మాజీ ఆటగాళ్లకు బీసీసీఐ నజరానా
వంద టెస్టులు ఆడిన వారికి రూ. కోటిన్నర
ముంబై: బీసీసీఐ తమ మాజీ ఆటగాళ్లకు భారీ ఎత్తున నగదు ప్రయోజనాలను ప్రకటించింది. వార్షిక సభ్య సమావేశానికి (ఏజీఎం) ఒక రోజు ముందు తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం దేశవాళీ, అంతర్జాతీయ మాజీ ఆటగాళ్లకు నెలవారీ, ఏక మొత్తం అందనుంది. అలాగే అంపైర్లకు మ్యాచ్ ఫీజులను కూడా ప్రకటించింది.
2003-04కు ముందు వంద టెస్టు మ్యాచ్‌లు ఆడిన మాజీలకు ఏక మొత్తం పథకం కింద రూ.1.5 కోట్లు... 75 నుంచి 99 మ్యాచ్‌లు ఆడిన వారికి రూ.కోటి... 50 నుంచి 74 మ్యాచ్‌లు ఆడిన వారికి రూ.75 లక్షలు ఇస్తారు. ఇక కెరీర్లో 25 టెస్టు మ్యాచ్‌లు ఆడి 1993 డిసెంబర్ 31లోపు వీడ్కోలు పలికిన మాజీలకు బోర్డు ఇక నుంచి నెలకు రూ.50 వేలు ఇవ్వనుంది. అదే గడువులోపు రిటైర్ అయ్యి 25 టెస్టులకన్నా తక్కువ ఆడిన వారికి నెలకు రూ.25 వేలు దక్కనున్నాయి.
జనవరి 1, 1994 తర్వాత తప్పుకున్న వారికి నెలకు రూ. 22,500. దివంగతులైన టెస్టు ఆటగాళ్లు, అంపైర్ల భార్యలకు జీవితాంతం నెలకు రూ. 22,500.అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు ఆడిన మాజీలకు నెలకు రూ.15 వేలు.రిటైరైన టెస్టు అంపైర్లకు నెలకు రూ. 22,500.1957-58 సీజన్‌కు ముందు కనీసం పది మ్యాచ్‌లు ఆడిన రంజీ ఆటగాళ్లకు నెలకు రూ.15 వేలు లభిస్తాయి.2003-04 సీజన్ వరకు కనీసం 25 నుంచి 49 మ్యాచ్‌లు ఆడిన ఫస్ట్ క్లాస్ క్రికెటర్లందరికీ నెలకు రూ.15 వేలు.. 50 నుంచి 74 మ్యాచ్‌లు ఆడిన వారికి రూ.22,500; 75 అంతకుమించి ఆడిన వారికి రూ.30 వేలు. అంతర్జాతీయ మ్యాచ్‌లకు సంబంధించి ఫీల్డ్ అంపైర్లు(వన్డే, టి20), థర్డ్ అంపైర్‌కు మ్యాచ్ ఫీజు కింద రోజుకి రూ.లక్షా 82 వేల 500 ఇవ్వనున్నారు.