పెట్టుబడుల గమ్యాల్లో మనమే టాప్
న్యూఢిల్లీ: పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా భారత్ నిలిచింది. ఈ విషయంలో పొరుగునున్న చైనా, సూపర్‌పవర్ అమెరికాలను కూడా వెనక్కినెట్టింది. గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్(ఈఅండ్‌వై) నిర్వహించిన గ్లోబల్ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. కాగా, భారత్ తర్వాత స్థానాల్లో బ్రెజిల్, చైనా వరుసగా రెండు, మూడు ర్యాంకులను దక్కించుకున్నాయి. ఇక టాప్-10 జాబితాలో కెనడా(4), అమెరికా(5), దక్షిణాఫ్రికా(6), వియత్నాం(7), మయాన్మార్(8), మెక్సికో(9), ఇండోనేసియా(10) స్థానాల్లో నిలిచాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) నిబంధనలను ఇటీవల కాలంలో భారీగా సడలించడం, మల్టీబ్రాండ్ రిటైల్ సహా పలు రంగాలకు గేట్లు తెరవడంతో ఇన్వెస్టర్లలో భారత్ పట్ల విశ్వాసం పుంజుకోవడమే ఆకర్షణీయమైన గమ్యంగా నిలవడంలో ప్రధాన పాత్ర పోషించింది. డాలరుతో రూపాయి మారకం విలువ భారీ క్షీణత కూడా ఒక కారణంగా నిలిచింది.
ముఖ్యాంశాలివీ...
ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు నిరాశాజకనంగా ఉండటం, రుణ భారం అంతకంతకూ ఎగబాకడం వంటి ప్రతికూలతలతో అనేక భారతీయ కంపెనీలు తమ ప్రాధాన్యేతర(నాన్-కోర్) వ్యాపారాల్లో వాటా విక్రయాలపై దృష్టి సారిస్తున్నాయని ఈఅండ్‌వై నివేదిక (పెట్టుబడుల విశ్వాస సూచీ) పేర్కొంది. విదేశీ కంపెనీలు, ఇన్వెస్టర్లు భారత్ మార్కెట్లో మరిన్ని అవకాశాలను దక్కించుకోవడానికి ఇది ఆస్కారం కల్పిస్తోందని తెలిపింది.
ఇక భారత్‌లో పెట్టుబడిపెట్టేందుకు ఆసక్తిచూపుతున్న ఇన్వెస్టర్లలో అమెరికా, ఫ్రాన్స్, జపాన్‌లు టాప్-3 స్థానాల్లో ఉన్నాయి. ఆటోమోటివ్, టెక్నాలజీ, లైఫ్‌సెన్సైస్, కన్సూమర్ ఉత్పత్తుల రంగాలో పెట్టుబడులకు విదేశీ ఇన్వెస్టర్లు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు.
70 దేశాల్లోని బడా కార్పొరేట్ కంపెనీలకు చెందిన 1,600 సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో సర్వే ఆధారంగా నివేదికను ఈఅండ్‌వై రూపొందించింది.
వచ్చే 12 నెలల్లో విలీనాలు,కొనుగోళ్ల(ఎంఅండ్ఏ) ఒప్పందాల సంఖ్య పుంజుకోవచ్చని 38 శాతం మంది సర్వేలో అభిప్రాయపడ్డారు.
ఇదే సమయంలో అభివృద్ధి చెందిన మార్కెట్లలో కంపెనీల కొనుగోళ్లకు భారత కార్పొరేట్లు ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు.
ఆర్థిక వ్యవస్థ మందగమనం ఇతరత్రా సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ భారత్‌పై ఇన్వెస్టర్ల ధోరణి సానుకూలంగానే ఉందని ఈఅండ్‌వై నేషనల్ లీడర్, పార్ట్నర్ అమిత్ ఖండేల్వాల్ పేర్కొన్నారు.