‘జవాబు-కానిది’ కాపాడేనా?
ఆ హెలికాప్టర్ల కాంట్రాక్టును రద్దు చేశామని కాంగ్రెస్ నేతలు గట్టిగా మాట్లాడుతున్నారు. మరి భారీ అడ్వాన్స్‌ను ఎందుకు తిరిగి రాబట్ట లేదు? ‘జవాబు-కానిది’ తాత్కాలిక ఉపశమనాన్ని కలిగించవచ్చు. కానీ అవినీతిని అది ‘సమస్య-కానిది’గా మార్చేయలేదు.
ప్రభుత్వ పరిభాషలో పత్రం- కానిది(నాన్-పేపర్) అనే పద బంధం వాడుకలో ఉంది. ఏ విధంగానూ కట్టుబడి ఉండాల్సిన పనిలేని అస్పష్ట వైఖరుల విష యంలో ప్రధానంగా దాన్ని వాడు తుంటారు. ఈ భావనను చివరి కొస వరకు సాగదీయగా తయారైన ‘‘జవాబు కానిది’’ (నాన్-రిప్లై) అనే సరికొత్త పద బంధాన్ని భారత రాజకీయాలు ఇక ఇప్పుడు గుర్తించాల్సి ఉంది. ఏదైనా ప్రశ్నకు స్పందించాల్సి వస్తే... అతిగా నొక్కి చెబుతూ, బిగ్గరగా అరవడం ద్వారా సమాధానంలోని సంది గ్ధాన్ని కప్పిపుచ్చడమే ఈ సరికొత్త పదబంధ ప్రయోజనం.
దీన్ని క్రికెట్ పరిభాషతో పోల్చి చెప్పాలంటే, మీరు స్నిక్ చేయదలుచుకుంటే (బ్యాట్ అంచును బంతికి తాకించి దారి మరల్చడం)... గట్టిగా స్నిక్ చేసేసి, స్లిప్స్‌లో అది క్యాచ్ కాకుండా బౌండరీ వైపు దూసుకుపోవాలని ప్రార్థించాలి. లంచాలు ఇచ్చినందుకు గానూ ఒక ఆయుధాల కంపెనీ ఉన్నతాధికారులకు శిక్షను విధిస్తూ ఇటాలియన్ కోర్టు సోనియా గాంధీ పేరును ప్రస్తావించింది. ఆ విషయం గురించి అడిగితే ఆమె ధిక్కారంగా తానెవరికీ భయపడనని బదులిచ్చారు. అది పూర్తి నిజం. సోనియా ఎవరికీ భయపడరు. కానీ ప్రశ్న అది కాదు.
సోనియాకు చట్టమంటే భయం లేకపోవడం కూడా నిజం కావచ్చు. గత మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ ప్రత్య క్షంగా లేదా పరోక్షంగా అధికారంలో ఉన్నప్పుడల్లా... సోనియాకే ఇతరులు భయపడ్డారు. ఆమె పార్టీ అధికా రంలో లేక, ఛిన్నాభిన్నమై ఉన్నప్పుడు కూడా ఆమెకున్న విశేషాధికారాల వల్ల, ఆమె వంశం వల్ల అది ఆమెకు పూర్తిగా దాసోహం అంటూనే ఉంది. ఆమె తప్పు చేయదు. ఆమె ఎన్నడూ జవాబుదారు కారు. అలాంటి నిరపేక్ష విధేయత వ్యసనంగా మారిపోగలదు. అయితే ఈ వ్యవహారం ఆ పార్టీకి, దాని నేతకూ మధ్యది. కాకపోతే అగస్టా-వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంతో సంబంధం ఉన్న కాంగ్రెస్ నేతలకు, దేశానికి మధ్య ఉన్న సంబంధం అంత సుకరమైనదేమీ కాదు. దేశం, తన డబ్బు ఏమైందో తెలుసుకోవాలని అనుకుంటోంది.
ఈ వ్యవహారానికి సంబంధించి ప్రశ్నలకు కొదవేమీ లేదు. ఈ కుంభకోణానికి గుండెకాయలాంటివాడైన జేమ్స్ క్రిస్టియన్ మైఖేల్ ఢిల్లీలోని అధికార వర్గాలకు సుపరి చితుడు. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలు విదే శాల్లో వెల్లడి కావడంతో సీబీఐ దీనిపై ప్రాథమిక దర్యాప్తును రిజిస్టర్ చేసిన మరుసటి రోజునే, 13 ఫిబ్రవరి, 2013న అతగాడు హఠాత్తుగా రాజధాని ఎలా వదిలి వెళ్లిపోయాడు? అగస్టా-వెస్ట్‌ల్యాండ్ అతగాడికి 1.8 కోట్ల యూరోలను (రూ. 135 కోట్లు)... అందులో 5% విలువ కూడా చేయని తీసిపారేసిన పవన్ హన్స్ హెలి కాప్టర్లను ‘‘కొనుగోలు’’ చేయడానికి ఎందుకు ఇచ్చినట్టు? (ఆ కంపెనీ పేరేమీ ఫాదర్ క్రిస్టమస్ ప్రైవేట్ లిమిటెడ్‌గా మార్చలేదే).
ఈ డబ్బు ఎవరి కోసం ఇచ్చినది? ఇటాలియన్ తీర్పు శక్తివంతమైన భారత ‘‘కుటుంబం’’ గురించి ప్రస్తావిం చింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఏ కుటుంబం అత్యంత శక్తివంతమైన కుటుంబం? ‘‘ఏపీ’’ కూడా ఈ వ్యవహారంలోని ఒక లబ్ధిదారని ఆ తీర్పు పేర్కొంది. ఆ ఏపీ ఎవరై ఉంటారు?
ఈ లంచం వ్యవహారం బయడపడటంతోనే ఆ హెలి కాప్టర్ల కాంట్రాక్టును రద్దు చేశామనే వాస్తవాన్ని గురించి కాంగ్రెస్ నేతలు గట్టిగా మాట్లాడుతున్నారు. ఇది చాలా ఆసక్తికరం. మరి అగస్టా-వెస్ట్‌ల్యాండ్ కాంట్రాక్టు కోసం ఇచ్చిన భారీ అడ్వాన్స్ ఏమైంది? ఆ అడ్వాన్స్‌ను ఎందుకు తిరిగి ఇవ్వలేదు? అడ్వాన్స్‌కు సరిపడా హెలికాప్టర్లనైనా ఇవ్వకుండానే ఆ డబ్బునంతా అట్టిపెట్టేసుకోవడమంటే అగస్టా-వెస్ట్‌ల్యాండ్ ఈ డబ్బు ఆట ఆడాక వచ్చే దానికి రెట్టింపును ముందుగానే రాబట్టుకోవడమే అవుతుందిగా?
భారత మీడియా ఈ వ్యవహారంలో కళ్లు మూసు కునేలా చేయడం కోసం అగస్టా-వెస్ట్‌ల్యాండ్ రూ. 50 కోట్లు కేటాయించింది లేదా మీడియా జరిపే విచారణల్లో తమ తరపున నిలిచి వాదించేవారి కోసం కేటాయించింది. ఇది ఇంకా తెరవాల్సి ఉన్న మరో పాముల బుట్ట.
ఈ వ్యవహారాన్ని కూడా ఎవరైనా బయటకు లాగొచ్చు. కానీ అది చేసినదాన్నే మళ్లీ చేయడమే అవు తుంది. ఈ విషయం లో కాంగ్రెస్ రక్షణ వ్యూహం తప్పుడు తడకలతో లేదా వాస్త వాలను మరుగుపరచే మాటల దుమారాల తో నిండి ఉండటంలో ఆశ్చర్యం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అగస్టా-వెస్ట్‌ల్యాండ్‌ను బ్లాక్‌లిస్ట్‌లో ఉంచిం దని ఆ పార్టీ నేతలు పార్లమెంటులో వాదిం చ డాన్ని గమనించండి. అది నిజం కాదు. లేదా ప్రస్తుత భారత ప్రధానికి, ఇటలీకి మధ్య ఒక రకమైన ఒప్పందం కుదిరిందన్న తప్పుడు వార్తా కథనాలపై ఆధారపడ్డ వారి ఆరోపణలను చూడండి. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో ఈ అబద్ధాన్ని పూర్తిగా బహిర్గతం చేశారు. అప్పటి నుంచి కాంగ్రెస్ ఈ కట్టుకథపై నోరెత్తడం మానేసింది.
మేకపోతు గాంభీర్యం వాస్తవాలకు ప్రత్యామ్నాయం కాదు. ఇటలీలోని ఒక కోర్టు కేసు పుణ్యమాని కొంత నాటకీయమైన వాస్తవాలు బయటపడటం మొదలైంది. దేశంలోని దర్యాప్తు పురోగతిని సాధించేకొద్దీ మరిన్ని విషయాలు ప్రజలకు తెలుస్తాయి. అధికార సాధనాలు మీ నియంత్రణలో ఉన్నప్పుడు నిజాన్ని దాచేయడం కోసం మీరు అబద్ధాల పరదాను అల్లవచ్చు. అయితే మీరు అధికారంలో ఉన్నంత కాలమే ఆ ఆట సాగుతుంది.
ఒకప్పుడు అవినీతికి వ్యతిరేకమైన శక్తులుగా సీపీఎం, సీపీఐలు అగ్రశ్రేణిలో నిలిచి దాడిచేస్తుండేవి. నేడు, మార్క్సి స్టులు రాజీపడిపోయారు. బెంగాల్లో వారు మమతా బెనర్జీ అవినీతిపై దాడి చేస్తారు. అదే అగస్టా-వెస్ట్‌ల్యాండ్ విష యానికి వచ్చేసరికి మౌనం వహిస్తారు. ఇందులో నిజాయితీ ఏమీ కనిపించదు.
పాశ్చాత్య ‘‘అవినీతికర పెట్టుబడిదారీ- పారిశ్రామిక- సైనిక వ్యవస్థ’’ను దండించాలని మార్క్సిస్టులు కోరుకోక పోతే చెప్పడానికి ఇక పెద్దగా ఏమీ ఉండదు, ఉంటుం దంటారా? జవాబు-కానిది సోనియాగాంధీకి, ఆమె పార్టీకి తాత్కాలికమైన ఉపశమనాన్ని కలిగించవచ్చు లేదా కలిగించ లేకనూ పోవచ్చు. అయితే అవినీతిని అది ఎన్నటికీ సమస్య-కానిదిగా మార్చేయలేదు.
- వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు,
బీజేపీ అధికార ప్రతినిధి
- ఎం.జె. అక్బర్
సీనియర్ సంపాదకులు