పేదలెవరు.. ధనికులెందరు
సాక్షి, ఏలూరు : సామాజిక, ఆర్థిక, కులగణన(ఎస్ఈసీసీ) ముసాయిదా జాబితాను గురువారం ప్రచురించనున్నారు. పేద కుటుంబాలను గుర్తించి వారికి ఉద్దేశించిన పథకాలను అమలు చేయాలనే లక్ష్యంతో 2011లో కుటుంబాలు, వ్యక్తుల నుంచి సేకరించిన సమాచారం పరిశీలన 2013లో పూర్తయ్యింది. అన్ని గ్రామ పంచాయతీల్లో ఆయూ కుటుం బాల ముసాయిదా జాబితా రూపంలో తాజాగా ప్రచురణ జరుగుతుంది. గ్రామ సమాఖ్యల వద్ద, గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద, రెవెన్యూ కార్యాలయం జాబితాలను ప్రజల పరిశీలనార్థం ఉంచుతారు. ‘హెచ్‌టీటీపీ/ఎస్ఈసీసీ/జిఓవీ.ఇన్’ వెబ్సైట్లోనూ ముసాయిదా జాబితా అందుబాటులో ఉంటుంది. జాబితా ప్రచురణకు సంబంధించిన ఫారాలు, స్టేషనరీ, ప్రచారానికి అవసరమైన కరపత్రాలను తహసిల్దార్, మునిసిపల్ కమిషనర్లకు అందజేశారు.
జాబితా ప్రచురితమైన 10రోజుల లోపు గ్రామసభ జరుగుతుంది. 30 రోజులపాటు ప్రజల నుంచి విజ్ఞప్తులు, ఆక్షేపణలు స్వీకరిస్తారు. ప్రజలు తమ అభ్యంతరాలను ఏ, బీ, సీ, డీ, ఈ ఫారాల్లో అందజేయాలి. స్వదస్తూరితో రాసిచ్చినా తీసుకుంటారు. గ్రామ, మండల, పట్టణ స్థాయిల్లో పంచాయతీ కార్యదర్శి నుంచి మునిసిపల్ కమిషనర్ వరకూ అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఏలూరు నగరపాలక సంస్థలో మాత్రం పట్టణ ప్రణాళికాధికారిని చార్జ్ ఆఫీసర్‌గా నియమించారు. ముసాయిదా జాబితా ప్రచురించిన 82వ రోజు అంటే అక్టోబర్ 20న తుది జాబితా ప్రచురిస్తారు. ఏ వ్యక్తి అయినా నిర్ధేశిత అధికారులు ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందకపోతే గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ డివిజి నల్ అధికారికి, పట్టణ ప్రాంతం వారు జాయింట్ కలెక్టర్‌కు 7 రోజుల లోపు అప్పీల్ చేయవచ్చు.
క్లెయిములు/ఆక్షేపణల షెడ్యూల్ ఇలా
గ్రామ సభల నిర్వహణ ఆగస్టు 9
క్లెయిములు/ఆక్షేపణలను నిర్ణీత
నమూనాలో స్వీకరించుట ఆగస్టు 29
క్లెయిములు/ఆక్షేపణలను పరిష్కరించుట సెప్టెంబర్ 20
అప్పీలేట్ అధికారికి దరఖాస్తుల సమర్పణ సెప్టెంబర్ 28
అప్పీల్స్ పరిష్కరించుట అక్టోబర్ 18
తుది జాబితా ప్రచురణ అక్టోబర్ 20