Indian Red Cross Society
-
సీపీఆర్‌పై అవగాహన అవసరం
పంజగుట్ట: మన దేశంలో ప్రతి నిమిషానికి 112 కార్డియాక్ అరెస్టులు సంభవిస్తున్నాయని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ తెలంగాణ చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి అజయ్ మిశ్రా ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో 80 శాతం బహిరంగ ప్రదేశాల్లోనే జరుగుతున్నాయని, సీపీఆర్‌పై ప్రజలకు అవగాహన లేకపోవడంతో ఎంతోమంది మృత్యువాత పడుతున్నారన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రెడ్‌క్రాస్ సొసైటీ, ప్రెస్‌క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సంయుక్తంగా సీపీఆర్‌పై ఎన్సీసీ విద్యార్థులకు, జర్నలిస్టులకు అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ నెలలో రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 33 జిల్లాల్లో నిర్వహించనున్న సీపీఆర్ అవగాహన, శిక్షణ కార్యక్రమాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అజయ్ మిశ్రా మాట్లాడుతూ.. రెడ్‌క్రాస్ మాదిరిగా మరిన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి సీపీఆర్‌పై అవగాహన కల్పించాలని కోరారు. నిమ్స్ ఎమర్జెన్సీ విభాగాధిపతి డాక్టర్ అశిమా శర్మ మాట్లాడుతూ.. సీపీఆర్ చేసే సమయంలో స్కిల్స్ ఎంతో ముఖ్యమని, బ్రీతింగ్, నాడి చూడాలని, భుజం తట్టి స్పందిస్తున్నారో లేదో చూడాలన్నారు. సీపీఆర్ చేస్తూనే అంబులెన్స్‌కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ మేరకు నిమ్స్‌లో పారామెడికల్ సిబ్బందికి శిక్షణ ఇచ్చామన్నారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సీపీఆర్ రాష్ట్ర కో ఆర్డినేటర్ డాక్టర్ బి.విజయ్‌భాస్కర్, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు, ప్రధాన కార్యదర్శి ఆర్.రవికాంత్ రెడ్డి, కె.మదన్మోహన్రావు, రమణ పాల్గొన్నారు. -
బ్లడ్ సెంటర్ ఏర్పాటుకు సహకరించాలి
సాక్షి,సిటీబ్యూరో: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బ్లడ్ సెంటర్ ఏర్పాటుకు అందరు విరాళాలిచ్చి సహకరించాలని జిల్లా కలెక్టర్ శర్మన్ అన్నారు. బుధవారం రెడ్ క్రాస్ ప్రతినిధులు కలెక్టర్ ను కలిసి బ్లడ్ సెంటర్ ఏర్పాటు, పనుల పురోగతిపై వివరించారు. ఈ సందర్భంగా దాతలు లారెన్స్ మాయో ఆప్టికల్స్ ఆఫీస్ కంప్యూటర్లను విశాల్ పెరిఫెరెల్స్, కలర్ ప్రింటర్ ను, డా. శ్యాంకాంత్ బసాకే రూ. 7500 చెక్కులను రెడ్ క్రాస్ సొసైటీకి విరాళంగా కలెక్టర్ కు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఆర్ఓ సూర్యలత, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ భీం రెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు, రాధా కృష్ణ,, డా. సిసా తదితరులు పాల్గొన్నారు. -
వరద బాధితులకు సాయం చేయండి: తమిళిసై
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరద ముంపునకు గురైన వారిని ఆదుకోవాలని ఇండియన్ రెడ్ క్రాస్ సొసై టీ (ఐఆర్సీఎస్) ప్రతి నిధులను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కోరారు. రాజ్‌భవన్ అధికారులు కూడా ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా బాధితులకు సాయం అందేలా కృషి చేయాలని ఆమె ఆదేశించారు. శుక్రవారం పుదుచ్చేరి నుంచి రాజ్‌భవన్ అధికారులు, రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లాల ప్రతినిధులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో ఆస్తి, పంట నష్టం జరగడం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేశా రు. రాష్ట్రంలో డెంగీ, మలేరియా లాంటి సీజన ల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని, బాధితులకు అవసరమైన సాయమందించేందుకు ప్రభుత్వ ఏజెన్సీలతో సమన్వయంతో ముందుకెళ్లాలని సూ చించారు. సమావేశంలో రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతి నిధులు, రాజ్‌భవన్ అధికారులు పాల్గొన్నారు. -
సేవకు ప్రశంస..
