Human values
-
మానవీయ విలువలతోనే సామాజికాభివృద్ధి!
సాక్షి, సిటీ బ్యూరో: మానవీయ విలువలతోనే సామాజికాభివృద్ధి సాధ్యమని నగరంలోని ఐఐఐటిలో విశ్వమానవ విలువల విభాగం సమన్వయకర్త ప్రొఫెసర్ డా. శతృజ్ఞ రావట్ తెలిపారు. సి.హెచ్.డి.హెచ్.సి. – ఎ.ఎస్.డబ్ల్యూ.ఎ. సంస్థ ఆధ్వర్యంలో ఐఐఐటీలో జరిగిన ‘జీవన విద్య’ శిక్షణా శిబిరానికి ఆయన ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ శిబిరంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అన్ని వయసు, వృత్తులు, వర్గాల వారు హాజరయ్యారు. మనిషి కుటుంబంలోను, సమాజంలోను సానుకూల సంబంధ బాంధవ్యాలతో ఆనందంగా జీవించడానికి కావలసిన ముఖ్యమైన నైపుణ్యాలను చాలా సులభంగా అర్ధమయ్యే రీతిలో వక్తలు చర్చించారు. ముఖ్యంగా వ్యక్తిగత జీవితంలో దేని కోసం పాటు పడుతున్నాం? ఎందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం? సంసారంలో, బంధువులతో సంబంధాలను పక్షపాతం లేకుండా లోతుగా అర్ధం చేసుకోవాలి? ఇంటా బయటా దైనందినజీవితంలో ఎదురయ్యే సమస్యలపై ఆత్మావలోకనం ద్వారా ఎవరికి వారు సదవగాహనను పెంచుకొని ఈ సమస్యల నుంచి బయటపడటం ఎలా? తద్వారా ఆత్మీయంగా, అనందంగా జీవించడం ఎలా? సమాజంలో భాగస్వాములం కావడం, ప్రకృతితో మమేకమై జీవించడం ఎలా? వంటి అనేక విషయాలపై సి.హెచ్.డి.హెచ్.సి. రిసోర్స్పర్సన్లు శాస్త్రీయ పద్ధతుల్లో సోదహరణంగా వివరించారు. పాల్గొన్న ప్రతి ఒక్కరూ అనేక కీలక అంశాలపై స్పష్టత వచ్చిందని సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ శిబిరంలో సి.హెచ్.డి.హెచ్.సి. రిసోర్స్పర్సన్లు శివశంకర్, నరసింహస్వామి, అమ్మ శ్రీనివాస్, గిరిధర్, వాసు అవగాహన కల్పించారు. హరిత, కోమల, దయానంద్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. సి.హెచ్.డి.హెచ్.సి. సంస్థ ప్రతి నెలా ఆన్లైన్లో, ప్రత్యక్షంగా జీవన విద్య శిక్షణా శిబిరాలను 2018 నుంచి నిర్వహిస్తున్నదని నిర్వాహకులు అమ్మ శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటి దాకా దాదాపు 25 వేల మందికి రెండు రాష్ట్రాలలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగు వారికి ఈ జ్ఞానాన్ని పంచామని, ప్రతి వ్యక్తికి జీవన విజ్ఞానాన్ని అందించడం ద్వారా ఆనందకరమైన సమాజాన్ని నిర్మించడమే తమ ఉద్దేశమని ఆయన తెలిపారు. భోజన ఖర్చులకు మాత్రమే ఫీజు తీసుకుంటూ ఉచితంగా జీవన విద్య జ్ఞానాన్ని పంచుతున్నామన్నారు. (చదవండి: శిశువు రక్షణ అందరి బాధ్యత! కానీ ఇప్పటికీ ఆ విషయంలో వైద్యుల ఆందోళన..) -
వర్ష'మా'.. క్షమించు..!
