Manu Sawhney
-
తీవ్ర ఒత్తిళ్లు.. ఐసీసీ సీఈవో రాజీనామా
తీవ్ర ఒత్తిళ్ల నడుమ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సీఈవో మను సాహ్నే(56) తన పదవికి రాజీనామా చేశారు. గత నాలుగు నెలలుగా సస్పెన్షన్‌లో ఉన్న ఆయనపై అంతర్గత దర్యాప్తు కొనసాగుతోంది కూడా. ఈ నేపథ్యంలో గురువారం ఆయన తన రాజీనామా సమర్పించాడు. దుబాయ్: ఐసీసీ సీఈవో మను సాహ్నే రాజీనామాను వెంటనే ఆమోదించింది ఐసీసీ బోర్డు. ఇక తాత్కాలిక సీఈవోగా జియోఫ్ అలార్డైస్‌ను కొనసాగించనుంది. ఐసీసీ బోర్డు సభ్యులతో మను ప్రవర్తనపై గత కొన్ని నెలలుగా విమర్శలు వినవస్తున్నాయి. 56 ఏళ్ల మను.. సహచరులను లెక్కచేయకపోవడం, దూకుడు స్వభావం లాంటి చేష్టలతో బోర్డులో అసంతృప్తిని రాజేశాడు. ఈ పరిణామాల నేపథ్యంలో కిందటి ఏడాది ఎన్నికల సమయంలో ఇంటీరియమ్ చైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజాను కొన్ని దేశాల క్రికెట్ బోర్డులు బలపరిచాయి కూడా. అలాగే వచ్చే సీజన్లకు సంబంధించిన ఈవెంట్ల ఫీ కూడా ఇప్పుడే చెల్లించాలని ఆయన తీసుకున్న నిర్ణయం బోర్డుల్లో ఆయన పట్ల వ్యతిరేకతను రాజేశాయి. 2019 వరల్డ్‌కప్ తర్వాత డేవ్ రిచర్డ్సన్ పదవీ కాలం ముగియడంతో సీఈవోగా ష్వానేను ఐసీసీ ఎంచుకుంది. పదవీ కాలపరిమితి 2022 వరకు ఉన్నా.. ఆయనపై వ్యతిరేకతతో బలవంతంగా రాజీనామా చేయించింది ఐసీసీ బోర్డు. ఈఎస్పీఎన్ ఎదుగుదలకు.. మను ష్వానే.. ఐసీసీకి ఐదో సీఈవో. ఇంతకు ముందు సింగపూర్ స్పోర్ట్స్ హబ్ కోసం, ఈఎస్పీఎన్ స్టార్‌స్పోర్ట్స్‌కు 22 ఏళ్లపాటు ఎండీగా పనిచేశాడు. ఆయన స్వస్థలం ఢిల్లీ. ఆర్కేపురంలోని ఢిల్లీ పబ్లిక్స్కూల్లో చదివిన ష్వానే.. బిట్స్ పిలానీలో బీఈ మెకానికల్ ఇంజినీరింగ్ చేశాడు. ఐఐఎఫ్‌టీ(ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్)లో ఎంబీఏ చదివాడు. -
సీఈఓ సాహ్నిపై వేటుకు ఐసీసీ సిద్ధం!
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లో కలకలం రేగింది. ఎవరినీ పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్న చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) మను సాహ్నిని సాగనంపేందుకు రంగం సిద్ధమైంది. బోర్డులో ఎవరితోనూ కలుపుగోలుతనం లేని ఆయన నియంతృత్వ పోకడలతో అందరికి మింగుడు పడని ఉన్నతాధికారిగా తయారయ్యారు. సభ్యులే కాదు బోర్డు సహచరులు, కింది స్థాయి అధికారులు సైతం భరించలేనంత కరకుగా ప్రవర్తిస్తున్న ఆయన్ని ప్రస్తుతానికైతే సెలవుపై పంపించారు. రాజీనామా చేయించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ‘రాజీ’పడకపోతే ఇక తొలగించడమైన చేస్తాం కానీ ఏమాత్రం కొనసాగించేందుకు సిద్ధంగా లేమని ఐసీసీ వర్గాలు, సభ్యదేశాలు ఏకాభిప్రాయానికి వచ్చేశాయి. 2019లో జరిగిన ఐసీసీ ప్రపంచకప్ అనంతరం డేవ్ రిచర్డ్సన్ స్థానంలో 56 ఏళ్ల సాహ్ని సీఈఓ బాధ్యతలు చేపట్టారు. 