భారత్ టూర్‌ను కుదిస్తే... దక్షిణాఫ్రికాకు రూ.200 కోట్లు నష్టం!
జొహన్నెస్‌బర్గ్: భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనపై ఇప్పటికే పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తిగా రద్దు చేసుకోకున్నా ఈ పర్యటనను కుదించుకునే ఆలోచనలో బీసీసీఐ ఉంది. ఇదే జరిగితే దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్ఏ) రోజుకు 2.5 మిలియన్ ర్యాండ్ (రూ.కోటీ 65 లక్షలు)లు నష్టపోతుందని స్థానిక బీల్డ్ అనే పత్రిక పేర్కొంది. ఓవరాల్‌గా 300 మిలియన్ ర్యాండ్ (దాదాపు రూ.200 కోట్లు)ల ఆదాయం కోల్పోయినట్టేనని, ఇది ప్రధానంగా టీవీ రైట్స్ రూపంలో ఉంటుందని తెలిపింది.
అయితే ఈ విషయాన్ని సఫారీ బోర్డు కోర్టులో తేల్చుకోలేని పరిస్థితి ఉందని, ఎందుకంటే ఐసీసీ ఎఫ్‌టీపీపై భారత్ ఇంకా సంతకం చేయలేదని చెప్పింది. భారత్ ఇక్కడ మూడు టెస్టులు, ఏడు వన్డేలు, రెండు టి20 మ్యాచ్‌లు ఆడుతుందని బీసీసీఐతో సంప్రదించకుండానే సీఎస్ఏ గతంలో ప్రకటించింది. దీంతో ఆగ్రహంతో ఉన్న భారత బోర్డు విండీస్, న్యూజిలాండ్‌లతో సిరీస్‌లను ప్రకటిస్తూ దక్షిణాఫ్రికా పర్యటనపై సందేహాస్పదంగా వ్యవహరిస్తోంది.