జంబ్లింగ్‌లో ‘నారాయణ’ మాయాజాలం
ఒక కేంద్రానికి 220 మంది విద్యార్థులు
వారిలో 140 మంది నారాయణ విద్యార్థులే
నేటి నుంచి పదోతరగతి పరీక్షలు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): నారాయణ పాఠశాల యాజమాన్యం, విద్యాశాఖాధికారులు కలిసి పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో జంబ్లింగ్ స్వరూపాన్నే మార్చేశారు. కర్నూలు జిల్లాలో ఒకే కేంద్రానికి 140 మంది నారాయణ పాఠశాల విద్యార్థులను కేటాయించడంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. మాస్ కాపియింగ్‌కు తెరలేపి ర్యాంకులు సాధన కోసమే యాజమాన్యం ఈ తతంగానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
కర్నూలు నగరం బళ్లారి చౌరస్తాలోని నారాయణ రెసిడెన్షియల్ ఇంగ్లిష్ మీడియం ఉన్నత పాఠశాలలో 161 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. వీరిలో 46 మంది బాలికలు, 115 మంది బాలురు ఉన్నారు. వీరిని నగరంలోని వివిధ కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు రాసేందుకు కేటాయించారు. అయితే ఒక్క సెయింట్ క్లారెట్ పాఠశాలలోని కేంద్రానికే 140 మందికిపైగా కేటాయించడంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ కేంద్రానికి మొత్తం 220 మంది విద్యార్థులను కేటాయించగా వారిలో 140మంది నారాయణ విద్యార్థులే. మిగిలిన 80లో నాలుగు పాఠశాల విద్యార్థులు ఉన్నారు.
పదో తరగతి పరీక్షల్లో జంబ్లింగ్ విధానం అమల్లో ఉంది. ఈ విధానం మొత్తం హైదరాబాద్‌లోని డైర్టరేట్‌లో జరుగుతుంది. అందుకోసం ఓ ప్రత్యేక సాఫ్ట్వేరు ఉంటుంది. ఓ కేంద్రానికి దాదాపు 10-15 పాఠశాలలను కేటాయించాల్సి ఉంది. అయితే జిల్లాల నుంచి విద్యార్థుల సంఖ్య, పాఠశాలల సంఖ్య, కేంద్రాల సంఖ్య తదితర విషయాలను మాత్రమే పంపాలి. అలా పంపడంలో జిల్లా విద్యాశాఖాధికారులు చేతివాటం ప్రదర్శించడంతోనే నారాయణ విద్యార్థులు మొత్తం ఒకే కేంద్రానికి కేటాయించారనే విమర్శలు ఉన్నాయి. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరపాల్సి ఉంది.
ఈ విషయమై డీఈవో రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. నారాయణ పాఠశాలకు చెందిన 140 మంది విద్యార్థులు ఒకే కేంద్రానికి ఎలా కేటాయించారో తనకు తెలియదన్నారు. ఆ కేంద్రంలో మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా సిట్టింగ్ స్క్వాడ్‌తో పర్యవేక్షిస్తామని చెప్పారు.