2022 వరకు పదవిలో ఉండాల్సిన ఆయనకు అందరితోనూ చెడింది. ముక్కోపితత్వంతో వ్యవహరించే ఆయన శైలిపై విమర్శలు రావడంతో విచారణ చేపట్టారు. ప్రముఖ సంస్థ ప్రైజ్ వాటర్‌హౌజ్ కూపర్ అంతర్గతంగా చేపట్టిన ఈ దర్యాప్తులో ప్రతీ ఒక్కరు సాహ్ని వ్యవహారశైలిని తులనాడినవారే ఉన్నారు... కానీ ఏ ఒక్కరు సమర్థించలేదు. ఈ నేపథ్యంలో ఐసీసీ ఉన్నతాధికారుల బోర్డు ఆయన్ని మంగళవారమే సెలవుపై పంపింది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సాహ్ని ఏకస్వామ్యంగా సాగిపోతున్నారు. సమష్టితత్వంతో, కలివిడిగా సాగాల్సివున్నా ఆయన మాత్రం ఇవేవి పట్టించుకోలేదు. ఐసీసీ విధాన నిర్ణయాల్లో సైతం తన మాటే నెగ్గించుకునే ప్రయత్నం చేశారు తప్ప... సహచరులు, సభ్యుల సూచనలకు విలువివ్వాలన్న స్పృహ కోల్పోయారు. సహచరులు, కింది స్థాయి ఉద్యోగులపై అయితే దుందుడుగా ప్రవర్తించేవారు. మధ్యే మార్గంగా సాగాల్సిన ఐసీసీ చైర్మన్ ఎన్నికల ప్రక్రియలోనూ ఇమ్రాన్ ఖాజా ఎన్నికయ్యేందుకు మొండిగా ప్రవర్తించారు. ఐసీసీలోని శాశ్వత సభ్యదేశాలే కాదు... మెజారిటీ అనుబంధ సభ్యదేశాల ప్రతినిధులకు ఇదేమాత్రం రుచించలేదు. ఐసీసీలోని ‘బిగ్–3’ సభ్యులైన బీసీసీఐ, ఈసీబీ, సీఏలు మను సాహ్నిని ఇక భరించలేమన్న నిర్ణయానికి రావడంతో సాగనంపక తప్పలేదు. గౌరవంగా రాజీనామా చేస్తే సరి లేదంటే ఐసీసీ తీర్మానం ద్వారా తొలగించడం అనివార్యమైంది. ఇందుకు ఐసీసీ బోర్డులోని 17 మంది సభ్యుల్లో 12 మంది మద్దతు అవసరమవుతుంది. -
ఐసీసీ సీఈవో మనూ సాహ్నీకి షాక్
దుబాయ్: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) సీఈవో మను సాహ్నీని సెలవుపై పంపించారు. ఐసీసీలోని సభ్య దేశాలు, ఉద్యోగులతో ఆయన ప్రవర్తన సరిగా లేదని విచారణ జరిపిన ప్రైస్ వాటర్‌హౌజ్ కూపర్స్ తేల్చి చెప్పడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. 2022లో సాహ్నీ పదవీకాలం ముగియనుండగా.. ఆలోపే ఆయన రాజీనామా చేస్తారని తెలుస్తోంది. 2019 వరల్డ్‌కప్ తర్వాత డేవ్ రిచర్డ్సన్ నుంచి బాధ్యతలు అందుకున్న సాహ్నీ.. అప్పటి నుంచి అంతా తానే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఐసీసీని కూడా శాసించగలిగే సామర్థ్యం ఉన్న బీసీసీఐ ఆయన తీరుపై గుర్రుగా ఉంది. అంతేకాకుండా ఐసీసీ చైర్మన్ పదవికి న్యూజిలాండ్‌కు చెందిన గ్రెగ్ బార్క్లేను ఈ బోర్డులు ప్రతిపాదించగా.. సాహ్నీ మాత్రం తాత్కాలిక చైర్మన్ ఇమ్రాన్ ఖవాజాకు మద్దతు తెలిపారు. ఇక ప్రతి ఏటా ఐసీసీ ఒక టోర్నీ నిర్వహించాలన్న సాహ్నీ ప్రతిపాదన కూడా ఈ మూడు బోర్డులకు రుచించలేదు. దీంతో సాహ్నీ తీరుపై ఈ మూడు పెద్ద బోర్డులు అసంతృప్తి వ్యక్తం చేశాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనను సెలవుపై పంపించింది. ఒకవేళ ఆయన రాజీనామా చేయకపోతే.. తొలగించే అవకాశం కూడా ఉన్నట్లు తెలిసింది. చదవండి: 'ప్లేయర్ ఆఫ్ ద మంత్' రవిచంద్రన్ అశ్విన్ 'మామా.. ఇప్పటికైనా మీ పంతం వదిలేయండి' -
షెడ్యూల్ ప్రకారమే టి20 ప్రపంచకప్
దుబాయ్: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్–19 తీవ్రత ఇంకా తగ్గకపోయినా టి20 ప్రపంచకప్‌ను నిర్వహించే విషయం లో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆశాభావంతోనే ఉంది. షెడ్యూల్ ప్రకారమే (అక్టోబర్ 18 నుంచి) పొట్టి ప్రపంచకప్‌ను నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఈ విషయంలో ప్రస్తుతానికి ఎలాంటి మార్పుచేర్పులు లేవని ఐసీసీ ప్రకటించింది. 