తానా సదస్సులో ఇంటర్నేషనల్ ఇండియన్ ఎక్స్పో
లబ్బీపేట : వేలాది మంది ప్రవాస భారతీయులను, ఇండియాలో రియల్ ఎస్టేట్ సేవలందిస్తున్న ప్రముఖ కంపెనీలను ఒకే వేదికపైకి చేర్చేలా వినూత్న, అంతర్జాతీయ స్థాయి ప్రదర్శన ‘ఇంటర్నేషనల్ ఇండియన్ ఎక్స్పో’ను నిర్వహించనున్నట్లు తానా ఇండియా కో-ఆర్డినేటర్ గారపాటి ప్రసాద్ చెప్పారు. డెట్రాయిట్లో జూలై 2 నుంచి జరిగే తానా సదస్సులో ఈ ఎక్స్పోను మూడు రోజులపాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం నగరంలోని హోటల్ ఫార్చ్యూన్ మురళీపార్క్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎక్స్పోకు సంబంధించిన లోగోను ఆంధ్రా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఎలక్ట్ అధ్యక్షుడు ముత్తవరపు మురళీకృష్ణ ఆవిష్కరించారు.
వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఐఐఇఎక్స్పీఓ.ఇన్ కూడా ఆయన ప్రారంభించారు. గారపాటి ప్రసాద్ మాట్లాడుతూ అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయులు ఒకప్పుడు హైదరాబాద్లోనే ఎక్కువగా ఇన్వెస్ట్ చేసేవారని, రాష్ట్ర విభజన నేపథ్యంలో మన ప్రాంతంలో కూడా ఎక్కువ పెట్టుబడులు పెట్టేందుకు ఇదొక మంచి అవకాశమని చెప్పారు. ఈ ప్రదర్శనలో వందకు పైగా స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మురళీకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలను సమగ్రంగా అబివృద్ధి చెందేలా ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకంటుందని, అందుకు ఇలాంటి ఎక్స్పోలు దోహదపడతాయన్నారు.
స్విచ్ మిడియా అండ్ ట్రేడ్ ఫెయిర్ వ్యవస్థాపక ఛీప్ ఎగ్జిక్యూటివ్ రాజేష్ సుకమంచి మాట్లాడుతూ సుమారు పదివేల మంది వరకూ ఈ సదస్సుకు హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ ప్రదర్శనలో భాగస్వాములు కావాలనుకునే వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, విమాన టికెట్లు, వీసా సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఎదుగుతున్న కంపెనీలకు ఈ ప్రదర్శన అపూర్వ అవకాశంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.