రాణించిన నాయర్, కులకర్ణి
హుబ్లి: అభిషేక్ నాయర్ (4/61), ధావల్ కులకర్ణి (3/60) చక్కటి బౌలింగ్‌తో రాణించడంతో మూడో అనధికారిక టెస్టులో తొలి రోజు భారత్ ‘ఎ’ ఆధిక్యం ప్రదర్శించింది. ఇక్కడి కేఎస్‌సీఏ క్రికెట్ గ్రౌండ్లో బుధవారం ప్రారంభమైన ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ ‘ఎ’ 77.4 ఓవర్లలో 268 పరుగులకే ఆలౌటైంది. లియోన్ జాన్సన్ (148 బంతుల్లో 81; 15 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, ఫుదాదిన్ (95 బంతుల్లో 47; 3 ఫోర్లు), దేవ్ నారాయణ్ (55 బంతుల్లో 35; 6 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. అనంతరం భారత్ ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 10 పరుగులు చేసింది. జగదీశ్ (8), గంభీర్ (2) క్రీజ్‌లో ఉన్నారు.
రాణించిన జాన్సన్...
టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో బ్రాత్‌వైట్ (1)ను అవుట్ చేసి జహీర్‌ఖాన్ భారత్‌కు శుభారంభం అందించాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే పావెల్ (21) కూడా వెనుదిరిగాడు. అయితే మూడో వికెట్‌కు దేవ్నారాయణ్తో 70 పరుగులు, నాలుగో వికెట్‌కు ఫుదాదిన్తో 52 పరుగులు జోడించి జాన్సన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఫలితంగా టీ సమయానికి వెస్టిండీస్ 3 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసి మెరుగైన స్థితిలో నిలిచింది. అయితే చివరి సెషన్లో నాయర్, కులకర్ణి విజృంభించడంతో విండీస్ బ్యాటింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. 93 పరుగుల వ్యవధిలో ఆ జట్టు చివరి 7 వికెట్లు కోల్పోయింది.