూడదీసుకుని గురువారం రూరల్ జిల్లా ఎస్పీ విజయారావును ఆశ్రయించారు. అయన సూచన మేరకు బాధితుడు వడ్లమూడి రమేష్‌బాబు అమరావతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శుక్రవారం తుళ్లూరు డీఎస్పీ వై.శ్రీనివాసులరెడ్డి పర్యవేక్షణలో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి సీఐలు శివనాగరాజు, సుబ్బారావు, ఎస్ఐ శివయ్య తమ సిబ్బందితో దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు. -
రేవంత్ రెడ్డికి టోకరా వేయబోయి..
హైదరాబాద్: ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్(కేవీఐసీ) పేరుతో తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులను మోసం చేసిన ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన బాలాజీ అలియాస్ దేవర కుమార్ ప్రధానమంత్రి కృషి యోజనలో భాగంగా రూ. 2 కోట్లు ఇప్పిస్తానని కొంతకాలంగా పలువురికి ఫోన్లు చేస్తున్నాడు. ఇదే విధంగా మహబూబ్ నగర్ జడ్పీ సీఈవో, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ పేరుతో టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఫోన్ చేశాడు. ‘రేవంత్ సార్ నాకు తెలిసినవారి ద్వారా రూ. 2 కోట్లు ఇప్పిస్తా’అని ఆశ చూపాడు. మే 31వ తేదీలోగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుందని తెలిపాడు. అనుమానం రావడంతో ఫోన్‌కాల్‌పై రేవంత్ పీఏ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు వలపన్ని సోమవారం కుమార్‌ను పట్టుకున్నారు. అతడు ఎవరెవరి నుంచి ఎంత డబ్బు వసూలు చేశాడో తెలియాల్సి ఉంది.