బాబు పాలన.. హడలెత్తించిన ఆర్థిక మోసాలు!
సాక్షి, అమరావతి : 2014లో సీఎంగా చంద్రబాబు పగ్గాలు చేపట్టింది మొదలు రాష్ట్రంలో ఆర్థిక మోసాలకు అంతులేకుండా పోయింది. ఈ కాలంలో పలు ప్రముఖ సంస్థలు బోర్డులు తిప్పేశాయి. అగ్రిగోల్డ్, సిరిగోల్డ్, బొమ్మరిల్లు వంటి సంస్థలు డిపాజిటర్ల నెత్తిన పిడుగులు వేసాయి. చంద్రబాబు అధికారం చేపట్టడానికి ఏడాది ముందు బోర్డు తిప్పేసిన అక్షయగోల్డ్, అభయగోల్డ్ డిపాజిటర్లను చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటివరకు ఆదుకోలేదు. ఈ ఐదు కీలక సంస్థలు సేకరించిన మొత్తం డిపాజిట్లు రూ.11,486 కోట్ల 75లక్షలు. వీటి బారినపడి ఏకంగా 60,59,100 మంది డిపాజిటర్లు మోసపోయారు. అవనిగోల్డ్, సిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎన్–మార్ట్, గోల్డ్ క్వెస్ట్, వీఆర్ చిట్‌ఫండ్స్ తదితర సంస్థల మోసాలపై కేసులు నమోదైనప్పటికీ చంద్రబాబు తమను ఆదుకునే చర్యలు తీసుకోలేదంటూ బాధితులు వాపోతున్నారు. వీటిలో 2,44,842 మంది రూ.628 కోట్లు డిపాజిట్లు చెల్లించి చేతులు కాల్చుకున్నారు. వీరందరికీ టీడీపీ హయాంలో వీసమెత్తు న్యాయం జరగలేదు. ఇక కేశవరెడ్డి విద్యా సంస్థల అధిపతి సంగతైతే సరేసరి.
రూ.750 కోట్లు ఎగేసిన ‘కేశవరెడ్డి’కి సర్కారు అండ
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన ప్రముఖ ఆర్థిక మోసాల్లో కేశవరెడ్డి విద్యా సంస్థల స్కామ్ ఒకటి. కేశవరెడ్డి విద్యా సంస్థ ‘విద్యా స్కీమ్’ పేరుతో 1,100 మంది తల్లిదండ్రుల నుంచి రూ.750 కోట్లు డిపాజిట్లు సేకరించారు. డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసిన ఆ సంస్థల అధిపతి నాగిరెడ్డిపై నంద్యాల, పాణ్యం, అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం, వైఎస్సార్ జిల్లా చినచౌక్ పోలీస్స్టేషన్లలో 2015లో ఏడు కేసులు నమోదయ్యాయి. ఈ కేసు సీఐడీకి అప్పగించారు. కేశవరెడ్డి నాగిరెడ్డి వియ్యంకుడు ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరి మంత్రి పదవి పొందారు. దీంతో కేశవరెడ్డి నాగిరెడ్డికి చంద్రబాబు, మంత్రి అండదండలు లభించాయి. ఫలితంగా మోసపోయిన బాధితులకు ఏళ్లు గడుస్తున్నా న్యాయం జరగలేదు.
‘అగ్రిగోల్డ్’లో టీడీపీ అవకాశవాదం
అగ్రిగోల్డ్ స్కామ్ దేశంలోనే అతి పెద్దదిగా చెప్పవచ్చు. డిపాజిటర్ల అసలు, వడ్డీ మొత్తాలు కలిపి దాదాపు రూ.10 వేల కోట్ల వరకు ఎగనామం పెడితే వాటి ద్వారా ఆ సంస్థ కూడబెట్టిన ఆస్తుల విలువ రూ.35 వేల కోట్లు పైమాటే. ఈ సంస్థపై దేశవ్యాప్తంగా 29 కేసులు నమోదయ్యాయి. అందులో 15 కేసులు రాష్ట్రంలోనే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, పశ్చిమబెంగాల్, అండమాన్, నికోబార్ దీవులకు చెందిన 32,52,632 ఖాతాదారులు, మరో 8 లక్షల మంది ఏజెంట్లు రూ.7,623 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 19,43,497 మంది ఖాతాదారులు రూ.3,965కోట్లు డిపాజిట్లు చేశారు. నమ్మకమే పెట్టుబడిగా కోట్లు గుంజేసిన అగ్రిగోల్డ్ సంస్థ 2014 నుంచి తిరిగి చెల్లించకుండా బోర్డు తిప్పేసింది. ఆదుకుంటామని హామీ ఇచ్చిన చంద్రబాబు మీనమేషాలు లెక్కించారు. డిపాజిటర్లను ఆదుకోవాల్సిన అధికారపక్షం లోపాయికారిగా అగ్రిగోల్డ్‌కు చెందిన హాయ్‌ల్యాండ్ తదితర విలువైన ఆస్తులు కొట్టేసే పనిలో పడింది.
