‘భూసేకరణ’పై విచారణకు సుప్రీం ఓకే
న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు తాజాగా జారీ చేసిన భూసేకరణ ఆర్డినెన్స్-2015 చట్టబద్ధతను సవాల్చేస్తూ రైతు సంఘాలు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ వ్యాజ్యాన్ని సోమవారం విచారణకు స్వీకరిస్తామని చీఫ్ జస్టిస్ హెచ్.ఎల్. దత్తు, జస్టిస్ అరుణ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం తెలిపింది.
పార్లమెంటులో అనుసరించాల్సిన శాసన ప్రక్రియ నుంచి తప్పించుకుంటూ దొడ్డిదారిన తిరిగి భూసేకరణ ఆర్డినెన్స్ జారీ చేయడం రాజ్యాంగాన్ని మోసగించడమేనని భారతీయ కిసాన్ యూనియన్, గ్రామ్ సేవా సమితి, ఢిల్లీ గ్రామీణ్ సమాజ్, చోగామా వికాస్ ఆవం తమ పిటిషన్లో ఆరోపించాయి. రాజ్యసభలో తగిన సంఖ్యాబలం లేకపోవడం వల్లే లోక్సభలో ఆమోదం పొందిన భూసేకరణ చట్ట సవరణ బిల్లును ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టకుండా తిరిగి ఆర్డినెన్స్ జారీ చేసిందని రైతు సంఘాలు పేర్కొన్నాయి.