12 మంది శాశ్వత సభ్య దేశాలు, 3 అసోసియేట్ బోర్డులకు చెందిన చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఐసీసీ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. కరోనా నేపథ్యంలో క్రికెట్‌ను మళ్లీ దారిలో పెట్టేందుకు కావాల్సిన చర్యలు తీసుకోవడంపై ఇందులో చర్చ జరిగింది. ప్రధానంగా టి20 ప్రపంచకప్‌ను నిర్వహించే విషయంలో మాత్రం ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. దీంతో పాటు 2021లో జరగాల్సిన మహిళల వన్డే వరల్డ్‌కప్ తేదీలను కూడా మార్చాల్సిన అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తమైందని ఐసీసీ వెల్లడించింది. అయితే 2023 వరకు నిర్దేశించిన భవిష్యత్ పర్యటన కార్యక్రమం (ఎఫ్టీపీ)లో మాత్రం మార్పులు జరిగే అవకాశం ఉందని ఐసీసీ పేర్కొంది. దీనిపై మళ్లీ సమీక్షించిన అనంతరం కోవిడ్–19 కారణంగా ఎంత క్రికెట్ నష్టపోయామో మళ్లీ అదంతా జరిగేలా ఐసీసీ ప్రణాళికలు రూపొందించే అవకాశం ఉంది. అదే విధంగా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌ను కొనసాగించాలా లేదా అనే అంశంతో పాటు ప్రతిపాదిత క్రికెట్ వరల్డ్ సూపర్ లీగ్‌ను మొదలు పెట్టాలా లేదా అనే అంశంపై కూడా తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మనూ సాహ్ని వ్యాఖ్యానించారు. -
ఫేస్‌బుక్‌కు ఐసీసీ డిజిటల్ హక్కులు
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)తో ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ఫేస్బుక్ జత కట్టింది. భారత ఉపఖండంలో జరిగే క్రికెట్ మ్యాచ్‌లకు సంబంధించిన డిజిటల్ కంటెంట్ హక్కులను ఫేస్బుక్ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఐసీసీ గురువారం ధ్రువీకరించింది. డిజిటల్ హక్కులతో పాటు మ్యాచ్ పున:ప్రసారాలు, క్రికెట్‌కు సంబంధించిన కథనాలను ఇకనుంచి ఫేస్బుక్ ప్రేక్షకులకు అందించనుంది. 2023 వరకు ఈ భాగస్వామ్యం కొనసాగుతుందని ఐసీసీ స్పష్టం చేసింది. ‘క్రికెట్ ప్రపంచంలోకి ఫేస్‌బుక్‌ను ఆహా్వనిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగిస్తోన్న ఫేస్బుక్ ద్వారా క్రికెట్‌కు మరింత లబ్ధి చేకూరుతుంది’ అని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మను సాహ్ని అన్నారు. ఐసీసీతో భాగస్వామ్యంపై ఫేస్బుక్ హర్షం వ్యక్తం చేసింది. -
ఐసీసీ కొత్త సీఈవో మను సాహ్ని
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈవో)గా ఈఎస్‌పీఎస్ స్టార్ స్పోర్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ మను సాహ్ని నియమితులయ్యారు. ఇతను డేవిడ్ రిచర్డ్సన్ స్థానంలో సీఈవోగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇంగ్లండ్‌లో జరుగనున్న వన్డే ప్రపంచ కప్‌తో రిచర్డ్సన్ పదవీకాలం ముగియనుంది. దీంతో ఐసీసీ అపెక్స్ కమిటీ చైర్మన్ శశాంక్ మనోహర్, నామినేషన్స్ కమిటీ కొత్త సీఈవోగా సాహ్నిని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఇంగ్లండ్‌లో వన్డే ప్రపంచకప్ ముగిసిన అనంతరం జూలైలో ఆయన సీఈవోగా బాధ్యతలు చేపడతారు. సింగపూర్ స్పో ర్ట్స్ హబ్‌కు మను గతంలో సీఈవోగా పనిచేశాడు. ఈఎస్‌పీఎన్‌లో కూడా గతం లో కీలక బాధ్యతలు నిర్వహించారు.