రియల్టీలో పెట్టుబడుల సునామీ, రూ.36,500 కోట్లకు..
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ రంగంలో సంస్థాగత పెట్టుబడులు (ఇనిస్టిట్యూషనల్) ఈ ఏడాది 4 శాతం పెరిగి 5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.36,500 కోట్లు)గా ఉండొచ్చని కన్సల్టెన్సీ సంస్థ కొల్లియర్స్ ఇండియా అంచనా వేసింది. 2020లో ఈ రంగంలో సంస్థాగత పెట్టుబడిదారులు 4.8 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు ఆరు నెలల్లో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులపై ఇనిస్టిట్యూషన్స్ పెట్టుబడులు 2.9 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 2020 మొదటి ఆరు నెలల్లో వచ్చిన గణాంకాలతో పోలిస్తే రెండు రెట్లు పెరిగినట్టు కొల్లియర్స్ ఇండియా తెలిపింది.
కార్యాలయ సముదాయాలపై ఇన్వెస్ట్ చేసేందుకు సంస్థాగత పెట్టుబడిదారులు ఎంతో ఆసక్తిగా ఉన్నట్టు పేర్కొంది. ‘‘ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 35 శాతం పెట్టుబడులు కార్యాలయ వసతుల ప్రాజెక్టుల్లోకి వచ్చాయి. అలాగే, పారిశ్రామిక, గోదాముల విభాగంలోకి వచ్చిన పెట్టుబడులు 775 మిలియన్ డాలర్లు (రూ.5,657 కోట్ల)గా ఉన్నాయి’’ అని కొల్లియర్స్ ఇండియా వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆకర్షణీయమైన విలువలకే ఆస్తులను సొంతం చేసుకునే ఆలోచనతో ఇన్వెస్టర్లు ఉన్నారని తెలిపింది. ముఖ్యంగా ఈ ఏడాది జనవరి–జూన్ మధ్య నివాస గృహ ప్రాజెక్టుల్లోకి వచ్చిన సంస్థాగత పెట్టుబడులు కేవలం 4 శాతంగానే ఉన్నాయని పేర్కొంది. లాజిస్టిక్స్, లైఫ్ సైన్సెస్ ల్యాబ్లు, డేటా కేంద్రాలకు సంబంధించి రానున్న రోజుల్లో పెట్టుబడులు ప్రోత్సాహకరంగా ఉండొచ్చని అంచనా వేసింది.
చదవండి: మీ ఆధార్ బయోమెట్రిక్ సేఫ్గా ఉండాలంటే ఇలా చేయండి