అవే తప్పులు
- మొద్దునిద్రలో విద్యాశాఖ
- కొనసాగుతున్న బది‘లీలలు’
- లబోదిబోమంటున్న గురువులు
- ఇదీ ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ తీరు
అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల బదిలీల్లో తప్పుమీద తప్పులు జరుగుతున్నాయి. అయినా అధికార యంత్రాంగం మొద్దునిద్ర వీడడం లేదు. మరోవైపు గుర్తించిన తప్పిదాలనూ సరిదిద్దలేదు. దీంతో కొత్త సమస్యలు ప్రతి కేడర్‌లోనూ ఉత్పన్నమవుతూనే ఉన్నాయి. కొందరు అనర్హులు మంచి స్థానాలు దక్కించుకుంటుండగా, నిబంధనలు పాటిస్తున్న టీచర్లకు అన్యాయం జరుగుతోంది. దీనికితోడు విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది నిర్లక్ష్యం టీచర్ల పాలిట శాపంగా మారుతోంది.
రేషనలైజేషన్‌తో అనంతపురం రూరల్ కందుకూరు జిల్లా పరిçషత్ ఉన్నత పాఠశాలలో ఉన్న రెండు గణితం పోస్టుల్లో ఒక పోస్టు రద్దయ్యింది. దీంతో ఇక్కడ పని చేస్తున్న హేమలత అనే టీచరు తప్పనిసరి బదిలీ కారణంగా బొమ్మనహాల్ స్కూల్‌ను ఆప్ట్ చేసుకుంది. కందుకూరు స్కూల్ పోసుట బ్లాక్ చేయని కారణంగా అరైజింగ్ వేకెన్సీ కనబడడంతో పామిడి మండలం పాళ్యం స్కూల్ టీచరు మాలతీ ఆప్ట్ చేసుకొని ఇబ్బందులు కొనితెచ్చుకుంది. ఇదే పరిస్థితి శుక్రవారం జరగనున్న పండిట్లు, సోషల్ టీచర్ల బదిలీల్లోనూ తలెత్తనుంది.
కూడేరు మండలం జల్లిపల్లి స్కూల్లో :
రేషనలైజేషన్‌తో కూడేరు మండలం జల్లిపల్లి జెడ్పీహెచ్ఎస్లో సోషల్ పోస్టు రద్దయ్యింది. ఇక్కడ పని చేస్తున్న హనుమంతచారి కాశమ్మకు మూడు రేషనలైజేషన్ పాయింట్లు వచ్చాయి. అయితే సీనియార్టీ జాబితా(సీనియార్టీ నంబర్ 251)లో మాత్రం కాశమ్మ రేషనలైజేషన్ ప్రభావంతో వెళ్లడం లేదని కనిపిస్తోంది. బత్తలపల్లి బాలికల పాఠశాలలోనూ సోషల్ పోస్టు రద్దయ్యింది. ఇక్కడ పని చేస్తున్న పుల్లారెడ్డికి మూడు పాయింట్లు కూడా కేటాయించారు. కానీ జాబితా (సీనియార్టీ నంబర్ 504)లో మాత్రం రేషనలేజేషన్ ఎఫెక్ట్ కాలేదని డిస్ప్లే అవుతోంది.
తెలుగు పండిట్ జాబితాలో: ఇక తెలుగు పండిట్ల జాబితాలోనూ ఈ మాయ కనిపిస్తోంది. సీనియార్టీ నంబర్ 3లో ఉన్న ఎస్.ఈశ్వరయ్య కూడేరు మండలం కరుట్లపల్లి జెడ్పీహెచ్ఎస్లో పని చేస్తున్నాడు. అలాగే 395 నంబర్లో ఉన్న పి.సబిత గుడిబండ మండలం ఎస్. రాయాపురం జెడ్పీహెచ్ఎస్లో పని చేస్తోంది. 418 నంబర్లో ఉన్న దూదేకుల సిద్ధయ్య బొమ్మనహాల్ మండలం డి.హొన్నూరు జెడ్పీహెచ్ఎస్లో పని చేస్తున్నాడు. 465 నంబర్లో ఉన్న నాగమణి అమరాపురం మండలం బసవనపల్లి జెడ్పీహెచ్ఎస్లో పని చేస్తోంది. ఈ నలుగురి పోస్టులూ రేషనలేజేషన్‌తో రద్దయ్యాయి. వీరికి మూడేసి పాయింట్లు కూడా కేటాయించారు. కానీ జాబితాలో మాత్రం రేషనలేజేషన్ ఎఫెక్ట్ కాలేదని డిస్ప్లే అవుతోంది. అంటే వీరందరూ ఇతర స్కూళ్లకు వెళ్లగానే ప్రస్తుతం పని చేస్తున్న స్థానాలు ఆటోమేటిక్‌గా అరైజింగ్ వేకెన్సీ కానున్నాయి.
తెలుగు, గణితం మిక్సింగ్ జాబితా: విద్యాశాఖ సిబ్బంది నిర్లక్ష్యంతో తెలుగు, గణితం మిక్సింగ్ సీనియార్టీ జాబితా తయారైంది. ఈ జాబితాను చూసిన అయ్యవార్లు కంగుతింటున్నారు. తెలుగు పండిట్లకు సంబంధించి 510 వరకు సీనియార్టీ జాబితా ఉంది. అయితే ఇదే జాబితాకు కొనసాగింపుగా 837 సీనియార్టీ నంబర్ వరకు ఉంది. వీరందరూ గణితం టీచర్లు. తెలుగు పండిట్ల సీనియార్టీ జాబితాలోకి గణితం టీచర్లను చేర్చేశారు.