illegal gold transport
-
భారత్–చైనా సరిహద్దులో ఏకంగా 108 కిలోల బంగారం స్వాధీనం
లేహ్: భారత్–చైనా సరిహద్దులో అక్రమంగా తరలిస్తున్న 108 కిలోల బంగారాన్ని ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీసు(ఐటీబీపీ) సిబ్బంది స్వా«దీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఒక్కోటి ఒక కిలో బరువు ఉన్న 108 బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. ఐటీబీపీ చరిత్రలో ఈ స్థాయిలో భారీగా అక్రమ బంగారం స్వా«దీనం చేసుకోవడం ఇదే మొదటిసారి అని వెల్లడించారు. తదుపరి విచారణ కోసం బంగారం, ఇతర వస్తువులను కస్టమ్స్ విభాగానికి అప్పగిస్తామని పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం తూర్పు లద్దాఖ్‌లోని చాంగ్‌థాంగ్ సబ్–సెక్టార్లో భారత్–చైనా సరిహద్దు అయిన వాస్తవా«దీన రేఖకు ఒక కిలోమీటర్ దూరంలో ఐటీబీపీ 21వ బెటాలియన్ సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు స్మగ్లర్లు తారసపడ్డారు. ఐటీబీపీ సిబ్బందిని చూసి పారిపోయేందుకు ప్రయతి్నంచారు. సిబ్బంది కొంతదూరం వెంటాడి వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా, బంగారం అక్రమ రవాణా వ్యవహారం బయటపడింది. తనిఖీల్లో 108 కిలోల బంగారం లభించింది. స్మగ్లర్లను లద్దాఖ్ వాసులుగా గుర్తించారు. నిందితులను అధికారులు విచారిస్తున్నారు. -
పైపుల్లో 14 కేజీల పసిడి
శంషాబాద్: పైపుల్లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని డీఆర్ఐ అధికారులు రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు విదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. అధికారుల కథనం ప్రకారం.. దుబాయ్ నుంచి వస్తున్న ఎయిరిండియా విమానం ఏఐ–952 గురువారం తెల్లవారుజామున 5.30కి శంషాబాద్ విమానాశ్రయం లో దిగింది. బంగారం అక్రమ రవాణా గురించి విశ్వసనీయ సమాచారం రావడంతో అప్రమత్తమైన అధికారులు.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరు తాము కూర్చున్న 31ఏ, 32ఏ సీట్ల కింద బంగారాన్ని తెచ్చినట్లు గుర్తించారు. నల్లని టేపుతో చుట్టిన బంగారాన్ని 14 హాలో పైపుల్లో దాచినట్లు అధికారులు తెలిపారు. పైపుల నుంచి 112 బంగారు బిస్కెట్ ముక్కలను బయటకు తీశారు. మొత్తం 14 కేజీల బరువు కలిగిన ఈ బంగారం విలువ రూ.5.46 కోట్లు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. బంగారాన్ని అక్రమ రవాణా చేస్తున్న వారిలో ఒకరు దక్షిణ కొరియాకు చెందిన వ్యక్తి కాగా మరొకరు చైనాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇంత భారీ మొత్తంలో వీరితో బంగారాన్ని అక్రమంగా రవాణా చేయించింది ఎవరనే విషయంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులిద్దరిని అరెస్ట్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేశారు. కాగా, ఐదేళ్ల క్రితం దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురి నుంచి శంషాబాద్ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు 27 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మూడేళ్ల క్రితం 9 కేజీల బంగారాన్ని మరో వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఇద్దరు వ్యక్తుల నుంచి బంగారం స్వాధీనం చేసుకోవడం చర్చనీయాశమైంది. -
బాత్రూంలో 2.8 కిలోల బంగారం
సాక్షి బెంగళూరు: అక్రమంగా తరలిస్తున్న 2.8 కేజీల బంగారాన్ని బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ సుమారు రూ.87.69 లక్షలుగా లెక్కగట్టారు. విమానాశ్రయంలోని శౌచాలయాన్ని శుభ్రపరిచే సిబ్బంది ఈ నెల 4వ తేదీన బాత్రూంలోని చెత్తబుట్టలో ఒక పాలిథీన్ బ్యాగ్ ఉండటాన్ని గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. ఆ బ్యాగును తెరిచి చూడగా 2.8 కేజీల బంగారు ఆభరణాలు లభించాయి. దీనిపై కస్టమ్స్ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ ఎవరో అక్రమంగా బంగారాన్ని దేశానికి తీసుకొచ్చి, విమానాశ్రయం నుంచి బయటకు తీసుకెళ్లలేక వదిలేసి ఉంటారని తెలిపారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితుడిని గుర్తించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. -
పూతేసుకొచ్చినా.. పట్టేసుకున్నారు!
మెరిసేదంతా బంగారం కాదంటారు. అలాగే, మెరవనిదంతా బంగారం కాదని కూడా అనుకోనక్కర్లేదు. ఎందుకంటే, బంగారం గొలుసులకు అల్యూమినియం పూత పూసి, అది పుత్తడి కాదు.. ఉత్తదే అని చూపించడానికి ప్రయత్నించాడో ఘనుడు. కానీ, కస్టమ్స్ అధికారులు ఊరుకుంటారా, పుటుక్కున అతగాడిని పట్టేసుకున్నారు. విదేశాల నుంచి బంగారం అక్రమ రవాణా కొత్త పుంతలు తొక్కుతోంది. షూ సాక్సులు.. లో దుస్తుల్లో ఇప్పటి వరకు బంగారాన్ని తీసుకొచ్చేవారు. తాజాగా ఓ కేరళవాసి బంగారు గొలుసుకు అల్యూమినియం పూతపూసుకుని వచ్చి కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పే యత్నంచేసి విఫలమయ్యాడు. అతడి నుంచి అధికారులు సుమారు 400 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో కేరళ రాష్ట్రం కాసర్‌ఘడ్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ రెహమాన్ ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈకే 524 విమానంలో దుబాయ్ నుంచి శంషాబాద్‌కు చేరుకున్నాడు. తనిఖీల్లో అతడి ట్రాలీ బ్యాగుకు డిజైన్‌గా తెల్లటి తీగలు కనిపించాయి. దీంతో అనుమానించిన అధికారులు.. అల్యూమినియంతో ఉన్న తీగలను బయటకు తీసి పైపూత తొలగించారు. దీంతో 400 గ్రాముల గొలుసులు బయటపడ్డాయి. వీటి విలువ రూ.12 లక్షలు ఉంటుందని అధికారులు చెప్పారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఆదివారం రాత్రి 1:30 గంటలకు హైదరాబాద్‌వాసి ఇసాహషీమ్ టైగర్ ఎయిర్‌లైన్స్ విమానం టీఆర్ 2624లో థాయ్‌ల్యాండ్ నుంచి వచ్చాడు. 221 గ్రాముల బరువు, సుమారు రూ.6.63 లక్షల విలువచేసే బంగారుగొలుసు అతడు ధరించాడు. దానికి రశీదులు లేకపోవడంతో అధికారులు స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. -న్యూస్‌లైన్, శంషాబాద్