నాకూ మమ్మీ, డాడీ ఉన్నారు
చేతికి వచ్చిన గింజ ఎక్కడ పుట్టిందో మనకు తెలియదు.. ఇప్పుడది అనాథ!
దాన్ని మనం ‘విత్తు’ చేస్తే.. దానికి ప్రేమ, అనురాగం, రక్షణలాంటి పోషకాలు ఇస్తే..
ఇంకేముంది.. మిగతా కథ మీకు తెలుసు! గింజను పెంచుకోకపోతే మనం అనాథలమవుతాం!
‘ఏంటీ విశేషం.. స్వీట్స్ పంచుతున్నారు?’ కాజూబర్ఫీ అందుకుంటూ అడిగింది సరిత. ‘మా దీప క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయింది సరితగారూ.. ’ మెరుస్తున్న కళ్లతో చెప్పింది సంగీత. ‘కంగ్రాట్స్ అండీ’ చూపుల్లోనూ అభినందన తెలిపింది సరిత.థ్యాంక్స్ అంటూ వెళ్లిపోతున్న సంగీతనే చూస్తుండిపోయింది ఆమె. గడిచిన కాలం గుర్తొచ్చింది.
దాదాపు పదేళ్ల కిందట (విజయవాడలో)...
నర్సమ్మ.. తమ కాలనీలోనే ఉన్న స్కూల్లో ఆయా. ఆమె భర్త పచ్చి తాగుబోతు. ఏంచేసేవాడు కాదు. ఆ ఇంటిని తన రెక్కల కష్టంమ్మీదే నడిపేది నర్సమ్మ. ఉదయం ఆరు నుంచి స్కూల్ టైమ్ వరకూ ఇళ్లల్లో పనిచేసేది. మళ్లీ సాయంకాలం స్కూల్ అయిపోయాక ఇళ్లల్లో పనికొచ్చేది. అలా ఆ అపార్ట్మెంట్, థర్డ్ ఫ్లోర్‌లోని తమ నాలుగు ఫ్లాట్లలో కూడా చేసేది. ఉన్న ఇద్దరాడపిల్లలను బాగా చదివించాలని ఆమె తపన. తాగీతాగీ లివర్ చెడిపోయి భర్త చనిపోయాడు. అతను ఉన్నా ఏనాడూ ఆ నమ్మకాన్నివ్వలేదు కాబట్టి భర్త మరణం నర్సమ్మను పెద్దగా కుంగదీయలేదు. కాని విధి ఆ పని చేసింది. నర్సమ్మ శరీరంలో క్యాన్సర్ కణాన్ని ప్రేరేపించి. దాంతో భర్త పోయిన యేడాదికి పేగు క్యాన్సర్‌తో నర్సమ్మా చనిపోయింది.
అప్పటికి ఆమె పెద్ద కూతురికి పదేళ్లు, చిన్న కూతురికి ఎనిమిదేళ్లు. అనాథలయ్యారు. ఈ నాలుగు ఫ్లాట్ల వాళ్లే నర్సమ్మ అంత్యక్రియలు జరిపించారు. ఆ ఇద్దరు ఆడపిల్లల పరిస్థితే ఎవరికీ మింగుడు పడలేదు. నర్సమ్మ తాలూకు బంధువులెవరి జాడా లేదు. ఆ పిల్లల్ని ఎక్కడ పెట్టాలి? ఆడపిల్లలు కాబట్టి బాధ్యత తీసుకోవడానికి ఎవరూ రాలేదు. కనీసం హాస్టల్లో పెట్టి చదివించడానిక్కూడా ఈ ఫ్లాట్లల్లో ఉన్నవాళ్లు ధైర్యం చేయలేదు. అప్పుడు ముందుకొచ్చింది సంగీత. అప్పటికే తనకు ఇద్దరు ఆడపిల్లలు. అయినా ఈ ఇద్దరినీ దత్తత తీసుకొంది. ఆ పిల్లల్లో ఒక పిల్లే దీప. నర్సమ్మ పెద్ద బిడ్డ. ఈ కుటుంబమూ ఆ పిల్లను పెద్ద కూతురిగానే భావిస్తోంది. ఆ ఇద్దరు అమ్మాయిలను తమ పిల్లలతో సమానంగా చదివిస్తోంది. నర్సమ్మ చిన్న కూతురు కూడా చదువులో చురుకు. సివిల్స్‌కి ప్రిపేర్ చేయించాలనే ఆలోచనలో ఉన్నారు సంగీత దంపతులు. ఆ రోజు వాళ్లు ఈ ఇద్దరినీ అక్కున చేర్చుకోకపోతే ఈ రోజు ఏ స్థితిలో ఉండేవారో?
