కేశవరెడ్డి స్కూల్ యాజమాన్యం మోసం చేసిందంటూ ఎస్పీ సత్యయేసుబాబుకు ఫిర్యాదు చేస్తున్న రైతు కుటుంబాలు
అనంతపురం క్రైం: ‘పిల్లల బంగారు భవిష్యత్తు కోసం అప్పులు చేసి మరీ డిపాజిట్లు చెల్లించాం. ప్రతి ఒక్కరూ రూ.లక్షకు తగ్గకుండా రూ.3.5 లక్షల (ఒక్కొక్కరు) వరకు ఇచ్చాం. కేశవరెడ్డి స్కూల్ యాజమాన్యం పిల్లల చదువులయ్యాక డబ్బులిస్తామని ఇంత వరకు పైసా ఇవ్వలేదు’ అంటూ శింగనమల, తాడిపత్రి నియోజకవర్గం రైతు కుటుంబాలు ఎస్పీ సత్యయేసుబాబుతో తమ బాధను చెప్పుకున్నారు. శుక్రవారం కేశవరెడ్డి యాజమాన్యంపై వారు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 2013లో కేశవరెడ్డి విద్యా సంస్థ ‘వన్‌టైం ఫీజు పేరిట’ డబ్బులు వసూలు చేశారన్నారు. దాదాపు జిల్లాలోనే 1500 మంది దాకా ఒక్కసారిగా ఫీజు చెల్లిస్తే ఎలాంటి సమస్య ఉండదని నానా కష్టాలు పడి డబ్బులు చెల్లించామన్నారు.
డబ్బులు చెల్లిస్తామని బాండ్లు ఇచ్చారని, కానీ ఇంత వరకు వారి నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. కర్నూలు, తదితర ప్రాంతాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ప్రస్తుతం తమ పరిస్థితి చాలా దుర్భరంగా ఉందన్నారు. అసలే పంటలు సరిగా పండకపోవడం, మరో వైపు కోవిడ్ ప్రభావంతో చితికిపోతున్నామని కన్నీటి పర్యంతమయ్యారు. తమను దగా చేసిన కేశవరెడ్డి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. దీనికి ఎస్పీ సానుకూలంగా స్పందించి పరిశీలిస్తామన్నారు. ఎస్పీను కలిసిన వారిలో నార్పల పెద్దిరెడ్డి, కూరగానిపల్లి ఈశ్వర్‌రెడ్డి, పుట్లూరు భాస్కర్, పెదపప్పూరు శివప్రసాద్, గుడిపాడు శివశంకర్ రెడ్డి, తదితరులున్నారు.
భూమి అమ్మి రూ.2.5 లక్షలు ఇచ్చా..
2011లో కేశవరెడ్డి విద్యా సంస్థలో డిపాజిట్ చేస్తే పదో తరగతి వరకు ఉచితంగా చదివించి, తిరిగి డిపాజిట్ ఇస్తారని చెప్పారు. ఆ సమయంలో చేతిలో చిల్లిగవ్వ లేదు. అప్పుడే మా ఊళ్లో ఫ్యాక్టరీ పడుతోందని ఎకరా రూ.లక్ష ఇస్తారని చెప్పారు. ఒక్కమాట ఆలోచించకుండా పిల్లాడి భవిష్యత్తు కంటే భూమీ అవసరం లేదని ఉన్న ఆరు ఎకరాల్లో ఐదు ఎకరాలు అమ్మేశా. అందులో వచ్చిన డబ్బులతో కేశవరెడ్డి స్కూల్‌కు రూ.2.5 లక్షలు చెల్లించా, రెండేళ్లుగా డిపాజిట్ కోసం తిరుగుతున్నా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సార్ స్పందించి మాకు న్యాయం చేయాలి. – సీ శ్రీరాములు , గుడిపాడు, యాడికి
పేదోళ్లను మోసం చేస్తే ఎలా?
20 ఏళ్లుగా క్షవరం (బార్బర్ వృతి) చేస్తున్నా. నాకు ఇద్దరు కుమారుడు హర్షవర్ధన్, భానుకిరణ్. 2014లో కేశవరెడ్డి స్కూల్‌లో పిల్లలను చేర్పించా. అప్పట్లో పోస్టాఫీస్ ఆర్‌డీ కట్టిన రూ.75 వేలు, మరో రూ.75 వేలు అప్పు తీసుకుని మొత్తం రూ.1.5 లక్షలు చెల్లించా. పిల్లల చదువయ్యాక డబ్బులు చెల్లిస్తామని చెప్పారు. కేశవరెడ్డి యాజమాన్యం బాండ్లు ఇచ్చాం భయపడాల్సిన పనిలేదన్నారు. ఇప్పుడేమో డబ్బుల కోసం వెళితే అసలు వ్యక్తే జైల్లో ఉన్నారని ఇప్పట్లో ఇవ్వమని చెబుతున్నారు. పేదోళ్లను మోసం చేస్తే ఎలా?.. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి. – మంగలి శివకుమార్ , ఎర్రనేల కొట్టాల, అనంతపురం
బంగారం తాకట్టు పెట్టాం
వ్యవసాయమే ఆధారం మాకు. పెద్దగా ఆస్తులు లేవు. ఉన్న ఐదెకరాల భూమిలోనే సాగు చేసేవాన్ని. 2013లో కేశవరెడ్డి స్కూల్ ఆఫర్ ఇచ్చింది. డిపాజిట్ చేస్తే పదో తరగతి వరకు చదివిస్తారని చెప్పారు. ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టాం, కూడబెట్టిన డబ్బులు మొత్తం కలుపుకుని రూ.3 లక్షలు డిపాజిట్‌గా చెల్లించా. బాబు పదోతరగతి పూర్తైంది. కానీ ఇంత వరకు డబ్బులు చెల్లించలేదు. ఆర్థిక పరిస్థితి చెప్పుకునేది కాదు. కష్టం వస్తే కడుపులోనే ఉంచుకనే వాళ్లం. కానీ పిల్లాడి భవిష్యత్తు దెబ్బతింటా ఉంటే ఎలా ఊరుకునేది. తమను మోసం చేసిన కేశవరెడ్డి యాజమాన్యంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని మా డబ్బు వెనక్కి ఇప్పించాలి. – వరదరాజులరెడ్డి, చుక్కలూరు,తాడిపత్రి
Comments
Please login to add a commentAdd a comment