ట్రిపుల్ ఐటీ ఉద్యోగికి లిమ్కా బుక్‌లో చోటు
బాసర : ఆదిలాబాద్ జిల్లా బాసర ట్రిపుల్‌ఐటీలో లైబ్రేరియన్‌గా విధులు నిర్వర్తిస్తున్న నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన కొండా అరుణజ్యోతి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సాధించారు. ట్రిపుల్ ప్రారంభం నుంచే ఎన్నో సంచలనమైన మార్పులకు తెర తీస్తూ, ఆరేళ్లుగా కళాశాలలో విధులు నిర్వర్తిస్తూ లక్షా 10 వేల పుస్తకాలు, మ్యాగజైన్లు, వివిధ రకాల పత్రికలను నాలుగు బ్లాకుల్లో భద్రపరుస్తున్నారు. బ్లాకుల మధ్య 200 నుంచి 500 మీటర్ల దూరంలో ఉంచుతూ ఎంతగానో నైపుణ్యం ప్రదర్శిస్తున్నారు.
ట్రిపుల్ ఐటీ కళాశాలలోని 8 వేల మంది విద్యార్థులు, 300 మంది అధ్యాపకులు రోజూ ఎన్నో వేల పుస్తకాలను చదివినా.. వాటిని అదే స్థానంలో భద్రపరుస్తూ ప్రత్యేకత చాటుతున్నారు. ఏ విభాగాలకు సంబంధించిన పుస్తకాలు కావాలన్నా అతి తక్కువ సమయంలో లభించేలా ప్రణాళికలను తయారు చేయడంలో ఆమెకు ఆమే సాటి. ఇందులో భాగంగానే ఆమెకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లో స్థానం దక్కింది.