రెండేళ్ల నాటి ఇంకో సంఘటన..
ఇది తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండలం, నిమ్మపల్లి అనే ఊళ్లో జరిగింది. గుమ్మడిదారి భవాని, భార్గవి, విష్ణు తోబుట్టువులు. రెండేళ్ల కిందట తల్లిదండ్రులను కోల్పోయారు. అనాథలైన ఈ ముగ్గురి గురించి సాక్షి దినపత్రికలో చదివి తెలుసుకున్న అప్పటి సిరిసిల్ల డీఎస్పీ దామెర నర్సయ్య, వేములవాడ రూరల్ సీఐ మాధవి కలిసి ఈ ముగ్గురు పిల్లలను దత్తత తీసుకున్నారు. అబ్బాయి విష్ణును రంగినేని ట్రస్ట్‌లో, అమ్మాయిలిద్దరినీ తగంళ్లపల్లి కస్తూరిబా పాఠశాలలో చేర్పించారు. ఈ ఇద్దరు అమ్మాయిల సంరక్షణ, చదువు, ఖర్చులన్నిటినీ సీఐ మాధవే చూసుకుంటున్నారు.ఇప్పుడు.. భవాని పదోతరగతి (మొన్నటి) పరీక్షల్లో 9.7 జీపీఏ సాధించింది. ‘మేడమ్ నన్నెప్పుడు.. ‘‘అమ్మలా అడుగుతున్నా.. టెన్త్‌లో టెన్‌కి టెన్ జీపీఏ తెచ్చుకోవాలి’ అంటూ ఎంకరేజ్ చేసేవారు’ అని భవాని గుర్తుచేసుకుంది. ‘భవాని చురుకైన పిల్ల. మెరిట్ సాధిస్తుందని నాకు ముందే తెలుసు.
నా నమ్మకాన్ని నిలబెట్టింది’ అని గర్వంగా చెప్పారు సీఐ మాధవి.అక్కడొక దీప.. ఇక్కడొక భవాని... మరెక్కడో ఒక పవన్.. ఇంకెక్కడో నిరంజన్... కొన్నాళ్లు తల్లిదండ్రుల సంరక్షణలో పెరిగి ప్రమాదవశాత్తో.. దురదృష్టవశాత్తో వాళ్లను కోల్పోయి ఆ ప్రేమకు దూరమైన వాళ్లు. మరికొందరు పిల్లలైతే పుట్టుకతోనే అమ్మానాన్నేంటి.. అసలు నా అన్నవాళ్లే లేక అనాథ శరణాలయంలోని ఊయల ఒడి ఆసరాగా.. తమ చిట్టిపిడికిటి చిరుభద్రతతోనే పెరుగుతున్నారు. అమ్మానాన్న, అవ్వాతాత, అత్తామామ, పిన్నిబాబాయ్, అక్క, అన్న, చెల్లి, తమ్ముడు .. వంటి బంధాలు, మంచిచెడు, మర్యాదమన్నన, చదువుసంస్కారం వంటి పెంపక విలువలూ అందక.. సమాజానికి బానిసలుగానో.. బెడదగానో తేలుతున్నారు.
దత్తత
ఈ పౌరులు బానిసలుగానో, బెడదగానో తయారవడం భారత భవితవ్యానికి అత్యంత ప్రమాదకరం. అందుకే ఈ పొత్తిళ్ల బాల్యానికి అమ్మ ప్రేమ అండకావాలి. ఆ బుజ్జి అడుగులకు నాన్న చేతి ఆప్యాయత అందాలి. ఆ కుటుంబం లోని మిగిలిన అనూరాగాలకూ వీళ్లూ పాత్రులు కావాలి. మార్గం దత్తత. ప్రేమను పంచాలనుకునే దయామయులందరికీ! అమ్మతనాన్ని చాటుకోవడానికి పేగు బంధమే ఉండక్కర్లేదు. నాన్నరికం చూపించుకోవడానికి రక్తసంబంధమే కానక్కర్లేదు. చలించే మనసుంటే చాలు. ఆ బిడ్డలకు అమ్మానాన్న కావచ్చు. వాళ్లకు కొత్త జీవితమివ్వచ్చు! దత్తత పూర్తిగా మానవత్వానికి సంబంధిందే అయినా ఆ అనాథల క్షేమం కోసం దానికి చట్టభద్రతనూ కల్పించారు. అంటే ఈ పిల్లలకు, వాళ్లను పెంచుకునే వారికి మధ్య బాంధవ్యాలన్నీ పారదర్శకమేనన్నమాట. అచ్చంగా మన సొంత వాళ్లతో ఉన్నట్లే. పరాయి వాళ్లను సొంతం చేసుకోవడమన్నట్లే!
