హైదరాబాద్ కుర్రాడి సత్తా
మాంచెస్టర్‌లో శిక్షణకు ఎంపిక
జింఖానా, న్యూస్‌లైన్: ఎయిర్టెల్ రైజింగ్ స్టార్స్ అండర్-16 ఫుట్‌బాల్ ప్రతిభాన్వేషణలో భాగంగా మాంచెస్టర్ యునెటైడ్ సాకర్ స్కూల్లో శిక్షణ పొందేందుకు హైదరాబాద్‌కు చెందిన కె.రాకేశ్ అర్హత సాధించాడు. గోవాలో రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీల ఫైనల్ ట్రయల్స్‌లో 23 మంది క్రీడాకారులు పోటీ పడ్డారు.
ఆరు నెలల పాటు జరిగిన ఈ పోటీల్లో కోల్‌కత, ఢిల్లీ, ముంబై, గోవా, బెంగుళూరు, హైదరాబాద్ వంటి మహానగరాల నుంచి గోల్‌కీపర్‌తో కలుపుకుని మొత్తం 11 మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. ఆటగాళ్ల శారీరక, మానసిక స్థితి, వారి క్రమశిక్షణ, ఆటతీరు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని మాంచెస్టర్ యునెటైడ్ కోచ్‌లు లామి సొనోల, కెవిన్ కొనెల్, డేవ్ చాప్మాన్, ఆడమ్ హిల్టన్ ఆధ్వర్యంలో ఈ ఎంపిక జరిగింది. ఈ 11 మంది ఆటగాళ్లు వారం రోజుల పాటు ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ సాకర్ స్కూల్లో అక్కడి అకాడమీ జట్టుతో పాటు శిక్షణ పొందుతారు.