
తీవ్ర ఒత్తిళ్ల నడుమ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సీఈవో మను సాహ్నే(56) తన పదవికి రాజీనామా చేశారు. గత నాలుగు నెలలుగా సస్పెన్షన్‌లో ఉన్న ఆయనపై అంతర్గత దర్యాప్తు కొనసాగుతోంది కూడా. ఈ నేపథ్యంలో గురువారం ఆయన తన రాజీనామా సమర్పించాడు.
దుబాయ్: ఐసీసీ సీఈవో మను సాహ్నే రాజీనామాను వెంటనే ఆమోదించింది ఐసీసీ బోర్డు. ఇక తాత్కాలిక సీఈవోగా జియోఫ్ అలార్డైస్‌ను కొనసాగించనుంది. ఐసీసీ బోర్డు సభ్యులతో మను ప్రవర్తనపై గత కొన్ని నెలలుగా విమర్శలు వినవస్తున్నాయి. 56 ఏళ్ల మను.. సహచరులను లెక్కచేయకపోవడం, దూకుడు స్వభావం లాంటి చేష్టలతో బోర్డులో అసంతృప్తిని రాజేశాడు. ఈ పరిణామాల నేపథ్యంలో కిందటి ఏడాది ఎన్నికల సమయంలో ఇంటీరియమ్ చైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజాను కొన్ని దేశాల క్రికెట్ బోర్డులు బలపరిచాయి కూడా. అలాగే వచ్చే సీజన్‌లకు సంబంధించిన ఈవెంట్ల ఫీ కూడా ఇప్పుడే చెల్లించాలని ఆయన తీసుకున్న నిర్ణయం బోర్డుల్లో ఆయన పట్ల వ్యతిరేకతను రాజేశాయి.
2019 వరల్డ్‌కప్ తర్వాత డేవ్ రిచర్డ్‌సన్ పదవీ కాలం ముగియడంతో సీఈవోగా ష్వానేను ఐసీసీ ఎంచుకుంది. పదవీ కాలపరిమితి 2022 వరకు ఉన్నా.. ఆయనపై వ్యతిరేకతతో బలవంతంగా రాజీనామా చేయించింది ఐసీసీ బోర్డు.
ఈఎస్‌పీఎన్ ఎదుగుదలకు..
మను ష్వానే.. ఐసీసీకి ఐదో సీఈవో. ఇంతకు ముందు సింగపూర్ స్పోర్ట్స్ హబ్ కోసం, ఈఎస్‌పీఎన్ స్టార్‌స్పోర్ట్స్‌కు 22 ఏళ్లపాటు ఎండీగా పనిచేశాడు. ఆయన స్వస్థలం ఢిల్లీ. ఆర్కేపురంలోని ఢిల్లీ పబ్లిక్‌స్కూల్‌లో చదివిన ష్వానే.. బిట్స్ పిలానీలో బీఈ మెకానికల్ ఇంజినీరింగ్ చేశాడు. ఐఐఎఫ్‌టీ(ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్)లో ఎంబీఏ చదివాడు.