పంటరుణాలకు పెద్దపీట
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: వ్యవసాయ రుణాలకు పెద్దపీట వేస్తూ రూ.5031కోట్లతో 2014-15వార్షిక రుణప్రణాళికను ప్రభుత్వ ఖరారుచేసింది. ఖరీఫ్, రబీలో పంటరుణాల రూపంలో రూ.2803కోట్లను రైతులకు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ సారి కేటాయింపులు 16శాతం మేర పెరిగాయి. ఈ మేరకు ప్రాధాన్యత రంగాల వారీగా కేటాయింపులతో కూడిన రుణప్రణాళిక నివేదికను బుధవారం జరిగిన బ్యాంకర్ల సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ విడుదల చేశారు. గతేడాది రూ.4341 కోట్లతో వార్షిక రుణ ప్రణాళికను రూపొందించారు.
పంట రుణాల మంజూరులోనూ గతేడాదితో పోలిస్తే 17శాతం అదనంగా రుణమంజూరు లక్ష్యం విధించారు. రూ.2406 కోట్లు పంటరుణాల వితరణ లక్ష్యంగా నిర్ణయించగా, 108 శాతం అంటే రూ.2602.26 కోట్ల లక్ష్యం సాధించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వ్యవసాయ కాలిక రుణాలు, వ్యవసాయ అనుబంధ రుణాలకు రుణప్రణాళికలో పెద్దపీట వేశారు. వ్యవసాయేతర రంగాలతో పాటు ఇతర ప్రాధాన్యత రంగాలకు కూడా కేటాయింపులు పెంచుతున్నట్లు వార్షిక రుణప్రణాళిక నివేదిక వెల్లడిస్తోంది.
పంటరుణాల మాఫీపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం, వార్షిక రుణ ప్రణాళిక విడుదల ఆలస్యం కావడం, వర్షాభావ పరిస్థితులు తదితరాల నేపథ్యంలో పంటరుణాల మంజూరు లక్ష్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏటా మార్చి నెలాఖరులో వార్షిక రుణ ప్రణాళిక విడుదల చేయడం ఆనవాయితీ. అయితే ఈ ఏడాది రాష్ట్ర విభజన, సాధారణ ఎన్నికలు తదితరాల నేపథ్యంలో రుణప్రణాళిక విడుదల ఆలస్యమైంది. అధికారులు మాత్రం రుణప్రణాళికలో పేర్కొన్న లక్ష్యాలను అధిగమిస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే రూ.200 కోట్ల పంటరుణం
పంటరుణాల రూపంలో ప్రస్తుత ఆర్థికసంవత్సరంలో ఇప్పటికే రూ.200కోట్ల మేర రైతులకు మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ ‘సాక్షి’కి వెల్లడించారు. పంటరుణ మాఫీపై ప్రభుత్వం నుంచి ఇంకా మార్గదర్శకాలు అందాల్సి ఉన్నందున రైతులకు పరోక్షంగా రుణాలు అందేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. సుస్థిర వ్యవసాయం, స్వయం సహాయక సంఘాలు, వివిధ సంక్షేమశాఖల కార్పొరేషన్ల ద్వారా పరోక్ష పద్ధతిలో రుణ మంజూరుతో రైతులను ఆదుకుంటామని కలెక్టర్ ప్రకటించారు. బ్యాంకుల శాఖల పరిధిలో కనీసం 100 నుంచి 150 మంది కొత్త రైతులకు పంటరుణాలు అందేవిధంగా బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు.