ప్రసూతి చట్ట సవరణలకు కేబినెట్ ఓకే
♦ కార్మిక చట్టం, లోక్‌పాల్ చట్టాల్లో సవరణలకు కూడా ఓకే
♦ ఎఫ్‌సీఐ కార్మికులకు కొత్త పెన్షన్ పథకం, వైద్య సేవలు
♦ విద్యుత్ ప్లాంట్ల బొగ్గు వాడకం తగ్గింపునకు 1,554 కోట్ల ప్రాజెక్టు
న్యూఢిల్లీ: మహిళలకు ప్రసూతి సెలవులను ప్రస్తుతమున్న 12 వారాల నుంచి 26 వారాలకు పెంచుతూ ప్రసూతి ప్రయోజనాల చట్టానికి చేసిన సవరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రసూతి ప్రయోజనం (సవరణ) బిల్లు, 2016ను లోక్‌సభలో ప్రవేశపెట్టటం ద్వారా 1961 నాటి ప్రసూతి ప్రయోజన చట్టానికి చేసిన సవరణలను.. ప్రధానిమోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఆమోదించింది. దీనిద్వారా మహిళలకు మాతృత్వ కాలంలో ఉద్యోగ భద్రత లభిస్తుంది. తమ శిశువుల పరిరక్షణ కోసం పూర్తి వేతనంపై సెలవు తీసుకునే అవకాశం లభిస్తుంది. పది మంది అంతకన్నా ఎక్కువ ఉద్యోగులు గల అన్ని సంస్థలకూ ఈ చట్టం వర్తిస్తుంది. సంఘటిత రంగంలో గల 18 లక్షల మంది మహిళా ఉద్యోగులకు దీని ద్వారా ప్రయోజనం చేకూరనుంది. బిల్లును రాజ్యసభలో ఇంకా ఆమోదించాల్సి ఉంది.
‘లోక్‌పాల్’లో మార్పులకు ఆమోదం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్జీవోల ఎగ్జిక్యూటివ్‌లు తమ జీవితభాగస్వాములు, పిల్లల ఆస్తుల వివరాలను వెల్లడించకుండా మినహాయిస్తూ లోక్‌పాల్ చట్టానికి చేసిన సవరణను కేబినెట్ ఆమోదించింది. ప్రభుత్వ సంస్థ అయిన భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ఉద్యోగులు 35,000 మందికి కొత్త పెన్షన్ పథకాన్ని, పదవీ విరమణ తర్వాత వైద్య సేవలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
1,554 కోట్లతో ఏయూఎస్‌సీ ప్రాజెక్టు
థర్మల్ విద్యుత్ ప్లాంట్ల కోసం అడ్వాన్స్డ్ అల్ట్రా సూపర్ క్రిటికల్ (ఏయూఎస్‌సీ) సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి రూ. 1,554 కోట్ల వ్యయంతో పరిశోధన, అభివృద్ధి ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుతో ఇంధన భద్రత లభించనుంది. భవిష్యత్తు థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో బొగ్గు వినియోగం, కర్బన ఉద్గారాలను తగ్గించటం లక్ష్యంగా ప్రాజెక్టును బీహెచ్ఈఎల్, ఇందిరాగాంధీ సెంటర్ ఆఫ్ ఆటమిక్ రీసెర్చ్, ఎన్టీపీసీ)ల కన్సార్షియం ప్రతిపాదించింది.