‘సిరిగోల్డ్’ సరేసరి..
అత్యధిక వడ్డీ ఆశ చూపి 45వేల మంది నుంచి రూ.95కోట్లు డిపాజిట్లు వసూలు చేసిన సిరిగోల్డ్ సంగతి సరేసరి. 2014లో ఈ మోసాన్ని గుర్తించిన బాధితులు పోలీస్స్టేషన్లను ఆశ్రయించడంతో 8 కేసులు నమోదయ్యాయి. సీఐడీ దర్యాప్తు చేపట్టినప్పటికీ డిపాజిటర్లను ఆదుకునే చర్యలు శూన్యం.
‘బొమ్మరిల్లు’.. జనం జేబు చిల్లు
రియల్ ఎస్టేట్, రోజువారీ వడ్డీ, డిపాజిట్లు, నెలవారీ స్కీమ్స్ పేరుతో బొమ్మరిల్లు సంస్థ జనం జేబుకు చిల్లుపెట్టింది. బొమ్మరిల్లు ఫారమ్స్ అండ్ విల్లాస్ ప్రైవేట్ లిమిటెడ్, రాజా హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, బొమ్మరిల్లు ఫుడ్స్ అండ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, బొమ్మరిల్లు సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్, బొమ్మరిల్లు కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి అనేక సంస్థల పేరుతో వసూళ్లు చేశారు. 20వేల మంది నుంచి రూ.85కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేయడంతో 2014 నుంచి ఆరు కేసులు నమోదయ్యాయి.
అతీగతీలేని ‘అక్షయగోల్డ్’ కేసు..
మరోవైపు.. అక్షయగోల్డ్ కేసు కూడా అతీగతీ లేకపోవడంతో డిపాజిటర్లు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. దేశంలో 15.94 లక్షల మంది నుంచి రూ.735 కోట్లు డిపాజిట్లు సేకరించగా రాష్ట్రంలో 10.11 లక్షల మంది నుంచి రూ.335.75 కోట్లు డిపాజిట్లు సేకరించాక సంస్థ బోర్డు తిప్పేసింది. లబోదిబోమమంటూ డిపాజిటర్లు పోలీస్స్టేషన్లను ఆశ్రయించడంతో రాష్ట్రవ్యాప్తంగా 19 కేసులు నమోదయ్యాయి. వాస్తవానికి 2012 నుంచి కేసులు నమోదైనప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక కూడా ఐదేళ్లుగా డిపాజిటర్లకు న్యాయం జరగలేదు.
హడలెత్తించిన ఆర్థిక మోసాలు..
సాక్షాత్తు రాష్ట్ర సచివాలయాన్ని కేంద్రంగా చేసుకున్న ఓ ముఠా.. కాంట్రాక్టు ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేసిన ఘటనలు గడిచిన రెండేళ్లలో రెండుసార్లు జరగడం ప్రభుత్వ వైఫల్యానికి అద్దంపడుతోంది. నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగాలను ఎరవేసి వారి నుంచి ఏకంగా రూ.51.44 లక్షలు వసూలు చేసి వారిని నిలువునా ముంచేశారు. అలాగే, ఆక్వా చెరువుల పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి ఐడీబీఐ బ్యాంకులో ఏకంగా రూ.540 కోట్లు కొట్టేశారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా అక్రమార్కుల అకృత్యాలకు అంతేలేకుండా పోతోంది. కాగా, రాష్ట్రంలో 2017లో 5,616 చీటింగ్ కేసులు నమోదు కాగా.. 2018లో 5,705 మోసాలు జరిగాయి. ఆర్థికపరమైన మోసాలు ఇలా పెరగడం ప్రమాదకరమైన సంకేతమని ఒక పోలీసు అధికారి వ్యాఖ్యానించడం రాష్ట్రంలో ఈ పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది.
‘అభయగోల్డ్’ అంతే సంగతి..
రాష్ట్రంలో 2013లో వెలుగుచూసిన అభయగోల్డ్ వ్యవహారంలోను చంద్రబాబు సర్కారు ప్రేక్షకపాత్రే వహించింది. రియల్ ఎస్టేట్ పేరుతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 3.99 లక్షల మంది నుంచి రూ.221 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. దీనిపై 19 కేసులు నమోదయ్యాయి. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సీఐడీ.. ఆస్తుల ఎటాచ్మెంట్ వంటి చర్యలు మినహా బాధితులకు న్యాయం చేకూర్చిన దాఖలాల్లేవు.