సాక్షి, ఒంగోలు: మారుతున్న నవీన ప్రపంచంలో రోజురోజుకూ మనావ సంబంధాలు మంటగలుస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. స్థానిక భాగ్యనగర్ 4వ లైనులో ఉన్న 11వ అడ్డరోడ్డులో ఏసీబీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఎనభైఏళ్ల వృద్ధురాలిని ఓ ఆటోవాలా రోడ్డుపక్కన నెట్టివేసి అదృశ్యమయ్యారు. ఈ హృదయవిదారక సంఘటన గురువారం చోటు చేసుకుంది. ఈ సమయంలో జోరున వర్షం కురుస్తుండడంతో వెంటనే ఎవరూ గుర్తించలేకపోయారు. ఔదార్యం చూపి.. ఈ రోడ్డుకు సమీపంలోనే దామచర్ల సక్కుబాయమ్మ డిగ్రీ కాలేజీ, సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహం ఉంది. ఈ నేపథ్యంలో వర్షం తగ్గిన తరువాత హాస్టల్ వార్డెన్ సి.హెచ్.సరితాదేవి ఈ విషయాన్ని గమనించింది. వెంటనే హాస్టల్ విద్యార్థినులు రత్నదీపిక, భారతితో కలిసి వృద్ధురాలి వద్దకు వచ్చి ఆమె దయనీయ పరిస్థితికి చలించిపోయారు. ఒక నైటీని ఆమెకు వేశారు. అయినా ఆమె చలికి తట్టుకోలేకపోవడంతో ఒక చలికోటును కప్పారు. అప్పటికీ ఆమె గడగడలాడిపోతుండడంతో దుప్పటి తీసుకువచ్చి కప్పారు. 80 ఏళ్ల వయస్సులో ఆమెను ఎలా నిర్దయగా వదిలేశారంటూ ఆవేదన చెంది.. సామాజిక కార్యకర్త, పారాలీగల్ వలంటీర్, హెల్ప్ సంస్థ ప్రతినిధి బి.వి సాగర్ దృష్టికి సమస్యను తీసుకువెళ్లారు. దీంతో అతను వెంటనే అక్కడకు వెళ్లి విచారించాగా.. ఏదో మూట పడేస్తున్నారనుకున్నామని, ముసలామెని గుర్తించలేకపోయామంటూ ఓ పశువుల కాపరి తెలిపాడు. ముందుగా విద్యార్థినుల సాయంతో వృద్ధురాలికి అల్పాహారం తినిపించి అక్కడ నుంచి పలు వృద్ధాశ్రమాల్లో చేర్పించేందుకు యత్నించగా తన పని తాను చేసుకోలేదంటూ ఆమెను చేర్చుకొనేందుకు నిర్వాహకులు వెనుకాడారు. చివరకు కరణం బలరాం కాలనీలో ఉషోదయ వృద్ధాశ్రమాన్ని నడుపుతున్న కసుకుర్తి కోటమ్మ మాత్రం ఆమెను అక్కున చేర్చుకునేందుకు ముందుకు వచ్చింది. వృద్ధురాలి వివరాలను రాబట్టేందుకు చేసిన యత్నం ఫలించలేదు. మగ పిల్లలు ఎంతమంది అని ప్రశ్నిస్తే ఇద్దరు అని, ఆడపిల్లలు ఎంతమంది అంటే ఒక్కరు అంటూ వేళ్లు చూపింది. రాత్రికి కోలుకున్నా మాట్లాడలేకపోతోంది. జోరువానలో ఆమెను నిర్దయగా కుటుంబ సభ్యులు ఆటోవాలా సాయంతో గెంటేశారా లేక ఆటో ఎక్కిన ఆమెను ఆటోవాలా దారి మళ్లించి ఆమె వద్ద ఉన్న వస్తువులు కాజేసి నిర్మానుష్యంగా ఉన్న రహదారిలో వదిలేసి పారిపోయాడా అనేది తెలియాల్సి ఉంది. -
వ్యక్తిగత గోప్యత మన హక్కు: నాదెళ్ల
సియాటెల్: ప్రపంచమంతా కంప్యూటర్‌మయం అయిపోయిందని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వ్యక్తిగత గోప్యత, మానవ విలువలు, ప్రజాస్వామ్యాన్ని కాపాడే నైతిక విలువలు, మౌలిక సూత్రాలను కలుపుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. మైక్రోసాఫ్ట్ బిల్డ్ 2018 కాన్ఫరెన్స్ ప్రసంగంలో.. భారత్ సహా వివిధ దేశాలకు చెందిన వేలమంది సాఫ్ట్వేర్ డెవలపర్లనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ‘వ్యక్తిగత గోప్యత మానవ హక్కు. మైక్రోసాఫ్ట్‌లో మనమంతా ఈ హక్కులను కాపాడాలనే మూల సూత్రానికే కట్టుబడి పనిచేస్తున్నాం. మనం డేటా వినియోగించినపుడు అది వినియోగదారుడికి మేలు చేస్తుందనే భరోసాను మనం కల్పించగలగాలి. వ్యక్తిగత వివరాలన్నీ తన నియంత్రణలో ఉన్నట్లు యూజర్‌కు భరోసా కల్పించాలి. కంప్యూటర్లు ఏం చేయగలవు? ఏం చేయాలి? అనే దాన్ని మనకు మనం ప్రశ్నించుకోవాలి.అదే నైతిక కృత్రిమ మేధ’ అని అన్నారు. -
మొక్కు'బడి విలువలు'
రాయవరం (మండపేట): నేటి ఆధునిక సమాజంలో నైతికత–మానవ విలువలు, పర్యావరణ విద్య ప్రాధాన్యత అంశాలుగా గుర్తించి ఇంటర్ విద్యలో పాఠ్యాంశంగా చేర్చారు. ఏటా ఈ అంశాలపై నిర్వహిస్తున్న పరీక్షల తీరు మొక్కుబడిగా మారిపోతోందనే విమర్శలున్నాయి. చాలా కళాశాలల్లో ఈ అంశాలపై బోధన మాటే ఉండడం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఇవ్వకుండానే పరీక్షలు నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది. ఈ ఏడాది విద్యాశాఖ పలు సంస్కరణలకు చర్యలు తీసుకుంటున్నా.. అవి ఎంత వరకు సఫలం అవుతాయన్నది ప్రశ్నార్థ్ధకమే. నైతిక విలువల సుగంధాలను అద్దేందుకే.. పెరిగి పోతున్న పాశ్చాత్య పెడ ధోరణుల్లో విద్యార్థి లోకానికి నైతిక విలువల సుగంధాన్ని అందించేందుకు రాష్ట్ర మానవ వనరుల శాఖ 2015 నుంచి ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు ‘నైతికత–మానవ విలువలు’, పర్యావరణం అనే పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టారు. ఈ నెల 27న నైతిక, మానవ విలువలు, 29న పర్యావరణ విద్యపై పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్ష పాసై తీరాలి... ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశ పెట్టిన ఈ పరీక్షలో విద్యార్థి ఉత్తీర్ణత కాకుంటే ఇంటర్ తప్పినట్లుగా పరిగణిస్తారు. అయితే మార్కులను పరిగణనలోనికి తీసుకోరు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు ఆయా సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులైనా ‘నైతికత–మానవ విలువలు’, ‘పర్యావరణ విద్య’ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులు కాకపోతే మార్కుల జాబితాను అందజేయరు. జిల్లాలో 43 ప్రభుత్వ, 18 ఎయిడెడ్, 237 ప్రెవేటు జూనియర్ కళాశాలల్లో 53,713 మంది ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పాఠ్యప్రణాళికలో దక్కని చోటు.. ఇంటర్లో పర్యావరణ విద్య, నైతికత–మానవ విలువలును పాఠ్యాంశంగా 2015 నుంచి అమలు చేస్తున్నారు. ఈ అంశాలను పాఠ్య ప్రణాళికలో మాత్రం చేర్చకుండా ఇంటర్‌బోర్డు విస్మరిస్తోంది. ఏటా ఈ అంశాలపై పరీక్షలను ఫస్టియర్ విద్యార్థులకు నిర్వహిస్తున్నా.. పాఠ్య ప్రణాళికలో చోటు కల్పిద్దామన్న ఆలోచన విద్యాశాఖకు ఉండడం లేదనే విమర్శలు విన్పిస్తున్నాయి. మొక్కుబడిగా పరీక్షలు.. పాస్ మార్క్ వస్తే చాలని, ఇంటర్ మార్కులకు వీటిని కలపక పోవడంతో ఈ సబ్జెక్టును కేవలం మొక్కుబడిగానే పరిగణిస్తున్నారు. ఈ పరీక్షలను ఏ కళాశాలలో చదివే విద్యార్థులకు ఆ కళాశాలలోనే నిర్వహిస్తున్నారు. దీని వల్ల కళాశాలల్లో చూచిరాతలు కొనసాగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. వీటిని ప్రాధాన్యం లేని పరీక్షలుగా పలు ప్రైవేటు యాజమాన్యాలు కొట్టి పారేస్తున్నాయి. ఉత్తీర్ణత తప్పనిసరి.. 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. 60 మార్కులకు నిర్వహించే ప్రశ్నా పత్రంలో ఐదు కేటగిరీల్లో ఒక్కో దానికి 15 మార్కులు చొప్పున ఐదు ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుంది. వీటితో పాటు సుమారుగా 15 ప్రాజెక్టులు ఉంటాయి. వీటిలో నచ్చిన ప్రాజెక్టును ఎంపిక చేసుకుని పూర్తి చేయాలి. రాత పరీక్షకు 60 మార్కులు, వ్యక్తిగత ప్రాజెక్టుకు 20, గ్రూపు ప్రాజెక్టుకు 20మార్కులు ఉంటాయి. -
ఎంతెంత దూరం?
ప్రతి చర్యకి సమానమైన, వ్యతిరిక్తమైన ప్రతిచర్య ఉంటుంది అన్నది న్యూటన్ గతి సిద్ధాంతాలలో మూడవది. ఒక ఎత్తు నుంచి బంతిని నేలకి కొడితే అది అంతకన్నా ఎంతో ఎక్కువ ఎత్తుకి ఎగురుతుంది కదా! అప్పుడు రెండు సమానం ఎట్లా అవుతాయి అని మొదటిసారి తరగతిలో ఉపాధ్యాయుడు చెప్పిన పాఠం గురించి ఒక చిన్నారికి సందేహం కలగటం సహజం. బంతిని నేల మీద విసిరినప్పుడు అన్నిమార్లూ ఒకే ఎత్తుకి వెడుతోందా? లేదే? ఎందుకని అన్నది అర్థమైతే సిద్ధాంతం అర్థమవుతుంది. తేడా ఎంత బలంగా కొట్టారు అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. దూరం, బలం రెండింటి మొత్తాన్ని తీసుకుంటే ఎంత ఎత్తు వెళ్లింది అన్నది సరిగ్గా సమానంగా ఉంటుంది. ఇది మానవ సంబంధాలకూ వర్తిస్తుంది. ‘నువ్వీ మధ్య నాతో సరిగా మాట్లాడటం లేదు.’ ‘ఫోన్ చెయ్యటం లేదు.’ ‘మా ఇంటికి అసలే రావటం లేదు.’ ఇటువంటి దెప్పిపొడుపులు అయినవాళ్ళ మధ్య తరచుగా వింటూ ఉంటాం. ‘పోనీ నువ్వే ఫోన్ చెయ్యచ్చుగా.’ ‘నువ్వే రావచ్చుగా’ అంటూ సమాధానాలు చెప్పరు. పైగా ‘ఈ ఊరికా ఊరెంత దూరమో ఆ ఊరికీ ఈ ఊరంతే దూరం’ అని సమర్థించుకుంటారు. ‘వన్ వే ట్రాఫిక్‌లు వచ్చాక ఆ రూల్ పని చేయదు’ అని వింటున్న కుర్రదో, కుర్రాడో అంటే తెల్ల మొహం వేస్తారు పెద్దవాళ్ళు. వన్ వేలు మాత్రమే కాదు డివైడర్లు వచ్చాక అది చాలా పెద్ద విషయమే అయ్యింది కదా! మీటర్ మీద వచ్చే ఆటోకి ఒక చోటుకి వెళ్ళటానికైనా, రావటానికైనా దానికి చాలా తేడా ఉంటుంది. ఏమంటే డివైడర్లు అంటారు. జాగ్రత్తగా గమనిస్తే, డివైడర్ కారణంగా కొంచెం దూరం ఎక్కువైనా రద్దీ తక్కువై, దాని వల్ల ఇంధనం బాగా పొదుపవుతుంది. వాహనం మీద ఒత్తిడి తగ్గి దాని ఆయువు పెరుగుతుంది. ఈ ఉపయోగాలని దృష్టిలో ఉంచుకుంటే స్వంత వాహనదారులు చికాకు పడరు. మానవ సంబంధాల విషయంలో కూడా అంతే. ఉదాహరణకు తల్లితో కూతురికి పోటీ ఏమిటి? ‘‘నా ఇంటికి నువ్వెన్ని సార్లు వచ్చావో నీ ఇంటికి నేనూ అన్నేసార్లు వస్తాను’’ అని కూతురు అనటం సమంజసంగా అనిపిస్తుందా? గురువుతో అదే మాట శిష్యుడు అనవచ్చా? ఈ మాటని వృద్ధాశ్రమంలో ఉన్న తండ్రి కొడుకుతో అంటే?... ఏ ఇద్దరి మధ్యనైనా ఉండే సంబంధం ఇరుపక్షాల నుంచి సమానమే అయినా వ్యక్తీకరించే విధానం వంటి వాటిలో తేడా ఉంటుంది. కనుక ప్రతి దానికి పోటీ పెట్టటం కుదరదు. ఈ సంగతిని అర్థం చేసుకుంటే వ్యక్తుల మధ్య సంబంధాలు భద్రంగా ఉంటాయి. – డాక్టర్ ఎన్. అనంతలక్ష్మి -
మానవీయ విలువలు పెంపొందాలి