మూడే అక్షరాలు .. నూరేళ్ల జీవితానికి రక్ష
దత్తత.. మూడు అక్షరాలే. కాని నూరేళ్ల జీవితానికి నిండైన రక్షణ కల్పిస్తోంది. అనాథలుగా మిగిలిపోకుండా అనురాగాల పందిరి కిందకు చేరుస్తోంది. తద్వారా అమ్మానాన్న అనే హోదానే కాకుండా ఆ జీవితాలకు ఓ అర్థం కల్పించే బృహత్తర అవకాశాన్ని ఇస్తోంది. మానవతామూర్తులుగా నిలబెడుతోంది. మానవరూపంలో ఉన్న దైవాలుగా నీరాజనాలు అందిస్తోంది. నేను, నువ్వు దాటి మనం అనే పెద్దమాటను ప్రమోట్ చేస్తోంది. పరాయి బిడ్డలతో సొంత కుటుంబ పరిధిని విస్తృతంకావిస్తోంది.
అనాథలను దత్తత తీసుకున్న సెలబ్రెటీలు
సలీంఖాన్, హెలెన్... అర్పితాఖాన్
అర్పితాఖాన్ తెలిసే ఉంటుంది. సల్మాన్ ఖాన్ చెల్లెలు. ఆమె నచ్చిన, మెచ్చిన వరుడితో హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో అంగరంగవైభవంగా పెళ్లిచేశారు సల్మాన్ ఖాన్ అండ్ బ్రదర్స్. ఆ అర్పితాఖాన్ ఆ సోదరులకు రక్తం పంచుకుపుట్టిన తోబుట్టువు కాదు. ప్రేమను పంచుకొని పెరిగిన సోదరి. సలీమ్ ఖాన్, హెలెన్ల దత్త కుమారి.
సుస్మితాసేన్.. రెనీ.. అలీషా
సుస్మితా విశ్వసుందరిగా జగమంతా పరిచయమే. ఆమె మనసూ విశ్వమంత విశాలమైనదని నిరూపించుకున్నారు. అనాథలకు అమ్మగా ఉంటానని విశ్వసుందరి వేదిక మీద చెప్పిన మాటను చేతల్లోకి తెచ్చారు. తన 25 వ యేట రినీ అనే ఓ వీథిబాలను దత్తత తీసుకొని అమ్మ అయ్యారు. అలాగే 2010లో అలీషా అనే ఇంకో అనాథనూ అక్కున చేర్చుకొని రినీకి తోబుట్టువును చేశారు. సింగిల్ మదర్‌గానే ఆ ఇద్దరినీ పెంచుతున్నారు.
రవీనా టండన్.. ఛాయ.. పూజ
నటిగా రవీనా కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే తన దూరపు బంధువు.. వరుసకు కజిన్ అవుతుంది. ఆమె పిల్లలను దత్తత తీసుకుంది. ఆ ఇద్దరే ఛాయ, పూజ. కజిన్ కుటుంబం అప్పుల్లో కూరుకుపోయి రోడ్డున పడ్డప్పుడు ఆ ఇద్దరు ఆడపిల్లల పెంపకం బాధ్యతను స్వీకరించింది రవీనా. అప్పటికి ఆమె వయసు కేవలం 21 ఏళ్లు.
మిథున్ చక్రవర్తి.. దిషాని
డిస్కోకింగ్.. మిథున్ చక్రవర్తి పేరు ఈ తరానికీ తెలిసే ఉంటుంది. బాలీవుడ్ హీరో. దిషాని అనే అనాథను దత్తత తీసుకొని తనెంత కారుణ్యమూర్తో తెలియజేశాడు. ఈ అమ్మాయిని తన ముగ్గురు కొడుకులు మహాక్షయ్, ఉష్మే, నమాషిలతో సమానంగా పెంచాడు.
