Khalifa Haftarm
-
లిబియాలో సంక్షోభం
ట్రిపోలి: అంతర్యుద్ధంతో అతలాకుతలమైన లిబియాలో సాయుధ ఘర్షణ చెలరేగింది. లిబియా కమాండర్ ఖలీఫా హఫ్తార్కు చెందిన తిరుగుబాటు దళాలు రాజధాని ట్రిపోలివైపు బయలుదేరాయి. అంతర్జాతీయ సమాజం గుర్తింపుపొందిన జీఎన్ఏ ప్రభుత్వ దళాలు వారిని రాజధానికి 50 కి.మీ దూరంలో నిలువరించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంగా జీఎన్ఏ దళాలు హఫ్తార్ బలగాలపై వైమానిక దాడులతో విరుచుకుపడ్డాయి. హఫ్తార్ దళాలు వెంటనే హింసను విడనాడి వెనక్కు వెళ్లాలని ఐక్యరాజ్యసమితి, ఫ్రాన్స్, జర్మనీ సూచించాయి. 2011లో లిబియా పాలకుడు గడాఫీని అమెరికా హతమార్చడంతో ఆ దేశంలో అంతర్యుద్ధం చెలరేగింది. -
బెంఘాజీలో ఉగ్రవాదులను ఊడ్చేశారు
లిబియా: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లిబియాలోని కీలకమైన బెంఘాజీ ప్రాంతంపై పూర్తిగా పట్టునుకోల్పోయారు. ఉగ్రవాదులపై తీవ్ర పోరాటం చేస్తున్న అధికారిక సైన్యానికి సానుభూతిగా పనిచేస్తున్న ఫీల్డ్ మార్షల్ ఖలిఫా హఫ్తార్ సేన బెంఘాజిలోని గన్ఫౌడా నుంచి ఆ ఉగ్రవాదులను తరిమికొట్టింది. ఈ విషయాన్ని ఆ సైన్యం మార్షల్ హప్తార్ గురువారం ప్రకటించారు. గత కొన్ని నెలలుగా ఈ ప్రాంతంపై ఉగ్రవాదుల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. దీంతో వారిని సమూలంగా నాశనం చేసేందుకు జరుగుతున్న యుద్ధాల్లో ఆ ప్రాంతం అస్తవ్యస్థంగా మారింది. అక్కడ ఉన్న ఉగ్రవాదులు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులుగానీ, అల్ కాయిదా ఉగ్రవాదులుగానీ అయ్యుండొచ్చని మిలిటరీ అధికారులు చెబుతున్నారు. దాదాపు చాలామంది అధికారిక సైన్యమే మట్టుపెట్టగా మిగిలిన వారిని హప్తార్ సైన్యం తరిమికొట్టింది. అయితే, కొందరు ఉగ్రవాదులు సమీపంలోని 12 బ్లాక్స్ అనే ప్రాంతంలోకి వెళ్లి తలదాచుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. హప్తార్ సేనకు ఇప్పటి వరకు ఐక్య రాజ్యసమితి నుంచి గానీ లిబియా నుంచి గానీ గుర్తింపు లేదు. ఈ సైన్యాన్ని లిబియన్ నేషనల్ ఆర్మీగా చెబుతుంటారు.