ఇబ్రహింపట్నంని జయించే నాయకుడు ఎవరు?
ఇబ్రహింపట్నం నియోజకవర్గం
ఇబ్రహింపట్నం నియోజకవర్గంలో సిటింగ్ ఎమ్మల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మరోసారి గెలిచారు. ఆయన దీనితో వరసగా మూడుసార్లు గెలిచినట్లయింది. రెండుసార్లు టిడిపి తరపున, ఒకసారి టిఆర్ఎస్ పక్షాన గెలుపొందారు. కిషన్ రెడ్డి 2014లో టిడిపి పక్షాన గెలిచినా, ఆ తర్వాత కాలంలో ఆయన టిఆర్ఎస్లో చేరిపోయారు. కిషన్ రెడ్డి తన సమీప బిఎస్పి ప్రత్యర్ది మల్ రెడ్డి రంగారెడ్డి పై 411 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. రంగారెడ్డి కాంగ్రెస్ ఐ టిక్కెట్ ఆశించగా, మహాకూటమిలో భాగంగా ఆ సీటును టిడిపికి ఇవ్వడంతో ఆయన పార్టీ మారి బిఎస్పి టిక్కెట్ పై పోటీచేశారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఐ కూడా రంగారెడ్డికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించినా ఓటమి తప్పలేదు. కిషన్‌రెడ్డికి 71599 ఓట్లు రాగా, రంగారెడ్డికి71088 ఓట్లు వచ్చాయి. ఇక్కడ టిడిపి పక్షాన పోటీచేసి సామా రంగారెడ్డికి 16600 పైచిలుకు ఓట్లు వచ్చాయి. రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేత కిషన్ రెడ్డి .2014 ఎన్నికలలో టిడిపి-బిజెపి అభ్యర్దిగా పోటీచేసిన కిషన్ రెడ్డి తన సమీప స్వతంత్ర అభ్యర్ధి, కాంగ్రెస్ ఐ తిరుగుబాటు అభ్యర్ధి ఎమ్. రామ్ రెడ్డిపై 11056 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. 2014లో టిఆర్ఎస్ తరపున ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి పోటీచేసిన ఓడిపోయారు.
ఇబ్రహింపట్నంలో ఐదుసార్లు రెడ్డి సామాజికవర్గం నేతలు గెలుపొందితే, మూడుసార్లు బిసి నేతలు గెలుపొందారు. ఈ నియోజకవర్గం రిజర్వుడ్ గా ఉన్నప్పుడు తొమ్మిది సార్లు ఎస్.సి.నేతలు విజయం సాధించారు. గతంలో మేడ్చల్‌లో పోటీచేసి మూడుసార్లు గెలిచిన సీనియర్ నాయకుడు టి.దేవేందర్‌గౌడ్ 2009లో మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పక్షాన పోటీచేసి రెండు చోట్ల ఓడిపోయారు. ఇబ్రహీంపట్నంలో మూడోస్థానంలో మిగిలారు. మరో మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి 1994లో టిడిపితరుఫున 2004లో కాంగ్రెస్ ఐ పక్షాన గెలిచారు. 2009లో ఓటమిపాలయ్యారు.
2018లో బిఎస్పి టిక్కెట్ పై పోటీచేసి ఓటమి చెందారు. 1952 నుంచి 1972 వరకు జనరల్‌గాను, 1978 నుంచి 2004వరకు రిజర్వుడుగాను ఉన్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గం 2009లో తిరిగి జనరల్‌గా మారింది. కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ కలిసి ఎనిమిదిసార్లు, టిడిపి నాలుగుసార్లు, సిపిఎం మూడుసార్లు, టిఆర్ఎస్ ఒకసారి పిడిఎఫ్ ఒకసారి గెలుపొందాయి. కాంగ్రెస్‌నేత ఎమ్.ఎన్.లక్ష్మీనరసయ్య మూడుసార్లు గెలుపొందగా, సిపిఎమ్ పక్షాన కొండిగారి రాములు రెండుసార్లు గెలిచారు. మరో కాంగ్రెస్ నేత ఎజి కృష్ణ రెండుసార్లు గెలుపొందారు. ఇక్కడ నుంచి 1978లో గెలిచిన సుమిత్రదేవి మొత్తం ఐదుసార్లు వివిధ నియోజకవర్గాలలో విజయం సాధించారు. ఇక్కడ గెలిచినవారిలో సుమిత్రదేవి, పుష్పలీల, ఎమ్.ఎన్.లక్ష్మీనరసయ్యలు మంత్రి పదవులు నిర్వహించారు.
ఇబ్రహింపట్నం నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..