ఇండియన్‌రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్‌శాఖ విశాఖలోని పోర్టు కళావాణి స్టేడియంలో శుక్రవారం వివిధ రంగాల ప్రముఖులకు బంగారు పతకాలు అందజేసింది. గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ చేతులమీదుగా గోల్డ్ మెడల్ అందుకుంటున్న కర్నూలు జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ. -
సోలార్ విద్యుత్.. సో బెటర్
ఏలూరు (వన్‌టౌన్) : సోలార్ విద్యుత్‌తో అనేక ప్రయోజనాలు ఉన్నాయని, జిల్లాలోని ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టామని కలెక్టర్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ అధ్యక్షుడు కె. భాస్కర్ అన్నారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రి ఆవరణలోని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ కార్యాలయంలో రూ.7 లక్షల 90 వేల ఖర్చుతో ఏర్పాటు చేసిన 5 కిలోవాల్ట్స్ సోలార్ పవర్ ప్లాంటును మంగళవారం ఉదయం కలెక్టరు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పవర్ ప్లాంటు ఏర్పాటుకు అయిన ఖర్చులో రూ.2 లక్షల 37 వేలు నెడ్‌క్యాప్ సబ్సిడీగా అందించిందని మిగిలిన సొమ్ము ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఏలూరు శాఖ ఏర్పాటు చేసిందని చెప్పారు. జిల్లా కేంద్రమైన ఏలూరులో 25 ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ విద్యుత్ ఏర్పాటు చేస్తున్నామని, దశలవారీగా అన్ని కార్యాలయాల్లో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలని సూచించారు. జిల్లాలో విద్యుత్ కార్యక్రమం కింద ప్రభుత్వం ప్రతి ఇంటికీ 4 ఎల్ఈడీ బల్బ్‌లను ఒక్కొక్కటి రూ.10కే అందించనున్నామన్నారు. జిల్లాలో 100 కిలోవాల్ట్‌ల సామర్థ్యంగల సోలార్ విద్యుత్ ఉత్పాదనకు ప్రణాళిక సిద్ధం చేశామని, అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టల్స్‌కు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, ఏరియా హాస్పటల్స్‌కు, పురపాలక సంఘాలకు సోలార్ విద్యుత్‌ను ఏర్పాటు చేయనున్నట్టు కలెక్టర్ వివరించారు. ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ ఎండీ ఎం.కమలాకరబాబు మాట్లాడుతూ దేశంలో గుజరాత్ తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సోలార్ విద్యుత్ ఉత్పాదనలో 2వ స్థానంలో ఉందన్నారు. భవనాల పైకప్పులు, నిరుపయోగంగా ఉన్న ఖాళీస్థలాల్లో సౌరశక్తిని ఉత్పత్తి చేయడానికి మంచి అవకాశాలున్నాయని, వ్యక్తిగత గృహ యజమానులు, వాణిజ్య భవన యజమానులు, పారిశ్రామిక భవనాల యజమానులు కూడా సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చునన్నారు. కార్యక్రమంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా శాఖ అధ్యక్షుడు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. క్లస్టర్ విధానం ద్వారా నాణ్యమైన విద్య అందించాలి ఏలూరు సిటీ : క్లస్టర్ విద్యావిధానం ద్వారా మండలస్థాయిలో నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలని, ఈ దిశగా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ కె.భాస్కర్ అన్నారు. ఏలూరు కలెక్టరు చాంబర్లో మంగళవారం ఉదయం విద్యాశాఖ పనితీరును సంబంధిత అధికారులతో సమీక్షించారు. ప్రతి మండలంలో అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలలను ఒక క్లస్టర్‌గా తీసుకుని పటిష్టమైన విద్యావిధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. ప్రతి మండలంలో ఒకటి లేక రెండు మోడల్ స్కూల్స్‌ను అభివృద్ధి చేసి ఆ పాఠశాలలను ఇతర గ్రామాలను కలుపుతూ ఆర్టీసీ బస్ ఏర్పాటు చేసి విద్యార్థులు మోడల్ స్కూల్స్‌కు వచ్చేవిధంగా ఏర్పాట్లు చేయనున్నామన్నారు. డీఈవో నరసింహారావు, డ్వామా పీడీ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. విద్యార్థుల్ని పరీక్షించేందుకు ప్రణాళిక రూపొందించండి ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్) : జిల్లాలో 3,300 పాఠశాలల్లో జవహర్ బాల ఆరోగ్యరక్ష పథకం కింద ప్రతి విద్యార్థికి వైద్య పరీక్షలు నిర్వహించడానికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ కె.భాస్కర్ వైద్యశాఖాధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం రాత్రి జవహర్ బాల ఆరోగ్యరక్ష పథకం అమలుపై అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఒక్కో విద్యార్థిని పరీక్షించినందుకు డాక్టర్‌కు రూ.10 చొప్పున పారితోషికం అందిస్తామని, వైద్యులు ప్రత్యేక శ్రద్ధ వహించి రోజుకు కనీసం 100 మంది విద్యార్థులను పరీక్షించాలని కోరారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి వివరాలు, అందించిన వైద్యసేవల వివరాలు కేస్షీట్తో సహా తనకు నివేదిక సమర్పించాలన్నారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ సుభాష్, డీఎంహెచ్‌వో కె.శంకరరావు, సర్వశిక్షాభియాన్ పీవో విశ్వనాథ్, జవహర్ బాల ఆరోగ్య రక్ష కార్యక్రమం జిల్లా సమన్వయాధికారి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
అందుబాటులో రక్త నిల్వలు
ఒంగోలు టౌన్ : జిల్లా ప్రజలకు రక్త నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ డిస్ట్రిక్ట్ చైర్మన్ విజయకుమార్ చెప్పారు. కొన్ని రోజుల కిందట వరకు రక్త నిల్వలు తగ్గిపోయిన నేపథ్యంలో విద్యా సంస్థలు, ఉద్యోగులు, వివిధ రకాల క్లబ్‌లు ముందుకు వచ్చి రక్తదానం చేశాయన్నారు. స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో రక్త నిల్వల కొరత ఉన్నట్లు తెలియడంతో పొదిలి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం రక్తదాన శిబిరం ఏర్పాటుచేసి 183 యూనిట్లు రక్తం అందించినట్లు తెలిపారు. కనుమళ్లలోని ఎంఎల్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు 63 యూనిట్లు, ఒంగోలులోని నాగార్జున డిగ్రీ కాలేజీ విద్యార్థులు 26 యూనిట్లు, అందుబాటులో రక్త నిల్వలు ఒంగోలు వాసవీ క్లబ్ ప్రతినిధులు 21 యూనిట్లు, స్థానికంగా 12 యూనిట్లు రక్తం అందించినట్లు వివరించారు. ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రక్త నిల్వల వివరాలను గ్రూపుల వారీగా కలెక్టర్ వెల్లడించారు. ఓ-పాజిటివ్ 96యూనిట్లు, ఏ-పాజిటివ్ 55 బీ-పాజిటివ్ 71, ఏబీ-పాజిటివ్ 11, ఓ-నెగెటివ్ 9, ఏ-నెగెటివ్ 4, బీ-నెగెటివ్ 3 యూనిట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. రక్తం అవసరమైన వారు తాము రక్తదానం చేయడంతోపాటు ఒక యూనిట్‌కు 700 రూపాయలు చెల్లించాలని చెప్పారు. రక్తదానం చేయకుండా పొందాలనుకునే వారు 1050 రూపాయలు చెల్లించాలన్నారు. సమావేశంలో జిల్లాపరిషత్ సీఈఓ, రెడ్‌క్రాస్ సొసైటీ ఇన్చార్జి సెక్రటరీ ప్రసాద్, సీపీఓ పీబీకే మూర్తి పాల్గొన్నారు.