ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మనూ సాహ్ని
దుబాయ్: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్–19 తీవ్రత ఇంకా తగ్గకపోయినా టి20 ప్రపంచకప్‌ను నిర్వహించే విషయం లో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆశాభావంతోనే ఉంది. షెడ్యూల్ ప్రకారమే (అక్టోబర్ 18 నుంచి) పొట్టి ప్రపంచకప్‌ను నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఈ విషయంలో ప్రస్తుతానికి ఎలాంటి మార్పుచేర్పులు లేవని ఐసీసీ ప్రకటించింది. 12 మంది శాశ్వత సభ్య దేశాలు, 3 అసోసియేట్ బోర్డులకు చెందిన చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఐసీసీ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. కరోనా నేపథ్యంలో క్రికెట్‌ను మళ్లీ దారిలో పెట్టేందుకు కావాల్సిన చర్యలు తీసుకోవడంపై ఇందులో చర్చ జరిగింది.
ప్రధానంగా టి20 ప్రపంచకప్‌ను నిర్వహించే విషయంలో మాత్రం ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. దీంతో పాటు 2021లో జరగాల్సిన మహిళల వన్డే వరల్డ్‌కప్ తేదీలను కూడా మార్చాల్సిన అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తమైందని ఐసీసీ వెల్లడించింది. అయితే 2023 వరకు నిర్దేశించిన భవిష్యత్ పర్యటన కార్యక్రమం (ఎఫ్‌టీపీ)లో మాత్రం మార్పులు జరిగే అవకాశం ఉందని ఐసీసీ పేర్కొంది. దీనిపై మళ్లీ సమీక్షించిన అనంతరం కోవిడ్–19 కారణంగా ఎంత క్రికెట్ నష్టపోయామో మళ్లీ అదంతా జరిగేలా ఐసీసీ ప్రణాళికలు రూపొందించే అవకాశం ఉంది. అదే విధంగా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌ను కొనసాగించాలా లేదా అనే అంశంతో పాటు ప్రతిపాదిత క్రికెట్ వరల్డ్ సూపర్ లీగ్‌ను మొదలు పెట్టాలా లేదా అనే అంశంపై కూడా తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మనూ సాహ్ని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment