ఫైనల్లో లయోలా, భవాన్స్
జింఖానా, న్యూస్‌లైన్: బీఎఫ్ఐ-ఐఎంజీ రిలయన్స్ ఇంటర్ కాలేజి బాస్కెట్‌బాల్ లీగ్ బాలుర విభాగంలో లయోలా అకాడమీ, భవాన్స్ జట్లు ఫైనల్లోకి చేరుకున్నాయి. సికింద్రాబాద్‌లోని వైఎంసీఏలో గురువారం జరిగిన సెమీఫైనల్లో లయోలా అకాడమీ 72-41తో ఏవీ కాలేజిపై విజయం సాధించింది.
ఆట ప్రారంభం నుంచి లయోలా ఆటగాళ్లు ఆధిక్యమే లక్ష్యంగా దూసుకెళ్లారు. ఒక దశలో లయోలా 26-11తో ముందంజలో ఉంది. అయితే ఏవీ కాలేజి ఆటగాళ్లు చాకచక్యంగా వ్యవహరించి లయోలా జట్టును కొంత మేరకు ప్రతిఘటించగలిగారు. అయినప్పటికీ మ్యాచ్ మొదటి అర్ధ భాగం ముగిసే సమయానికి లయోలా 40-32తో ఆధిక్యంలో నిలిచింది. అనంతరం రెండో అర్ధ భాగంలో లయోలా క్రీడాకారులు గణేశ్ (17), ఉదయ్ (17), చంద్రహాస్ (12), బాషా (11) విజృంభించడంతో జట్టుకు విజయం చేకూరింది.
ఏవీ కాలేజి జట్టులో శ్యామ్సన్ (13), బాలాజీ (12), కిరణ్ (10) రాణించారు. మరో సెమీఫైనల్లో భవాన్స్ జట్టు 59-52తో సెయింట్ మార్టిన్స్‌పై గెలుపొందింది. ప్రారంభం నుంచి ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. మ్యాచ్ ప్రథమార్ధం ముగిసే సమయానికి 25-20తో భవాన్స్ కాలేజి ముందంజలో ఉంది.
ముందు నుంచి దూకుడుగా ఆడుతున్న భవాన్స్ చివరి వరకు అదే తీరును కొన సాగించింది. సెయింట్ మార్టిన్స్ ఆటగాళ్లు జోనా (17), సంతోష్ (12), విశాల్ (10) ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. భవాన్స్ క్రీడాకారులు రోహన్ (23), విష్ణు (13), హేమంత్ (8) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.
ఇతర ఫలితాలు
బాలికల విభాగం సెమీఫైనల్స్
లయోలా అకాడమీ : 44 ( అక్షిత 14, స్నేహ 11, రమా 10); సెయింట్ మార్టిన్స్: 26 (మనీష 10, ఐశ్వర్య 14).
ప్రభుత్య వ్యాయామ విద్య కళాశాల: 48 (ప్రీతి 18, భవ్య 14, అమిత 14); సీవీఎస్ఆర్ సీఓఈ: 27 ( సుమలత 10, సౌమ్య 8, ప్రత్యూష 7).