స్టేషన్ మహబూబ్‌నగర్: ప్రస్తుతం సమాజంలో కుటుంబవ్యవస్థ, మనుషుల వి లువలు తగ్గిపోయాయని ప్రొఫెసర్ హరగోపాల్ ఆవేదన వ్యక్తంచేశారు. మానవీ య విలువలు పెంపొందాలని ఆకాం క్షించారు. స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం స్థానిక ఆదర్శ డిగ్రీ కళాశాలలో ‘జిల్లా ఎస్బీహెచ్ పాల మూరు మిత్రుల’ ఆత్మీయసమ్మేళనం ని ర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. మానవత విలువలు మరుగునపడి వస్తువుల విలువుల వ్యామోహం పెరిగిందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎస్బీ హెచ్ మిత్రుల సమావేశం నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. ఎస్బీ హెచ్ రాష్ట్ర అసోసియేషన్ మాజీ అధ్యక్షు డు శ్యాంసుందర్ మాట్లాడుతూ.. బ్యాం కులు ఈ రోజులు పటిష్టంగా ఉండి సా మాన్యులకు సేవలందిస్తున్నాయంటే బ్యాంకుల యూనియన్ ప్రధాన భూమిక పోషిస్తుందన్నారు. అనంతరం ఎస్బీహెచ్ పాలమూరు మిత్రుల లోగోతోపాటు టెలిఫోర్ డైరీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో రిటైర్డ్ లెక్చరర్ వనమా ల, రిటైర్డ్ ఎస్బీహెచ్ అధికారులు కేవీ అశోక్, వి.నర్సింహ్మరావు, గజ్జెలయ్య, రంగయ్య, సుభాష్ పాల్గొన్నారు. పాతపల్లి దళితులకు అండగా ఉందాం జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): పెబ్బేర్ మండలం పాతపల్లి గ్రామ దళితులకు అండగా నిలుద్దామని ప్రొఫెసర్ హరగోపాల్ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక టీఎన్జీఓ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ దళితులపై దాడులు చేసిన వారిని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్‌చేశారు. దళితులకు జీవించే హక్కు కల్పించాలని కోరారు. అన్యాయాన్ని ప్రశ్నించాల్సిన ప్రజాప్రతినిధులు మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. ఇక్కడి దళితులపై 20సార్లు దాడులు జరిగాయని ఇప్పటిదాకా ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. ఇక్కడి ప్రజాప్రతినిధులు దళితుల సమస్యను నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అక్కడి బోయలను దళితులకు వ్యతిరేంగా రెచ్చగొడుతున్నారన్నారు. రాజకీయాల నాయకుల క్రీడల్లో ప్రజలు బలికావద్దన్నారు. ఈనెల 6వ తేదీ చలో పాతపల్లి కార్యక్రమం నిర్వహిస్తున్న పేర్కొన్నారు. కార్యక్రమానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనుమడు ఆనంద్తేల్తుంబ్డే హాజరుకానున్నట్లు తెలిపారు. అనంతరం చలో పాతపల్లి పోస్టర్‌ను విడుదల చేశారు. అందుకు నిరసనంగా ఈనెల 9న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌లో ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. పాలమూరు అధ్యయన వేదిక జిల్లా అధ్యక్షుడు రాఘవాచారి, చంద్రశేఖర్, యేసేపు, వామన్‌కుమార్, పూజారి పాల్గొన్నారు.