సోలార్ విద్యుత్.. సో బెటర్ | Solar power So Better | Sakshi
Sakshi News home page

సోలార్ విద్యుత్.. సో బెటర్

Published Wed, Sep 24 2014 2:34 AM | Last Updated on Mon, Oct 22 2018 8:31 PM

సోలార్ విద్యుత్.. సో బెటర్ - Sakshi

సోలార్ విద్యుత్.. సో బెటర్

ఏలూరు (వన్‌టౌన్) : సోలార్ విద్యుత్‌తో అనేక ప్రయోజనాలు ఉన్నాయని, జిల్లాలోని ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టామని కలెక్టర్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ అధ్యక్షుడు కె. భాస్కర్ అన్నారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రి ఆవరణలోని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ కార్యాలయంలో రూ.7 లక్షల 90 వేల ఖర్చుతో ఏర్పాటు చేసిన 5 కిలోవాల్ట్స్ సోలార్ పవర్ ప్లాంటును మంగళవారం ఉదయం కలెక్టరు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పవర్ ప్లాంటు ఏర్పాటుకు అయిన ఖర్చులో రూ.2 లక్షల 37 వేలు నెడ్‌క్యాప్ సబ్సిడీగా అందించిందని మిగిలిన సొమ్ము ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఏలూరు శాఖ ఏర్పాటు చేసిందని చెప్పారు. జిల్లా కేంద్రమైన ఏలూరులో 25 ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ విద్యుత్ ఏర్పాటు చేస్తున్నామని, దశలవారీగా అన్ని కార్యాలయాల్లో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలని సూచించారు. జిల్లాలో విద్యుత్ కార్యక్రమం కింద ప్రభుత్వం ప్రతి ఇంటికీ 4 ఎల్‌ఈడీ బల్బ్‌లను ఒక్కొక్కటి రూ.10కే  అందించనున్నామన్నారు.
 
 జిల్లాలో 100 కిలోవాల్ట్‌ల సామర్థ్యంగల సోలార్ విద్యుత్ ఉత్పాదనకు ప్రణాళిక సిద్ధం చేశామని, అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టల్స్‌కు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, ఏరియా హాస్పటల్స్‌కు, పురపాలక సంఘాలకు సోలార్ విద్యుత్‌ను ఏర్పాటు చేయనున్నట్టు కలెక్టర్ వివరించారు. ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ ఎండీ ఎం.కమలాకరబాబు మాట్లాడుతూ దేశంలో గుజరాత్ తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సోలార్ విద్యుత్ ఉత్పాదనలో 2వ స్థానంలో ఉందన్నారు. భవనాల పైకప్పులు, నిరుపయోగంగా ఉన్న ఖాళీస్థలాల్లో సౌరశక్తిని ఉత్పత్తి చేయడానికి మంచి అవకాశాలున్నాయని, వ్యక్తిగత గృహ యజమానులు, వాణిజ్య భవన యజమానులు, పారిశ్రామిక భవనాల యజమానులు కూడా సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చునన్నారు. కార్యక్రమంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా శాఖ అధ్యక్షుడు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
 
 క్లస్టర్ విధానం ద్వారా నాణ్యమైన విద్య అందించాలి
 ఏలూరు సిటీ : క్లస్టర్ విద్యావిధానం ద్వారా మండలస్థాయిలో నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలని, ఈ దిశగా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ కె.భాస్కర్ అన్నారు. ఏలూరు కలెక్టరు చాంబర్‌లో మంగళవారం ఉదయం విద్యాశాఖ పనితీరును సంబంధిత అధికారులతో సమీక్షించారు. ప్రతి మండలంలో అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలలను ఒక క్లస్టర్‌గా తీసుకుని పటిష్టమైన విద్యావిధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. ప్రతి మండలంలో ఒకటి లేక రెండు మోడల్ స్కూల్స్‌ను అభివృద్ధి చేసి ఆ పాఠశాలలను ఇతర గ్రామాలను కలుపుతూ ఆర్టీసీ బస్ ఏర్పాటు చేసి విద్యార్థులు మోడల్ స్కూల్స్‌కు వచ్చేవిధంగా ఏర్పాట్లు చేయనున్నామన్నారు. డీఈవో నరసింహారావు, డ్వామా పీడీ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.
 
 విద్యార్థుల్ని పరీక్షించేందుకు ప్రణాళిక రూపొందించండి
 ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్) : జిల్లాలో 3,300 పాఠశాలల్లో జవహర్ బాల ఆరోగ్యరక్ష పథకం కింద ప్రతి విద్యార్థికి వైద్య పరీక్షలు నిర్వహించడానికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ కె.భాస్కర్ వైద్యశాఖాధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం రాత్రి జవహర్ బాల ఆరోగ్యరక్ష పథకం అమలుపై అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఒక్కో విద్యార్థిని పరీక్షించినందుకు డాక్టర్‌కు రూ.10 చొప్పున పారితోషికం అందిస్తామని, వైద్యులు ప్రత్యేక శ్రద్ధ వహించి రోజుకు కనీసం 100 మంది విద్యార్థులను పరీక్షించాలని కోరారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి వివరాలు, అందించిన వైద్యసేవల వివరాలు కేస్‌షీట్‌తో సహా తనకు నివేదిక సమర్పించాలన్నారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ సుభాష్, డీఎంహెచ్‌వో కె.శంకరరావు, సర్వశిక్షాభియాన్ పీవో విశ్వనాథ్, జవహర్ బాల ఆరోగ్య రక్ష కార్యక్రమం జిల్లా సమన్వయాధికారి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement