kichannagari lakshma reddy
-
కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఐటీ దాడులు.. ఆరుగంటలుగా కొనసాగుతున్న సోదాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ హైదరాబాద్‌లో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆరు గంటలుగా సోదాలు కొనసాగుతున్నాయి. మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్ఆర్, బడంగ్పేట్ మేయర్ పారిజాత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తోడల్లుడు గిరిధర్‌రెడ్డి ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కేఎల్ఆర్ నివాసం, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ మున్సిపాలిటీలో ఉన్న కేఎల్ఆర్ ఫామ్ హౌస్‌లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కొద్దిరోజుల క్రితం తుక్కుగూడలో పార్టీ కార్యాలయాన్ని కేఎల్ఆర్ ప్రారంభించారు. అటు శంషాబాద్ మండలం బహదూర్‌గూడలో ఉన్న అక్బర్ బాగ్‌లో కేఎల్ఆర్ ఫామ్ హౌస్‌లోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ రంగారెడ్డి పరిసరాల్లో పలు ఫామ్ హౌస్‌లు, గచ్చిబౌలి సమీపంలో ఎన్సిసీలో కూడా విల్లా ఉన్నట్టు సమాచారం. మరో వైపు, కాంగ్రెస్ నేత పారిజాత నర్సింహారెడ్డి ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. బడంగ్ పేట్ కార్పొరేటర్‌గా ఉన్న పారిజాత.. మహేశ్వరం కాంగ్రెస్ టికెట్ ఆశించారు. తెల్లవారు జామున 5 గంటలకు చేరుకున్న ఐటీ అధికారులు.. పారిజాత కూతురు ఫోన్ స్వాధీనం చేసుకుని సోదాలు జరుపుతున్నారు. ప్రస్తుతం పారిజాత తిరుపతిలో, ఆమె భర్త నర్సింహా రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. 10 ప్రాంతాల్లో ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. కోకాపేట్ హిడెన్ గార్డెన్‌లోని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తోడల్లుడు గిరిధర్‌రెడ్డి ఇంట్లో కూడా సోదాలు చేపట్టారు. గిరిధర్‌రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. చదవండి: కాంగ్రెస్ పొత్తు యూటర్న్‌పై నారాయణ ట్వీట్ -
మరోసారి అవకాశమివ్వండి
శామీర్‌పేట్ రూరల్, న్యూస్‌లైన్: బంగారు తెలంగాణ నిర్మాణం కావాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ మేడ్చల్ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని తూంకుంట, అంతాయిపల్లి, మందాయిపల్లి గ్రామాల్లో గురువారం రాత్రి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తనకు మరోసారి అవకాశం ఇస్తే రాష్ట్రంలోనే నియోజక వర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని, ఈ ప్రాంతానికి గోదావరి, కృష్ణా జలాలను తీసుకువచ్చి తాగు, సాగునీటి ఇబ్బందులు తొలగిస్తానని, పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసి నిరుద్యోగ నిర్మూలనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం తూంకుంట గ్రామానికి చెందిన వార్డు సభ్యులు భరత్, బాల్‌రాజ్ కేఎల్లార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు వంగ పెంటారెడ్డి, దయాసాగర్యాదవ్, జి.బాల్‌రాజ్‌గౌడ్, అశోక్, మహేందర్‌రెడ్డి, సింగం సత్యనారాయణ, హన్మంత్‌రెడ్డి, రాజ య్య, ఎల్లం, ఐలయ్య యాదవ్, శ్రీని వాస్, రాముయాదవ్, రాగజ్యోతి, కల్ప న, మంగరాణి, సర్పంచ్ నాగేశ్యాద వ్, ఉపసర్పంచ్ మాధవి పాల్గొన్నారు. కాంగ్రెస్‌తోనే తెలంగాణ అభివృద్ధి.. ఘట్కేసర్: మరోసారి అవకాశం ఇస్తే అద్భుత అభివృద్ధి చేస్తానని మేడ్చల్ కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్లార్ పేర్కొన్నారు. మండలంలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో గురువారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. రాజీవ్ గృహకల్ప కాలనీలో ఉన్న సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మం డల అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, పార్టీ మాజీ మండలాధ్యక్షుడు బద్దం యాదగిరిరెడ్డి, రాజేందర్, రమేష్, శ్రీనివాస్, శ్రీనివాస్‌చారి, పయ్యావుల సంతోష్, వెంకటేష్, అనిల్, శంకర్ పాల్గొన్నారు. -
మేడ్చల్ టికెట్ నాదే: లక్ష్మారెడ్డి
మేడ్చల్: మేడ్చల్ నియోజకవర్గ టికెట్ తనకే లభిస్తుందని సిట్టింగ్ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన నామినేషన్ దాఖలు చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ అధిష్టానం, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ సిట్టింగ్‌లకే తిరిగి టికెట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారని గుర్తు చేశారు. ఆ విశ్వాసంతోనే నామినేషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. ఒకవేళ అధిష్టానం సిట్టింగ్‌లకు కాకుండా మరొకరికి టికెట్ ఇస్తే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు. ఎన్నికల్లో డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని, దాన్ని అరికట్టడానికి తనవంతుగా నామినేషన్ వేయడానికి ఎలాంటి ఆర్భాటాలు లేకుండా వచ్చినట్లు వివరించారు. -
'కేసీఆర్ ఇప్పటికైనా మైండ్ గేమ్ మానుకో'
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని మేడ్చల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, వర్థన్నపేట ఎమ్మెల్యే శ్రీధర్ మండిపడ్డారు. ఆపార్టీకి ఎమ్మెల్యే అభ్యర్థుల కొరత ఉండటంతో ఇతర పార్టీ నేతలను ఆహ్వానిస్తున్నారని వారు అన్నారు. తెలంగాణ వ్యతిరేకులను కూడా పార్టీలో చేర్చుకునేందుకు కూడా కేసీఆర్ వెనుకాడటం లేదని ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలు కొందరు టీఆర్ఎస్లో చేరుతున్నారంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ ఇప్పటికైనా మైండ్ గేమ్ మానుకోవాలని కేఎల్ఆర్ హెచ్చరించారు. తమకు పార్టీ వీడే ఆలోచన లేదని వారిద్దరు స్పష్టం చేశారు. -
'సంతోష్‌రెడ్డి భూకబ్జా వివరాలు బయటపెట్టాలి'
హైదరాబాద్: మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి స్థాయి దిగజారి మాట్లాడారని మంత్రులు శైలజానాథ్, గంటా శ్రీనివాసరావు విమర్శించారు. పదవిలో ఉన్నప్పుడు దినేష్‌రెడ్డి మాట్లాడితే విలువ ఉండేదన్నారు. హత్యకేసులో ఓ మంత్రి ప్రమేయం ఉందని చెప్పిన దినేష్‌రెడ్డి ఆ వివరాలు వెల్లడించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తెలిపారు. ఆ మంత్రిపై కేసు దాఖలు చేయకుండా సీఎం దృష్టికి ఎందుకు తీసుకెళ్లారని ప్రశ్నించారు. సీఎం సోదరుడు సంతోష్‌రెడ్డి భూకబ్జా వివరాలను దినేష్‌రెడ్డి బయటపెట్టాలని డిమాండ్ చేశారు. దినేష్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వం సమీక్షించాలని కేఎల్ఆర్ సూచించారు.