ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోవాలి
హాలియా :కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడి అన్నారు. బుధవారం హాలియాలోని సుందరయ్య భవన్లో జరిగిన సీపీఎం 5వ డివిజన్ మహాసభలో మాట్లాడారు. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో విదేశాల్లోని నల్లధనం వెనక్కి తెస్తామని ఎన్నికలకు ముందు చెప్పిన బీజేపీ నాయకులు ప్రస్తుతం చేతులెత్తేశారని విమర్శించారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కార్మిక చట్టాలను కాలరాస్తూ పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తోందని ఆరోపించారు. దేశంలో కోట్లాదిమంది పొట్టకొట్టే విధంగా ఉపాధి హామీ చట్టానికి మోదీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందన్నారు.
రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం తమకేమీపట్టనట్లు వ్యవహరిస్తోంన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి నంద్యాల నర్సింహారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతాంగం కరువు, కరెంట్ కోతలు, గిట్టుబాటు ధరలు వంటి సమస్యలతో సతమతమవుతుంటే రాష్ట్ర ప్రభుత్వం రైతుల్లో ఆత్మవిశ్వాసం కల్పించలేకపోయిందన్నారు. నాగార్జున సాగర్ ఎడమ కాల్వ కింద మొదటి జోనుకు వరిసాగుకు నీటి విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు తిరందాసు గోపి, నాయకులు డబ్బికార్ మల్లేశ్, కూన్రెడ్డి నాగిరెడ్డి, కత్తి లింగారెడ్డి, కొండేటి శ్రీను, అవుతా సైదులు, కత్తి శ్రీనివాసరెడ్డి, దైద శ్రీను, దుబ్బ రాంచంద్రయ్య, వనమాల కామేశ్వర్, సోమయ్య, ప్రతాఫ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.