దిబాకర్ బెనర్జీ...
ఈ పేరు చెప్పగానే వినిపించే సినిమా షాంఘై, నిన్నటి డిటెక్టివ్ బ్యోమ్‌కేశ్ బక్షీ.. ఎట్సెట్రా. ఈ బాలీవుడ్ డైరెక్టర్ కూడా ముంబైలోని ఓ అనాథాశ్రమం నుంచి ఒక అమ్మాయిని దత్తత తీసుకున్నాడు.
నీలం.. అహానా
నీలం.. 80, 90ల్లోని బాలీవుడ్ హీరోయిన్. ఒకటిరెండు తెలుగు సినిమాల్లోనూ నటించారు. బాలీవుడ్ నటుడు సమీర్ సోనీని పెళ్లి చేసుకున్నారు. వీళ్ల పెళ్లయిన రెండేళ్లకు అహానా అనే అనాథ పిల్లను దత్తత తీసుకున్నారు.
కునాల్.. రాధ
ఫనా సినిమా ఎంత హిట్టో తెలుసు కదా! ఆ సినిమా దర్శకుడే కునాల్ కొహ్లీ. అతనూ ఓ ఏడునెలల చిన్నారిని దత్తత తీసుకున్నాడు. ఆ అమ్మాయికి రాధ అని పేరుపెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు కునాల్, ఆయన భార్య రవీనా.
రాహుల్‌బోస్..
బాలీవుడ్ అండ్ బెంగాలీ యాక్టర్. పూర్ణ సినిమాతో తెలుగువాళ్లకూ పరిచయం అయ్యాడు. సామాజిక సేవలో ముందుంటాడు. అండమాన్ నికోబార్ దీవుల్లో ఒక అనాథాశ్రమాన్ని నడిపిస్తున్నాడు. అందులోంచి ఆరుగురు పిల్లలను దత్తత తీసుకున్నాడు.
శోభన.. అనంతనారాయణి
నటిగా, భరతనాట్య కళాకారిణిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు శోభన. ఆమె ఓ అనాథను అక్కున చేర్చుకున్నారు. అనంత నారాయణి అని పేరు పెట్టుకొని సింగిల్ పేరెంట్‌గానే ఆ పాపను పెంచుతున్నారు. కేరళలోని తనకు ఇష్టమైన గురవాయూర్ గుడిలో ఆ దత్తపుత్రికకు శాస్త్రోక్తంగా అన్నప్రాశన కావించారు.
నిఖిల్ అద్వాని.. కేయా
బాలీవుడ్ డైరెక్టర్. కేయా అనే అనాథను దత్తత తీసుకున్నాడు.
ప్రీతీజింటా...
హృషీకేశ్‌లోని మదర్ మిరాకిల్ అనే స్కూల్లోని 34 మంది అనాథలను దత్తత తీసుకొని వాళ్లను చదివిస్తున్నారు ప్రీతి జింటా. అనాథలను అక్కున చేర్చుకొని వాళ్లకు కొత్త జీవితాన్ని అందించిన ప్రేమమూర్తులు హాలీవుడ్‌లోనూ ఉన్నారు. హాలీవుడ్లో దత్తత అనగానే గుర్తొచ్చే మొదటి పేరు ఎంజలీనాజోలీ. ఆ తర్వాత జాబితా పెద్దగానే ఉంది. మడోన్నా, సాండ్రా బుల్లక్, మేరీ లూయీస్ పార్కర్, షరాన్ స్టోన్, టామ్ క్రూజ్, నికోల్ కిడ్మన్.. వీళ్లంతా ఆ వరుసలో ఉంటారు.
ముగింపు..
దత్తత.. వ్యక్తిగత విషయమే. అయినా సామాజిక బాధ్యతనూ ఇముడ్చుకున్న ప్రక్రియ. మనలోని మానవత్వానికి నిదర్శనం! మనసున్న మనుషులున్నంత వరకూ ఎవరూ అనాథలు కారని నిరూపించే ఆలంబన! ఈ భూమ్మీద పడ్డవారందరికీ బతికే హక్కు ఉంది. మంచి జీవితాన్ని ఆస్వాదించే అవసరమూ ఉంది. ఆ హక్కు వాళ్లది. ఆ అవసరం మనం తీరుద్దాం! మనకు ఒక బిడ్డ చాలు.. దత్తతతో ఇంకో బిడ్డను మనలో కలుపుకుందాం!