16 ఏళ్లకే తల్లినయ్యాను.. చైల్డ్ స్టార్ కంటతడి!
16 ఏళ్ల ప్రాయంలోనే గర్భవతిని అయ్యానని ప్రకటించి ఆమె సినీ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. చిన్న వయస్సులోనే తల్లి అయి చాలాకాలం సినీ రంగుల ప్రపంచానికి దూరమైపోయింది. ఆమెనే ప్రఖ్యాత పాప్ గాయని బ్రిట్నీ స్పియర్స్ చిన్న చెల్లెలు జెమీ లిన్ స్పియర్స్. ఒకప్పుడు చైల్డ్ స్టార్‌గా, బ్రిట్నీ సోదరిగా పతాక శీర్షికలకు ఎక్కిన ఆమె ఇప్పుడు కంటతడి పెడుతూ.. 16 ఏళ్లకే తల్లినవ్వడం ఎంత హృదయవిదారకమో వివరించింది.
టీఎల్సీ చానెల్లో ప్రసారమయ్యే 'ద లైట్స్ గో ఔట్' షోలో 25 ఏళ్ల ఆమె టీనేజ్‌లో తాను గర్భం దాల్చడం వల్ల ఎదురైన చేదు అనుభవాలను వివరించింది. '16 ఏళ్లకే నేను గర్భవతిని అయ్యాను. చైల్డ్ స్టార్ తల్లి కాబోతున్నదని నా గురించి ఎన్నెన్నో కథనాలు రాశారు. నువ్వు గర్భవతి అంటూ ఎంతోమంది ముఖం మీద అన్నారు. ఇప్పుడు వెనుదిరిగి చూసుకుంటే.. ఓరి దేవుడా అన్న భావన కలుగుతుంది' అని ఆమె వివరించింది. లిన్ తల్లిదండ్రులు కూడా తమ బిడ్డ చిన్నవయస్సులో గర్భవతి కావడం వల్ల తాము అనుభవించిన క్షోభను వివరించారు. 25 ఏళ్ల లిన్‌కు ఇప్పుడు 8 ఏళ్ల కూతురు ఉంది. ఈ విషయంలో ఆమె తన అనుభవాలను వివరిస్తూ సాగే డాక్యుమెంటరీ త్వరలో టీఎల్సీలో ప్రసారం కానుంది.