మన్యమా..మరో కాశ్మీరమా..
పాడేరు/చింతపల్లి: మన్యం వాతావరణం మరో కాశ్మీర్‌ను తలపిస్తోంది. కొద్ది రోజులుగా ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.ముఖ్యంగా సముద్ర మట్టానికి 3 వేల మీటర్ల ఎత్తులో ఉన్న లంబసింగిలో రోజు ఉదయం 10 గంటల వరకు పొగమంచు దట్టంగా కమ్ముకుంటోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదుతో మన్యం వాసులు గజగజ వణుకుతున్నారు. ఈ వాతావరణం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. చింతపల్లి,పాడేరు సమీపంలోని మినుములూరులో మంగళవారం 11 డిగ్రీలు, నిత్యం చల్లటి ప్రాంతాలుగా గుర్తింపు పొందిన లంబసింగి,పాడేరు ఘాట్‌లోని పోతురాజుస్వామి గుడి వద్ద 8 డి గ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
బుధవారం ఉష్ణోగ్రత మరింత తగ్గింది. మినుములూరు ,చింతపల్లి కేంద్రాల్లో 10 డిగ్రీలు, పాడేరు ఘాట్, లంబసింగిలో ఏడు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాయంత్రం నాలుగు గంటల నుంచే చలి వణికిస్తోంది. పొగ మంచు దట్టంగా కురుస్తోంది. ఉదయం 10 గంటల వరకు సూర్యుడు కనిపించడం లేదు. సూర్యోదయం వరకు జనం చలితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం వేళల్లో పాఠశాలలకు వెళ్లే చిన్నారులు,వ్యవసాయ పనులకు వెళ్లే గిరిజనులు నరకయాతన పడుతున్నారు. వచ్చే ఏడాది జనవరి రెండో వారం వరకు ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు కనిష్టంగానే నమోదవుతాయని చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త శేఖర్ సాక్షికి తెలిపారు.